close

ప్రధానాంశాలు

చిన్నస్వామే.. చిన్నబోయింది

బెంగళూరు : ఇక ధోని పనైపోయింది. మునుపటి ధోని కనిపించడం లేదు. సిక్సర్లు, ఫోర్లు కొట్టడం లేకపోతున్నాడు. అతనిలో కేవలం ఒక మంచి కీపర్‌ మాత్రమే ఉన్నాడు. ఇటీవల ధోని ఆటతీరుపై వస్తున్న విమర్శలు ఇవి. అయితే.. వాటన్నింటికీ ధోని తన బ్యాటుతోనే సమాధానమిచ్చాడు. ధోని సమాధానానికి చిన్నస్వామి స్టేడియమే చిన్నబోయింది. వీర విజృంభణతో విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు. కాలం గడిచే కొద్దీ ఆవకాయ రుచి పెరిగిన చందంగా వయసు మీద పడే కొద్దీ ధోని కుర్రాళ్లకు మించి విజృంభిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో తన బ్యాటుకు పనిచేప్తున్నాడు. యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తున్నాడు.

ఆదివారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ధోనీ 24 పరుగులు బాది ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. తోటి బ్యాట్స్‌మెన్‌ బంతిని ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతుంటే ధోనీ మాత్రం అలవోకగా బౌండరీలు బాది తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు (84) నమోదు చేశాడు. అయితే, ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడినా.. ధోని అందరి మనసులు గెలుచుకున్నాడు. అందుకే ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ విరాట్‌ సైతం ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు. కోహ్లీతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు ట్విటర్‌ వేదికగా ధోనీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

* భారత జట్టుకు శుభవార్త. ప్రపంచకప్‌ కోసం ధోని తయారుగా ఉన్నాడు.
- సచిన్‌ తెందూల్కర్‌, భారత మాజీ క్రికెటర్‌

* వావ్‌.. ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌.. క్రికెట్‌లో ఓ అద్భుతమైన మ్యాచ్‌.
- వీరేంద్ర సెహ్వాగ్‌, భారత మాజీ క్రికెటర్‌

* ధోని.. ఏం కొట్టాడు. దాదాపు మ్యాచ్‌ను లాగేసుకునేంత పని చేశాడు. ధోనికి బ్యాటింగ్‌లో ఇతర బ్యాట్స్‌మెన్‌ తోడ్పాటు ఉంటే బాగుంటేది.
- క్రిష్ణమాచార్య శ్రీకాంత్‌, భారత మాజీ క్రికెటర్‌.

* మహీ భాయ్‌ నుంచి ఓ ప్రత్యేకమైన ఇన్సింగ్స్‌. ఒకే ఓవర్‌లో 26 పరుగులు అవసరమున్న సమయంలో ప్రత్యర్థి నుంచి దాదాపు మ్యాచ్‌ను లాగేసుకున్నంత పని చేశాడు.

- మహమ్మద్‌ కైఫ్‌, భారత మాజీ క్రికెటర్‌

* అబ్బా.. ఏం మ్యాచ్‌ ఇది. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌ ఐపీఎల్‌ అనడానికి ఈ ఇన్సింగ్స్‌ చాలు.
- ప్రగ్యాన్‌ ఓజా, భారత క్రికెటర్‌

* ఎమ్మెస్డీ.. నీకు వందనాలు.
- మన్‌దీప్‌ సింగ్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు.

* ధోనీ లాంటి బ్యాట్స్‌మెన్‌ క్రీజులో ఉన్నప్పుడు లక్ష్యం ఎంత పెద్దదైనా.. అది చిన్నదే అవుతుంది. దాదాపు మ్యాచ్‌ను గెలిచేంత పనిచేశాడు.
- సుబ్రమణ్యం భద్రీనాథ్‌. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు.

* ఈ సీజన్‌లో ప్రత్యేకమైన క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాం. 
- కెవిన్‌ పీటర్సన్‌, ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌

* అంతా ఊపిరి పీల్చుకోండి. ఈ ఐపీఎల్‌ నిజంగా అద్భుతం.
- గ్రేమ్‌ స్మిత్‌, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌.

* ధోనీ.. నువ్వు ఒక అసాధారణమైన క్రికెటర్‌వి.
- డీన్‌ జోన్స్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత, ఆస్ట్రేలియా

* ఉఫ్‌.. క్రికెట్‌కు ధోని ఎంతో అవసరం.
- హర్ష భోగ్లే, క్రికెట్‌ వ్యాఖ్యాత, ఇండియా.

* ధోనీకి ఏదైనా సాధ్యమే. లక్ష్య ఛేధనలో ధోని ప్రశాంతత ఒక కేస్‌ స్టడీగా ఉంటుంది. క్యా ప్లేయర్‌ హై బాస్‌.

- ఆకాశ్‌ చోప్రా, భారత మాజీ క్రికెటర్‌.

* అన్ని మ్యాచుల్లోకెల్ల ఇది అద్భుతమైంది. ధోని ఇన్నింగ్స్‌ చరిత్రలో నిలిచిపోతుంది. థాంక్యూ తాలా.. 
- చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం.

 Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net