కేసీపీ సంస్థల అధినేత లక్ష్మణదత్‌ ఇకలేరు

తాజా వార్తలు

Published : 19/02/2020 00:47 IST

కేసీపీ సంస్థల అధినేత లక్ష్మణదత్‌ ఇకలేరు

చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్‌ కన్నుమూశారు. చెన్నై  ఎగ్మోర్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. లక్ష్మణదత్‌కు భార్య ఇందిరా దత్‌, కుమార్తె కవిత ఉన్నారు. డిసెంబర్‌ 27, 1937న జన్మించిన దత్‌.. మద్రాసు తెలుగు సమాఖ్య ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. రాష్ట్ర పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించారు. 1989లో ఆయనను యాజమాన్య రత్న పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. 1991లో నాగార్జున యూనివర్సిటీ డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ డిగ్రీని ప్రదానం చేసింది. ఆయన గతంలో ఫిక్కీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, గుంటూరు జిల్లా మాచర్ల, చెన్నైలో కేసీపీ పరిశ్రమలను స్థాపించారు.

దత్‌ మృతి పారిశ్రామిక రంగానికి తీరని లోటు: ఉపరాష్ట్రపతి
వీఎల్‌ దత్‌ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. మరణవార్త తెలిసిన అనంతరం ఆ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. దత్‌ మృతి భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో వీఎల్‌ దత్‌ సేవలు మరవలేమన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడుల విదానంలో ఆయన నిష్ణాతుడని కొనియాడారు. 

వీఎల్‌ దత్‌ మృతికి చంద్రబాబు సంతాపం
వీఎల్‌ దత్‌ మరణం పట్ల తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. పరిశ్రమల అభివృద్ధికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. పల్నాడు, ఉయ్యూరులో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. సామాజిక సేవ, భాషాభివృద్ధికి దత్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. 

మంచి మిత్రుడినికోల్పోయా: నామా
కేసీపీ సిమెంట్స్‌ అధినేత వీఎల్‌ దత్‌ మరణం పట్ల తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మంచి మిత్రుడిని కోల్పోయానన్నారు. దత్‌ మంచి వ్యాపారవేత్త అనీ.. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ముందుండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. బుధవారం చెన్నై వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటానని నామా తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని