close

ప్రధానాంశాలు

# ధోనీ ఫర్‌ పీఎం.. ట్విటర్‌లో అభిమానుల సందడి

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌ x రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఒక్క పరుగుతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో ధోనీ చెలరేగడంతో చెన్నైని గెలిపించినంత పనిచేశాడు. ఈ నేపథ్యంలో అతడిలో ఇంకా క్రికెట్‌ ఆడే సత్తా ఉందని మరోసారి చాటిచెప్పాడు. మ్యాచ్‌ ఓడిపోయినా ధోనీ బ్యాటింగ్‌ చూసిన అభిమానులు మాత్రం తెగ సంతోషిస్తున్నారు. అతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన వారు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అతను కొట్టిన సిక్సర్‌లో బంతి 111 మీటర్ల దూరంలో పడిన విషయం తెలిసిందే

కాగా మ్యాచ్‌ అనంతరం అభిమానులు ప్రధానిగా ధోనీ అంటూ ట్విటర్‌లో కోడై కూస్తున్నారు. ఒక అభిమాని పోస్టు చేస్తూ.. ‘ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని మర్చిపోయి ధోనీని ప్రధానిగా చేద్దాం’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే చాలా మంది ధోనీని పీఎంగా పేర్కొంటున్నారు. దీంతో ధోనీ ఫర్‌ పీఎం అనే హ్యాష్‌టాగ్‌ వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉండగా గతరాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 162 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ధోనీ బాధ్యతాయుతంగా ఆడి చివరి బంతి వరకూ పోరాడాడు. చెన్నైకి ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు అవసరం కాగా ఉమేశ్‌యాదవ్‌ బౌలింగ్‌లో ధోనీ ఒక ఫోర్‌, మూడు సిక్సులు కొట్టి 24 పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు చెయ్యాల్సిన స్థితిలో శార్దుల్‌ ఠాకుర్‌ రనౌట్‌ కావడంతో బెంగళూరు గెలిచిన విషయం తెలిసిందే.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net