చిప్‌ల కొరత.. కంప్యూటర్లు, ఫోన్లపై తీవ్ర ప్రభావం

తాజా వార్తలు

Published : 10/07/2021 01:10 IST

చిప్‌ల కొరత.. కంప్యూటర్లు, ఫోన్లపై తీవ్ర ప్రభావం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేడు మనం వినియోగించే అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో సెమీ కండక్లర్లు లేదా చిప్‌లు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల కొరత ఏర్పడటంతో.. దేశంలో పర్సనల్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల లభ్యతకు సంబంధించి 5 నుంచి 10 శాతం మేర ప్రభావం పడింది. అయితే మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ మీద దీని ప్రభావం గతంలో పెద్దగా పడలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే వినియోగదారుల డిమాండ్‌ మేరకు దేశీయ మార్కెట్‌లో ఇది వరకే భారీ ఎత్తున స్టాక్‌ పేరుకుపోయింది. ‘టెక్‌ ఏఆర్‌సీ’కి చెందిన మార్కెట్‌ రీసెర్చ్‌, అనలిటిక్స్‌ సంస్థ స్థాపకులు ఫైజల్‌ కవూజా మాట్లాడుతూ, ‘‘2021మార్చికి ముందు సెమీకండక్టర్ల కొరత గురించి అడిగితే.. అదంతా కేవలం ఊహాగానమేననీ, వాస్తవానికి అలాంటి కొరతేమీ లేదని చాలా బ్రాండ్లను అమ్మేవారి నుంచి సమాధానం వచ్చేది. అయితే మార్చి తర్వాత బాహాటంగానే చాలా బ్రాండ్లకు సంబంధించిన రిటైలర్లు సెమీకండక్టర్ల కొరత గురించి మాట్లడటం కనిపిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నట్లు కూడా చెబుతున్నారు’’ అన్నారు.

పంకజ్‌ మహేంద్ర, ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌, మాట్లాడుతూ.. సెమీకండక్టర్ల సరఫరా గొలుసులో వచ్చిన ఇబ్బందుల వల్ల 5 నుంచి 10 శాతం వరకు పర్సనల్‌ కంప్యూటర్లు అందుబాటులో లేవు. అయితే 2021 జనవరి నుంచి మార్చి వరకూ సెల్‌ఫోన్లపై దీని ప్రభావం పెద్దగా పడలేదని తెలిపారు.

కొవిడ్‌తో పెరిగిన డిమాండ్‌.. తగ్గిన సప్లయ్‌!

అయితే సెమీ కండక్టర్ల కొరత గతేడాది చివరిలో తలెత్తింది. ఎందుకంటే కరోనా మహమ్మారి వల్ల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌  చేయాల్సి రావడంతో ఉన్నపళంగా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల డిమాండ్‌ పెరిగింది. ఆ సమయంలోనే కొవిడ్‌ కేసులు ఎక్కువవుతుండటంతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేశాయి. దాంతో ఉత్పత్తి, సరఫరా గొలుసులో సమస్యలు తలెత్తాయి. గోల్డ్‌మాన్‌ శాక్స్‌ సంస్థ అంచనా ప్రకారం కనీసం 169 పరిశ్రమలకు ఈ కొరత వల్ల  దేశంలో తీవ్ర అంతరాయం కలిగింది.

స్మార్ట్‌ఫోన్లపై అంతగా ప్రభావం లేదా?

