close

తాజా వార్తలు

‘అందుకే అవినీతి ప్రస్తావన లేదు’

సిమ్లా: భాజపా అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని కచ్చితంగా రద్దు చేస్తామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పునరుద్ఘాటించారు. కశ్మీర్‌లోని రాజకీయ నాయకులు ప్రత్యేక ప్రధాని గురించి మాట్లాడుతున్నారని.. భాజపా ఉండగా అలా జరిగే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలతో పాటు దేశద్రోహ చట్టంలో మార్పులు తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. దీనివల్ల దేశ భద్రతకు తీవ్ర ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వాగ్దాలనాలన్నీ దేశ భద్రతపై వారి విధానాలకు నిదర్శనమన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం తన తొలి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై అమిత్‌ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో పాక్‌ మూకలు ఐదుగురు భారత సైనికుల తలలు నరికినా పట్టించుకోలేదని ఆరోపించారు. కానీ మోదీ ప్రభుత్వం అలా కాదని..బాలాకోట్‌ వంటి వైమానికదాడులకు ఏమాత్రం వెనకాడలేదన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత శ్యామ్‌ పిట్రోడా సిక్కుల ఊచకోతపై చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. కశ్మీరీ పండిట్లపై జరుగుతున్న దాడులు, ముంబయి ఉగ్రదాడి ఇలా వారి వైఫల్యాల్ని దేన్ని ప్రస్తావించినా..‘జరిగిందేదో జరిగిపోయింది’ అనే సమాధానమే వస్తుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక అవినీతిని పూర్తిగా నిర్మూలించారని.. అందుకే ప్రతిపక్షాలు ఆ అంశాన్ని ప్రస్తావించడం లేదన్నారు. ఈ సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. మండిలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ ర్యాలీలో హిమాచల్‌ సీఎం జైరాం ఠాకూర్‌తో పాటు భాజపా సీనియర్‌ నేత శాంత కుమార్‌ ఉన్నారు.



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net