అలాంటి పరిస్థితి వస్తే.. మేం రెడీ: సైన్యం 

తాజా వార్తలు

Updated : 17/09/2020 01:37 IST

అలాంటి పరిస్థితి వస్తే.. మేం రెడీ: సైన్యం 

దిల్లీ: భారత్‌ భూభాగాన్ని ఆక్రమించేందుకు దుష్ట పన్నాగాలు రచిస్తున్న చైనాకు భారత్‌ దీటుగా బదులిస్తోంది. ఇటీవల భారత్‌ సైన్యం శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రాసిన కథనంపై సైన్యం ఘాటుగా స్పందించింది. చైనా కుటిల యత్నాలను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనని ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. శీతాకాలాల్లో అయినా తూర్పు లద్దాఖ్‌ వద్ద యుద్ధానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నట్టు నార్తర్న్‌ కమాండ్‌ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు. ఒకవేళ చైనా యుద్ధ పరిస్థితులను సృష్టిస్తే మాత్రం సుశిక్షితులైన, మంచి సన్నద్ధత, మానసికంగా దృఢంగా ఉండే సైన్యాన్ని డ్రాగన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

శారీరకంగా, మానసికంగా యుద్ధ రంగంలోకి దూకే భారత బలగాలతో పోలిస్తే పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) దళాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు చెందినవేనని, క్షేత్ర పరిస్థితులలో కష్టాలను ఎదుర్కొని సుదీర్ఘకాలం పాటు మోహరించేందుకు ఉపయోగపడవని చురకలంటించారు. భారత్‌కు సరిపడినన్ని లాజిస్టిక్స్‌ అందుబాటులో లేవని, శీతాకాలంలో యుద్ధం వస్తే సమర్థంగా ఎదుర్కోలేదంటూ గ్లోబల్‌ టైమ్స్‌ రాసిన రాతలు చైనా అజ్ఞానానికి నిదర్శనమని తెలిపారు. భారత సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉందని, తూర్పు లద్దాఖ్‌ వద్ద శీతాకాలాల్లో సైతం యుద్ధం చేసేందుకు మించిన సామర్థ్యం ఉందని తెలిపారు. భారత్‌ శాంతికాముక దేశమని, ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలనే కోరుకుంటోందన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోనేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. 

లద్దాఖ్‌ రేంజ్‌లో హిమపాతం ఎక్కువగా ఉంటుందని, నవంబర్‌ తర్వాత దాదాపు 40 అడుగుల ఎత్తువరకు మంచు పేరుకుపోతుందన్నారు. మైనస్ 30 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని గుర్తుచేశారు. రహదారులు సైతం మంచుతో కప్పబడి ఉన్నటువంటి సవాళ్లతో కూడిన ప్రదేశాల్లో సైతం తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం భారత సైన్యానిదన్నారు. అలాంటి చోట్ల శత్రువులతో తలపడటంలో భారత సైనికులకు మంచి అనుభవమే ఉందన్నారు. తక్కువ సమయంలోనే మానసికంగా సిద్ధపడి కదన రంగంలోకి దూకే సైన్యం ఉండటం భారత్‌కు ఎంతో సానుకూల అంశమన్నారు. ప్రపంచం మొత్తానికి ఈ వాస్తవాలన్నీ తెలుసని చెప్పారు. మే నెలలో చైనా దూకుడుగా వ్యవహరించినప్పడే యుద్ధ సామగ్రిని, సామర్థ్యాన్ని మరింతగా పెంచుకున్నట్టు పేర్కొన్నారు. చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితుల కంటే కఠిననమైన, ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌ వద్ద వాతావరణం కూడా భారత్‌ సైన్యానికి అనుభవమేనన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని