close

తాజా వార్తలు

మేఘాల వల్ల యుద్ధవిమానాలు తప్పించుకున్నాయా?

-కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక

భటిండా(పంజాబ్‌): మేఘాల వల్ల భారత యుద్ధవిమానాలు పాకిస్థాన్‌ రాడార్‌ నుంచి తప్పించుకోగలిగాయని ప్రధాని మోదీ చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం పంజాబ్‌లోని భటిండాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన గురించి అసలు నిజాలు ప్రజల రాడార్‌కు తెలిసిపోయాయని అన్నారు. అయితే బాలాకోట్‌లో దాడులు జరిగిన రోజు మేఘాలు దట్టంగా కమ్ముకోవడం వల్ల మన యుద్ధవిమానాలు పాక్‌ విమానాల రాడార్‌కు దొరకలేదని మోదీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. భాజపా అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో 12,000 మంది రైతులు ఆత్యహత్యలకు పాల్పడ్డారని, వారిని పట్టించుకోవడంలో మోదీ విఫలమయ్యారంటూ విమర్శించారు. రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పిన మోదీ నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఈ ఐదేళ్లూ చేసిందేమీ లేకపోవడంతో భారత వాయుసేన జరిపిన దాడుల గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవాచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తద్వారా దేశాన్ని కాపాడుకోవడానికే ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. కాగా పంజాబ్‌లో అఖరి విడత మే19న ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మే 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net