‘క్లయింట్‌ డివైజెస్ అండ్‌ ఐపీడీఎస్‌, ఐడీసీ ఇండియా’ రీసెర్చ్‌ డైరెక్టర్‌ నవకేందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్ల కంటే పర్సనల్‌ కంప్యూటర్ల మార్కెట్‌కు దీనివల్ల ఎక్కువగా ప్రభావం పడింది. దేశంలో విస్తారమైన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చాలామంది తయారీదారులు ఉండటంతో ఫోన్లపై దీని ప్రభావం అంతగా పడలేదని చెప్పారు. ‘‘మొబైల్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు చైనా, యూరప్‌, అమెరికా కంటే భారత్‌కు సప్లయ్‌ చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతుంటాయి. ఎందుకంటే ఇక్కడి మార్కెట్‌లోనే మిగతాచోట్ల కంటే అమ్మకాలు జోరుగా ఉంటాయి. ఆ రంగంలో మార్కెట్‌ వృద్ధికి ఇక్కడే ఎక్కువ అవకాశం ఉంది. అందుకే ఇతర ప్రాంతాలతో పోలిస్తే, ఇక్కడ సగటు అమ్మకపు ధర కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ కారణంగానే సెల్‌ఫోన్‌ తయారీదార్లు భారత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దాంతో ఇక్కడ ఫోన్లు బాగానే అందుబాటులో ఉన్నాయి’’ అని నవకేందర్‌ సింగ్‌ తెలిపారు.

పర్సనల్‌ కంప్యూటర్లకే తీవ్ర విఘాతం!

ఇక పర్సనల్‌ కంప్యూటర్ల విషయానికొస్తే వివిధ బ్రాండ్లు తయారు చేసే కంపెనీలు భారత మార్కెట్‌కంటే యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్‌లకే ప్రాముఖ్యమిస్తారు. ‘‘భారతదేశం ఒక ఓపెన్‌ మార్కెట్‌. ఆపిల్‌ లాంటి సంస్థలు ఇతర టెలికాం కంపెనీలతో ఇక్కడ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోలేదు.  అదే యూరప్‌ మార్కెట్‌లో చూస్తే, వొడాఫోన్‌తో ఒప్పందంలో ఉన్నారు. అక్కడ ఇలాంటి భాగస్వామ్యాలు ఉండటం వల్ల భారత్‌కంటే ఆయాదేశాల మార్కెట్‌ అవసరాలను తీర్చడమే ప్రాధాన్యంగా ఉంటుంది’’ అని సింగ్‌ అన్నారు.

హెచ్చరించిన శాంసంగ్‌ కంపెనీ!

ఇదిలా ఉంటే, తాజాగా శాంసంగ్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ బృందం రిటైల్‌ అమ్మకపుదార్లను హెచ్చరించింది. చిప్‌లు, ఇతర పరికరాల కొరత వల్ల రాబోయే నెలల్లో ఫోన్ల సప్లయ్‌లో 70 శాతం కోత పడవచ్చని తెలియజేసింది. మరోవైపు ఆపిల్‌, హెచ్‌ఫీ, లెనొవా, డెల్‌, షియామీ, వన్‌ ప్లస్‌, రియల్‌ మీ బ్రాండ్ల ఉత్పత్తుల కొరత కూడా ఎక్కువవుతోందని రిటైలర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల తయారీలో ఇబ్బందుల వల్ల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ టీవీలు, ఇంటర్నెట్‌కు అనుసంధానించుకునే పరికరాల సప్లయ్‌లో కొరత తీవ్రమవుతోందని తెలుస్తోంది.

ఎప్పటికి పుంజుకోవచ్చు?

నిపుణులు చెప్పేదేమంటే, సెమీకండక్టర్ల కొరత మరికొన్ని త్రైమాసికాలు ఇలాగే కొనసాగుతుంది. ఇండియా ఎలెక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీ కండక్టర్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ ఖుషు మాట్లాడుతూ, ‘‘చాలామంది చిప్‌ తయారీదారులు, సిలికాన్‌ పరిశ్రమ యజమానులు తగిన చర్యలు చేపట్టారు.  తమ ప్లాంట్లలో మరింత సమర్థవంతంగా, అధికంగా ఉత్పత్తి చేసేందుకు, సెమీకండక్టర్ల అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకునేందుకు అంగీకరించారు. అయితే వెంటనే పరిష్కారమయ్యే సమస్య ఇది కాదు. ఇప్పటి నుంచి ప్రయత్నించడంతో వచ్చే ఏడాది మధ్య భాగానికల్లా డిమాండ్‌-సప్లయ్‌ గొలుసులో వచ్చిన ఈ ఇబ్బందులు తొలగిపోతాయి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని