Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 27/10/2021 20:58 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

1. ముగిసిన హుజూరాబాద్‌, బద్వేల్‌ ఉపఎన్నిక ప్రచారం

తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్‌ ఉపఎన్నిక ప్రచారం ముగియడంతో ఎన్నిక నిర్వహణపై అధికారులతో రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు సమీక్ష చేపట్టారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టకుండా చూడాలని ఆదేశించారు.  ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేయాలన్నారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలింగ్‌ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా బలగాలను మోహరించాలన్నారు. 

2. ఏపీలో కేసీఆర్‌ పార్టీ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా?: సజ్జల

ఏపీలో కరెంటు కోతలు విధిస్తున్నారని తెరాస అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే తెలంగాణకు మిగులు కరెంటు వచ్చిందన్నారు. ఏపీలోనూ పార్టీ పెట్టాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సజ్జల స్పందించారు. కేసీఆర్‌.. ఏపీలో పార్టీ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా? పార్టీ పెట్టొద్దని ఎవరూ చెప్పలేదన్నారు. ఎవరైనా రావచ్చని, ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు.

3. ఏపీలో భారీ పర్యాటక ప్రాజెక్టులు.. ఎస్‌ఐపీబీ ఆమోదం

ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించారు. పలు ప్రతిపాదనలకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయని.. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2,868.60 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్‌ఐపీబీ వెల్లడించింది.

4. వివేకా హత్య కేసు.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా నలుగురు నిందితులపై ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న టి.గంగిరెడ్డి, వై.సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిన్న ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

5. మరో రూ.100 పెరగనున్న వంటగ్యాస్‌ ధర!

దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. అవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం వంట గ్యాస్ ధర సిలిండర్‌కు రూ.100 మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నష్టాలను తగ్గించుకునేందుకు చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకోనున్నాయని.. ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ మేరకు పెంపు ఉంటుందని సమాచారం. జులై నుంచి అక్టోబరు 6 వరకు దీని ధర రూ.90 పెరిగింది.

6. ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు నామినేట్‌ అయ్యింది వీరే..

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న-2021 అవార్డుకు 11 మంది, అర్జున అవార్డుకు 35 మంది అథ్లెట్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం నామినేట్‌ చేసింది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ ఖేల్‌రత్నా అవార్డుకు నామినేట్‌ అయ్యారు. క్రికెటర్‌ శిఖర్‌ దావన్, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవీనా పటేల్‌ తదితరులు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. 

7. భారత్‌పై ‘కాట్సా’ వద్దు.. బైడెన్‌కు సెనేటర్ల లేఖ!

రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ దూరశ్రేణి క్షిపణులను కొనుగోలు చేయకుండా భారత్‌పై ఆంక్షలు విధించొద్దని అమెరికాలో ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌కు లేఖ రాశారు. ఈ మేరకు క్షిపణుల కొనుగోలుకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్న ‘కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్సరీస్‌ థ్రూ సాంక్షన్స్‌ యాక్ట్‌ (కాట్సా)’ ఆంక్షల్ని భారత్‌పై అమలు చేయొద్దని కోరారు. 

8. ముగ్గురు టెక్‌ దిగ్గజ నిపుణులతో పెగాసస్‌ దర్యాప్తు..!

దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన పెగాసెస్‌ హ్యాకింగ్‌ ఉదంతంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ నేతృత్వంలో జరిగే ఈ దర్యాప్తును చేపట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌తోపాటు నెట్‌వర్క్స్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో అత్యంత అనుభవం ఉన్న ముగ్గురు నిపుణులను సుప్రీం కోర్టు ఎంపిక చేసింది. 

9. దేశం, వ్యవస్థ కంటే మోదీ ఎక్కువ కాదు.. సుప్రీం తీర్పుపై రాహుల్‌

పెగాసస్‌ స్పైవేర్‌ (Pegasus Spyware)తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్వాగతించారు. పెగాసస్‌పై కమిటీ ఏర్పాటుతో గొప్ప అడుగు పడిందని, దీంతో నిజానిజాలు బయటకు వస్తాయన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. దేశం, వ్యవస్థల కంటే ప్రధాని ఎక్కువ కాదన్నారు.

10. మంత్రి గారూ.. ఆరోపించడం కాదు, రుజువు చూపించండి..!

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్ (Aryan Khan) అరెస్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన NCB జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే (Sameer Wankhede) తన మతమార్పిడి గురించి వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ (Nawab Malik) చేసిన వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చారు. తన మొదటి వివాహం గురించి మాలిక్‌ ట్విటర్‌లో ఫొటో షేర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని