close

ప్రధానాంశాలు

కోల్‌కతాకు గంభీర్‌ మద్దతు

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ అనంతరం భావోద్వేగపూరిత ట్వీట్‌

దిల్లీ: ఉప్పల్‌ వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఘోరంగా ఓటమి చెందడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. ఆ జట్టు ప్రదర్శనపై విచారం వ్యక్తం చేస్తూ మద్దతు తెలిపాడు. 

గంభీర్‌ ట్వీట్‌లో ‘కోల్‌కతా ఇలా ఓటమిపాలవ్వడం చూస్తే చాలా బాధగా ఉంది. డ్రెస్సింగ్‌రూమ్‌లో మంచి టాలెంట్‌ దాగుంది. కుర్రాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడి ప్రత్యర్థలను ఓడించాలి. త్వరగా జట్టులో కూర్పు చెయ్యండి. మనం చెయ్యగలం’ అంటూ మద్దతు తెలిపాడు. కాగా కోల్‌కతా ఈ సీజన్‌లో మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచి టాప్‌లో ఉండగా గత ఐదు మ్యాచుల్లో వరుసగా ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది.

గంభీర్‌ ఈ జట్టుకి 2011 నుంచి ఏడేళ్లపాటు నాయకత్వం వహించి రెండుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ని అందించాడు. 2012, 2014 సీజన్‌లలో అతడి సారథ్యంలోనే కోల్‌కతా విజయం సాధించింది. కాగా గతేడాది దిల్లీ డేర్‌డెవిల్స్‌ అతడిని కొనుగోలు చేయడంతో దిల్లీ తరఫున ఆడాడు. అయితే 2018 సీజన్‌లో గంభీర్‌ మంచి ప్రదర్శన చేయకపోవడంతో ఆ యాజమాన్యం మధ్యలోనే పక్కకుపెట్టింది. దీంతో గంభీర్‌ 2018 డిసెంబర్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. 



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net