close

తాజా వార్తలు

పూజారే సూత్రధారి

పంచలోహ విగ్రహాల దొంగల అరెస్టు

రూ.45 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ డీఎస్పీ

ప్రసాద్‌కుమార్‌, చిత్రంలో దర్శి డీఎస్పీ ప్రకాశరావు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అది 12వ శతాబ్దం నాటి శివాలయం.. కొరిశపాడు మండలం తమ్మవరం ప్రాంతంలోని అనమనమూరు కొండపై ఉండేది. అక్కడ పంచలోహ దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేవారు. గుండ్లకమ్మ నదీ పరివాహకం కావడంతో ఇసుక మేట వేసింది. అప్పట్లో ఆలయానికి వెళ్లేందుకు దారులు మూసుకున్నాయి. దాంతో ఏళ్ల కిందటే తమ్మలూరులోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయానికి ఆ విగ్రహాలను తరలించి... అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడే పూజలు నిర్వహించేవారు. గత నెల 21వ తేదీ తమ్మవరంలోని అన్నపూర్ణాదేవి, అదే మండలం రాచపూడిలోని వీరభద్రస్వామితో పాటు మరో మూడు చిన్న విగ్రహాలు మాయమయ్యాయి. దాంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు- ఈ కేసులో ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్న వ్యక్తే చోరీ వెనుక సూత్రధారిగా గుర్తించారు. ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 45 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎస్‌ డీఎస్పీ ఎ.ప్రసాద్‌కుమార్‌, దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు వివరాలు వెల్లడించారు.

పోలీసుల కథనం మేరకు....అద్దంకి ప్రాంతంలోని కొణిదెనను రాజధానిగా చేసుకుని క్రీ.శ 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు చోళరాజులు పరిపాలించారు. వీరు శైవులు. వీరి పాలన బాపట్ల నుంచి కొత్తపట్నం, ఒంగోలు, యరజర్ల ప్రాంతాల వరకు సాగింది. ఆ కాలంలో వారు కొణిదెన, ముక్తేశ్వరం, మణికేశ్వరం, వైదన, అద్దంకి, తమ్మవరం, కొరిశపాడు, కొత్తపట్నం ప్రాంతాల్లో శివాలయాలు నిర్మించి పూజలు నిర్వహించేవారు. ఆలయాల నిర్వహణ కోసం అగ్రహారాలు ఏర్పాటు చేసి భూరి విరాళాలు ఇచ్చేవారు. తమ్మవరంలో కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం, రాచపూడిలో విశ్వేశ్వరస్వామి ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల్లో పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించారు. తమ్మవరం గ్రామంలోని ఆలయంలో వరసకు సోదరులైన తమ్మవరపు చలపతి, తమ్మవరపు మల్లికార్జునరావు అర్చకులుగా పనిచేసేవారు. చెరో ఆరు నెలలు వీరు పూజాధికాలు నిర్వహిస్తుంటారు. నవంబరు 21వ తేదీన ఈ రెండు ఆలయాల్లో చోరీలు జరిగాయి. విలువైన పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆ విషయమై పూజారుల్లో ఒకరైన తమ్మవరపు చలపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొరిశపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆదేశాల మేరకు సీసీఎస్‌ డీఎస్పీ ఎ.ప్రసాద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో పూజారి తమ్మవరపు మల్లికార్జునరావు దీనికి సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఆయన తనకు మిత్రుడైన ఒంగోలు డీఈవో కార్యాలయం అటెండర్‌ షగినాల రాజేష్‌, కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మహ్మద్‌ హిదయతుల్లా, రెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొప్పుల ప్రసాదరావుతో ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. వారు విగ్రహాలను విక్రయించే యత్నాల్లో ఉండగా... గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి రూ. 45 లక్షల విలువైన అయిదు దేవతామూర్తుల విగ్రహాలతో పాటు ఫోర్డ్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. సీసీఎస్‌ డీఎస్పీ ప్రసాద్‌కుమార్‌, దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు, సీసీఎస్‌ సీఐ జి.రామారావు, అద్దంకి సీఐ టి.అశోక్‌వర్ధన్‌, ఎస్సైలు ఆర్‌.సుమన్‌, నాగమల్లేశ్వరరావు, ఎం.శివనాంచారయ్య, సిబ్బంది టి.బాల, వై.వెంకటేశ్వరరావు, వై.చంద్రశేఖర్‌లను ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అభినందించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.