విడాకులు తీసుకుందని.. అందాల కిరీటాన్ని లాగేస్తే?
close

తాజా వార్తలు

Published : 08/04/2021 01:12 IST

విడాకులు తీసుకుందని.. అందాల కిరీటాన్ని లాగేస్తే?

మిసెస్ శ్రీలంక పోటీల్లో రసాభాస

కొలంబో: ‘మిసెస్‌ శ్రీలంక’ కోసం దేశవ్యాప్తంగా జరిగిన అందాల పోటీల్లో చివరి ఘట్టం మొదలైంది. తీవ్ర ఉత్కంఠ మధ్య న్యాయనిర్ణేతలు పుష్పిక డి సిల్వ పేరును ప్రకటించారు. మిసెస్ వరల్డ్ చేత సగర్వంగా కిరీటాన్ని ధరించిన పుష్పిక..తన విజయానికి గుర్తుగా వేదిక మీద నడిచారు. పక్కనే రన్నరప్‌లు, మిగతా వీక్షకులు ఆమెవైపు అభినందనగా చూస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అసలు కథ ఇక్కడే నడిచింది. ప్రస్తుతం మిసెస్‌‌ వరల్డ్‌గా ఉన్న 2019 మిసెస్‌ శ్రీలంక వ్యవహరించిన తీరు అందాల పోటీలను రసాభాసగా మార్చాయి. దాంతో ఆ పోటీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

జూరీ వేదికపై మిసెస్ వరల్డ్‌గా ఉన్న కరోలిన్‌ మాట్లాడుతూ.. పోటీల నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న మహిళకు కిరీటాన్ని స్వీకరించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ వివాహం చేసుకుని, విడాకులు తీసుకోకూడదనే నిబంధన ఉంది. అందువల్ల ఈ కిరీటం మొదటి రన్నరప్‌కు వెళ్తుంది’ అంటూ పుష్పిక తలపై ఉన్న కిరీటాన్ని వేగంగా తీసి, మొదటి రన్నరప్‌ తలపై ఉంచారు. ఆ కిరీటాన్ని బలవంతంగా తీసే క్రమంలో మిసెస్ శ్రీలంకకు గాయాలు కూడా అయ్యాయి. కానీ  అవేవి పట్టించుకోకుండా వేదికపై తనపని తాను చేసుకుపోయింది. ఆ పరిణామం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. తీవ్ర నిరాశకు గురైన పుష్పిక వేదిక వెనకవైపు నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారమంతా జాతీయ మీడియాలో ప్రసారం కావడం గమనార్హం. 

దీనిపై ఆగ్రహానికి గురైన పుష్పిక పేస్‌బుక్‌లో తన ఆవేశాన్నంతా వెళ్లగక్కారు. ‘నేను విడాకులు తీసుకోలేదు. ఒకవేళ నేను విడాకులు తీసుకొని ఉంటే..ఆ పత్రాలు సమర్పించాలని వారికి సవాలు విసురుతున్నాను. నాకు జరిగిన అవమానానికి, అన్యాయానికి ఇప్పటికే చట్టపరంగా ముందుకెళ్లాను’ అంటూ పోస్టు చేశారు. అలాగే ‘నిజమైన రాణి అంటే ఇతరుల కిరీటాన్ని దోచుకెళ్లే మహిళ కాదు’ అంటూ మండిపడ్డారు.

ఇదిలా ఉండగా, అందాల పోటీల నిర్వాహకులు దీనిపై స్పందించారు. పుష్పిక విడాకులు తీసుకోలేదని చెప్పడంతో పాటు ఆమెకు మళ్లీ కిరీటాన్ని అందజేశారు. అనంతరం మిసెస్‌ శ్రీలంక మాట్లాడుతూ.. ‘ఈ దేశంలోని ఒంటరి తల్లులందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను’ అని చెప్పారు.  ఈ ఘటనపై మిసెస్ శ్రీలంక వరల్డ్ డైరెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కరోలిన్‌ వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉంది. మిసెస్ వరల్డ్ సంస్థ ఇప్పటికే ఆమెపై దర్యాప్తు ప్రారంభించింది’ అని తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని