లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠినచర్యలు:ఏపీ ప్రభుత్వం

తాజా వార్తలు

Updated : 23/03/2020 16:40 IST

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠినచర్యలు:ఏపీ ప్రభుత్వం

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ నీలం సాహ్ని

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్రమంతటా లాక్‌డౌన్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం జగన్‌ ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 31వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి మార్చి 31వ తేదీ వరకూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రజా రవాణా వ్యవస్థ తక్షణమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆటోలు, ట్యాక్సీలు సైతం నిలిపివేయాలని నిర్ణయించింది. ఆస్పత్రులకు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు వచ్చి వెళ్లేందుకు పరిమితంగా మినహాయింపు నిచ్చింది. రాష్ట్రాల మధ్య ప్రజా, ప్రైవేటు రవాణా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. నిత్యావసరాలు మినహా మిగతా దుకాణాలు, మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు 31వ తేదీ వరకూ మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తప్పనిసరిగా ఉత్పత్తి కొనసాగించాల్సిన వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీలు, గోదాములు ముందస్తు అనుమతితో పరిమిత సిబ్బందితో పని చేయాలని సూచించింది. మతపరమైన ప్రార్థనలు, పూజలు 31వ తేదీ వరకు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ వంద పడకల ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ 200 నుంచి 300 పడకల అత్యాధునిక చికిత్స సౌకర్యాలతో వార్డులు ఏర్పాటు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో పది మంది కంటే ఎక్కువగా గుమిగూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు తప్పని సరిగా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పెట్రోల్ బంకులు, గ్యాస్, మందులు లాంటి అత్యవసర సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కల్పించినట్లు ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో పాటు రైతులు, రైతు కూలీలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. లాక్‌డౌన్‌ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు, పోలీసులకు ప్రభుత్వం సూచించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని