Top Ten News @ 1 PM
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM

1. Lockdown: తెలంగాణలో అమల్లోకి..

తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ సడలింపులు ముగియడంతో ఈ ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సమయం దగ్గర పడటంతో ఇళ్లకు చేరుకునేందుకు పలువురు ఉరుకులు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేశారు. 

2. Nurses Day: వారి సేవ‌లు మ‌రువ‌లేనివి

అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా న‌ర్సులంద‌రికీ తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. 'న‌ర్సుల సేవ‌లు, త్యాగం మ‌రువ‌లేనివి. ఎంతో స‌హ‌నంతో రోగుల‌ను త‌ల్లిలా చూసుకుంటారు. క‌రోనా బాధితుల‌ను కాపాడేందుకు న‌ర్సులు త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతున్నారు. నేటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వారి రుణం తీర్చుకోలేనిది' అని సీఎం అన్నారు. క‌రోనా స‌మ‌యంలో న‌ర్సుల సేవ‌లు అనిర్వ‌చ‌నీయ‌మ‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు కొనియాడారు. న‌ర్సులకు శుభాకాంక్ష‌లు తెలిపిన ఆయ‌న‌.. కొవిడ్‌పై పోరాటంలో వారి సంక‌ల్పం స్ఫూర్తిదాయ‌క‌మ‌న్నారు.

3. ''ఇంటింటికీ రేష‌న్ కాదు వ్యాక్సిన్ ఇవ్వ‌మంటున్నారు''

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌లు అమ్మ ఒడికి బ‌దులు ఆక్సిజ‌న్ ఇవ్వమంటున్నార‌ని తెదేపా నేత న‌క్కా ఆనంద‌బాబు తెలిపారు. వ‌స‌తిదీవెన వ‌ద్దు ఆస్ప‌త్రిలో వ‌స‌తి క‌ల్పించ‌మంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు.  రేప‌టికి బ‌తుకుతామ‌నే భ‌రోసా కల్పించ‌మంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇంటింటికి రేష‌న్ బ‌దులు వ్యాక్సిన్ ఇవ్వ‌మని ప్ర‌జ‌లు కోరుతున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే చంద్ర‌బాబుపై కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. సీఎం జ‌గ‌న్ త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికి ఇత‌రుల‌పై నింద‌లు వేయ‌డం స‌రికాద‌ని గుంటూరు జిల్లా తెదేపా అధ్య‌క్షుడు జీవీ ఆంజ‌నేయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

కోర్టులు చెప్పినా స్పందించరా?: విష్ణువర్ధన్‌రెడ్డి

4. TTD: ప్రత్యేక దర్శనం భక్తులకు వెసులుబాటు

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెసులుబాటు కల్పించింది. దర్శనం తేదీని మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తితిదే ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్లు పొందిన భక్తులు దర్శనానికి రాలేకపోతున్నట్లు గుర్తించింది. రోజుకు 15వేల టికెట్లు అందుబాటులో ఉన్నా స్వామివారి దర్శనానికి 3వేలలోపే వస్తుండటంతో ఈ మార్పు చేసింది. 

5. Corona: వైరస్‌ను జయించినా మరో వేదన!

కరోనా వచ్చి పోయింది... బయటపడ్డాంలే అని అనుకుంటున్న వారిని అనేక ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. హృదయ సంబంధ సమస్యలైతే ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కొందరిలో తీవ్రమైన ఒంటి నొప్పులు, నీరసం, కీళ్ల నొప్పులు కనిపిస్తున్నాయి. కనీసం వంద మీటర్లు వేగంగా నడవలేని దుస్థితి మరికొందరిది. తీవ్రంగా చెమట పట్టడం, ఆయాసం, నిస్సత్తువ, నిద్రలేమి నిలువునా కుంగదీస్తున్నాయి. కరోనా రెండో దశలో ప్రతి పది మందిలో ఆరుగురికి దాదాపు ఇవే సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

6. B.1.617: భారత్‌ రకం స్ట్రెయిన్‌ 44 దేశాల్లో

భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన కరోనా బి.1.617 వైరస్‌ రకం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు పాకింది. ఇప్పటివరకు 44 దేశాల్లో ఈ రకం వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం వెల్లడించింది. బి.1.617లో అనేక ఉప రకాలు ఉన్నాయి. ఇది జంట ఉత్పరివర్తనాల వైరస్‌ రకం. ఈ స్ట్రెయిన్‌ తొలిసారిగా భారత్‌లో బయటపడగా.. 44 దేశాలు అప్‌లోడ్‌ చేసిన 4500 నమూనాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

7. చల్లారని చమురు మంట..భోపాల్‌లోనూ సెంచరీ!

దేశంలో ఇంధన ధరల పెంపు వరుసగా మూడోరోజూ కొనసాగింది. డీజిల్‌, పెట్రోల్ ధరను లీటరుకు 25 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.92.05కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.82.61కి పెరిగింది. ఇతర నగరాల్లో చూస్తే ముంబయిలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం లీటరు ధర రూ.98.36గా ఉంది. డీజిల్ ధర రూ.89.75కి చేరింది. చెన్నైలో లీటరు ధర రూ.93.84 ఉండగా.. డీజిల్ రూ.87.49కి చేరింది.

8. కుప్పకూలిన 13 అంతస్తుల టవర్‌..!

పాలస్తీనా మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ మధ్య భీకర పోరు జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్‌ విమానాలు నిర్వహించిన దాడిలో గాజాలోని 13 అంతస్తుల హందాయి టవర్‌ కుప్పకూలింది. ఈ భవనంలో హమాస్‌ నాయకుల గృహాలు, కార్యాలయాలు ఉన్నాయి. దాడికి ముందు ప్రజలను ఖాళీ చేయాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 31కి చేరింది. ఇరు పక్షాలు  సంయమనం  పాటించాలని  అంతర్జాతీయ సమాజం కోరుతోంది. గాజాపట్టీలోనే మరో భవనాన్ని కూడా ఇజ్రయెల్‌ దళాలు కూల్చినట్లు వార్తొలొస్తున్నాయి.

9. cow dung: ‘ఆవుపేడ చికిత్స’ ప్రమాదకరం

ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకోమైకోసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ముప్పు ఉంటుందని గుజరాత్‌ వైద్యులు హెచ్చరించారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకంతో... ఇక్కడి శ్రీస్వామి నారాయణ్‌ గురుకుల్‌ విశ్వవిద్యా ప్రతిష్ఠానంలో కొందరు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు. ప్రతి  ఆదివారం కొంతమంది ఇక్కడకు వచ్చి పేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు. కొద్దిసేపు అయ్యాక ఆవు పాలతో శుభ్రం చేసుకుంటున్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఔషధ దుకాణాల్లో పనిచేసేవారు కూడా ఈ చికిత్స పొందుతున్నారు!

10. Corona: కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నట్లే కన్పిస్తున్నా.. మరణాలు మాత్రం భారీ స్థాయిలో ఉంటుండం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి రోజువారీ మరణాలు 4వేలు దాటాయి. ఇక మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2,54,197 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇక వరుసగా మూడో రోజు రోజువారీ కేసులు 4 లక్షల దిగువనే ఉండటం కాస్త ఊరటనిస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 19,83,804 మంది వైరస్‌ పరీక్షలు చేయించుకోగా.. 3,48,421 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.33కోట్లకు చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని