close

తాజా వార్తలు

రక్తంచాలక.. ప్రమాద ఘంటిక

 జిల్లాలో ప్రమాదకర పరిస్థితి

బాధితుల్లో గర్భిణులు, బాలింతలు

 పోషకాహార లోపంపై అవగాహనా రాహిత్యం

 

న్యూస్‌టుడే, పుత్తూరు: రక్తహీనతతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పేద, మధ్య తరగతి వర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో మరింత ఎక్కువగా ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పేదరికం కారణంగా సరైన పౌష్టికాహారం తీసుకోక పోవడం సమస్యకు మూలకారణంగా గుర్తించారు. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోవడం వల్ల రక్తహీనతే కాదు, అనేక రుగ్మతల బారిన పడుతున్నారు. జిల్లాలో ప్రమాద ఘంటిక మోగిస్తున్న ఈ సమస్యపై ‘న్యూస్‌టుడే’ కథనం..

రక్తహీనతను అధిగమించాలంటే..

*● రక్తహీనతను అధిగమించాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి

*● గర్భిణులు ఎక్కువగా ఆకుకూరలు, ఎర్రని పండ్లు అంటే ఆపిల్‌, బత్తాయి, దానిమ్మ వంటివి తీసుకోవాలి.

*● కోడిగుడ్లు, రెడ్‌ మీట్‌, మాంసం, చేపల్లో ఐరన్‌ మోతాదు ఎక్కువ..

*● సీవిటమిన్‌ ఉండే సిట్రస్‌ జాతి ఫలాలు.

*● గోంగూర, మెంతికూర, వేరుసెనగ విత్తనాలు, బెల్లంతో చేసిన చిక్కీలు, కొర్రలు, రాగులు, బెల్లం తదితర వాటిలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం మన దేశంలో సుమారు సగానికి సగం గ్రామీణ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో మాతాశిశు మరణాలు, గర్భిణుల మరణాలు ప్రతి వెయ్యి మందిలో సుమారు 200 వరకు ఉండేవి. ఇప్పుడవి 16కి తగ్గించగలిగారు. ఈ సగటు కంటే జిల్లాలో మాతా శిశు మరణాల రేటు అధికంగా ఉంది. మదనపల్లె, చిత్తూరు డివిజన్లలో తరచూ బాలింతల మరణాలు వెలుగుచూస్తున్నాయి. కేసులు నమోదై.. రికార్డుల్లోకి ఎక్కేవి కొన్నే ఉంటున్నాయి. చిత్తూరు డివిజన్‌లోని కార్వేటినగరం, పిచ్చాటూరు, కేబీవీపురం, నారాయణవనం, పుత్తూరు గ్రామీణ తదితర మండలాల్లో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల చేపట్టిన జిల్లా అధికారుల సర్వేలో బయటపడింది.

*● జిల్లాలో ప్రతి వంద మంది మహిళల్లో సుమారు 40 మందిలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తేలింది. యుక్తవయస్సు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. గర్భిణుల్లో 40శాతం, పిల్లల్లో 18, పురుషుల్లో 15, సాధారణ మహిళలు 20 శాతం మంది రక్తహీనత బాధితులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

సమస్యకు మూలాలివి..

రక్తహీనతకు ప్రధాన కారణం పౌష్టికాహారలోపమే. తీసుకునే ఆహారంలో ఐరన్‌ లోపిస్తే.. అది రక్తహీనతకు దారితీస్తుంది. ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నా.. సమస్య తీవ్రంగా ఉండటం గమనార్హం. పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులతో పాటు బాలింతలకు పాలు, ఉడకబెట్టిన గుడ్లు, భోజనం ఇస్తున్నారు. గత ఏడాదిగా ‘బాలసంజీవని’ పథకం కింద ఐరన్‌ అధికంగా లభించే చిక్కీలు, ఖర్జూరం వంటివి కూడా సరఫరా చేస్తున్నారు. అయినా.. లోపాలు యథాతథంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ ఆరోగ్యం, తీసుకునే ఆహారం, లోపాలను అధిగమించడం, చికిత్స తీసుకోవడంపై ప్రజల్లో అవగాహనా లోపమే పెద్ద సమస్య అని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు పెంచాల్సిన అవసరాన్ని కుటుంబ సర్వే హెచ్చరిస్తోంది.

ఈ లక్షణాలు కన్పించాయా..?

రక్తహీనత వల్ల పిల్లల్లో అయితే తీవ్ర సమస్యలొస్తాయి. కళ్లు తిరిగిపడిపోవడం, నడుస్తుండగా తుళ్లిపడటం, ఆయాసం, శ్వాసలో ఇబ్బందులు, బడలిక, ఒళ్లునొప్పులు రావడం, గుండెదడ ప్రాథమిక లక్షణాలు.

