close

తాజా వార్తలు

బీఎస్పీ అభ్యర్థితో మేనకా గాంధీ గొడవ

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, భాజపా నేత మేనకా గాంధీ, బీఎస్పీ అభ్యర్థి చంద్ర భద్ర సింగ్‌ (సోను)కి మధ్య ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద చిన్నపాటి గొడవ చెలరేగింది. సోను మద్దతుదారులు ఓటర్లను బెదిరిస్తున్నారని మేనక ఆరోపించారు. ఇద్దరు నేతలు పరస్పరం చూపుడు వేలు చూపెడుతూ వాదనలకు దిగారు. రౌడీల్లా వ్యవహరించడం వల్ల ఓట్లు పొందలేరని ఆమె అనగా, తాను ఎటువంటి తప్పు చేయట్లేదని సోను సమాధానం ఇచ్చారు. బీఎస్పీ మద్దతు దారులు తమ నేతకు అనుకూలంగా నినాదాలు చేశారు.

‘పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించడానికి మేము ఇక్కడకు వచ్చాము. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి నేరపూరిత చర్యలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాం. జైలు నుంచి తప్పించుకుని వచ్చిన వ్యక్తి ఒకరు సోను సింగ్‌తో ఉన్నారు. వీరంతా ఓటర్లను భయపెడుతున్నారు.. ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ తీరు సరైంది కాదు. శాంతి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది’ అని మేనకా గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, భాజపా నేతల తీరే సరైన విధంగా లేదని సోను మీడియాకు తెలిపారు. ‘భాజపా నేతలు గత రాత్రి డబ్బు పంచుతుంటే అడ్డుకున్నందుకు మా కార్యకర్తలను కొట్టారు. ఈసీకి ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు.  



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net