*● గర్భిణుల్లో అయితే పాలిపోవటం, కాళ్లవాపు, ముఖం వాపు వంటివి కన్పిస్తాయి. కళ్లు మసకబారటం, తలనొప్పి, వాంతులు, మూత్రం తగిన మోతాదులో రాకపోవడాన్ని ఎనీమియా అనుమానించాలి. వైద్యులతో నిర్ధరించుకోవాలి.
*● కడుపునొప్పి, ఉండవలసిన దాని కన్నా ఎక్కువ ఆకారంలో పొట్ట ఉండటం, బిడ్డ తక్కువగా తిరుగుతుండడం, ఉమ్మునీరు పోతుండడం కూడా ప్రమాదకర హెచ్చరికలే.

*● పుత్తూరు మండలం గొల్లపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఓ కోళ్లఫారం వద్ద పనిచేస్తున్న మహిళ నిండు గర్భిణి. ప్రసవం కోసం పుత్తూరు ఆస్పత్రికి రాగా.. పరీక్షించిన వైద్యులు ఆమె రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం మరీ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 5గ్రా/డీఎల్‌ గా ఉన్నందున అక్కడి పీహెచ్‌సీలో ప్రసవం చేయడం కష్టంగా భావించి తిరుపతికి రెఫర్‌ చేశారు. ఇక్కడ రక్తం ఎక్కించిన తర్వాతే ప్రసవం చేయించాల్సి వచ్చింది.

*● ఇదే పీహెచ్‌సీకి ఇటీవల పిచ్చాటూరు మండలం అడవి కొడియంబేడు గ్రామానికి చెందిన తులసి డెలివరీ కేసుగా రాగా.. ఆమె రక్తంలోనూ హిమోగ్లోబిన్‌ 5 గ్రాములే ఉంది. నారాయణవనం, కేవీబీపురం, నిండ్ర, వడమాలపేట తదితర మండలాల నుంచి ఈ తరహా కేసులు ఎక్కువగా పుత్తూరు ఆస్పత్రికి వస్తుంటాయి. సగానికి పైగా కేసుల్లో గర్భిణుల రక్తం (డెసీలీటర్‌)లో 5-8 గ్రాముల హిమోగ్లోబిన్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలుతోంది. కనీసం 12 గ్రా. ఉంటే కాని కాన్పు చేయలేని పరిస్థితుల్లో వీరందరికీ రక్తం ఎక్కించాల్సి వస్తోంది.

*● ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఓ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ప్రార్థన సమయంలో ఉన్నట్టుండి కింద పడిపోయింది. ఉపాధ్యాయులు ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించగా.. ఆ బాలికలో రక్తహీనత (ఎనీమియా) లక్షణాలు బయటపడ్డాయి. హిమోగ్లోబిన్‌ కేవలం 6 గ్రా/డీఎల్‌ ఉన్నట్లు తెలింది. కొద్దిరోజులుగా నీరసంతో ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులు గమనించలేదు. అప్పటికప్పుడు నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు.

ప్రాథమిక స్థాయిలో అవగాహనా లోపం వల్లే..

సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారికి అవగాహన కల్పించాలి. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం విధిగా తీసుకునేలా వారికి తెలియజేయాలి. ఆయా ఏరియాల్లో పనిచేసే ఏఎన్‌ఎం, ఆశావర్కర్లును, అంగన్‌వాడీ కార్యకర్తలు బాధ్యతగా చూడాలి. అలాగే పీహెచ్‌సీ డాక్టర్లు తరచూ పరిశీలన చేయాలి. తద్వారా మాతా శిశుమరణాలు తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులు ఐరన్‌, పోలిక్‌యాసిడ్‌ మాత్రలు వాడాలి. దాంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ఈ విషయాన్ని గర్భిణుల భర్తలకు, అత్తమామలకు, వారి తల్లిదండ్రులు విధిగా చెప్పాలి. తద్వారానే సమస్యను పరిష్కరించవచ్ఛు

- డాక్టర్‌ సరళమ్మ, డీసీహెచ్‌ఎస్‌, చిత్తూరు.

 
అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం అందిస్తున్న దృశ్యం (దాచినచిత్రం)

గర్భిణులు: 52,440 (జూన్‌ మొదటి వారంలో)

0-6లోపు పిల్లలు: 4.60 లక్షలు

బాలింతలు: 39,671 (జూన్‌ మొదటి వారంలో)


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.