close

ప్రధానాంశాలు

ముంబయి మహాన్‌ 

నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీ కైవసం 
ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో చెన్నైపై విజయం 
ఈనాడు - హైదరాబాద్‌

స్వల్ప స్కోర్లే నమోదైనా ఐపీఎల్‌కు అదిరే ముగింపు. ఆఖరి పంచూ ముంబయి ఇండియన్స్‌దే. ఫైనల్‌ చేరే క్రమంలో మూడుసార్లు చెన్నైని మట్టికరిపించిన ముంబయి.. ఆఖరి పోరాటంలోనూ పైచేయి సాధించింది. ఉప్పల్‌ను ఉత్కంఠతో ఊపేసి, ఉద్వేగాలను పెంచేసి, ఆఖరి బంతి వరకూ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను  ఓడించిన ముంబయి.. నాలుగోసారి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. అత్యధికసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టుగా అవతరించింది. కడ బంతి వరకు విజయం దోబూచులాడిన పోరులో బుమ్రా, రాహుల్‌ చాహర్‌ల అద్భుత బౌలింగ్‌ ముంబయిని గెలిపిస్తే.. వాట్సన్‌ పోరాటం వృథా మిగిలిపోయింది. 


ఈ టైటిల్‌ ముంబయి ‘రెండేళ్ల ఆనవాయితీ’ కొనసాగినట్లయింది. 2013, 2015, 2017లో విజేతగా నిలిచిన ముంబయి.. ఇప్పుడు ఐపీఎల్‌-12లోనూ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా అవతరించింది. ముంబయి 2017 ఫైనల్లోనూ ఇదే ఉప్పల్‌ స్టేడియంలో ఒక్క పరుగు తేడాతో నెగ్గడం విశేషం. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున కప్‌ అందుకున్న రోహిత్‌శర్మ.. ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

త్కంఠ పతాక స్థాయికి వెళ్లిన పోరులో అంతిమ విజయం ముంబయిదే. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 3×6) జట్టును ఆదుకున్నాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 8×4, 4×6) పోరాడినా చివరి మెట్టుపై చతికిలపడ్డాడు. బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (1/14) అద్భుత బౌలింగ్‌తో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు. 
బౌలర్లు భళా: 150 పరుగుల లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా ముంబయి బౌలర్ల క్రమశిక్షణ ఆకట్టుకుంది. ఓపెనర్లు వాట్సన్‌, డుప్లెసిస్‌ (26; 13 బంతుల్లో 3×4, 1×6) వేగంగా పరుగులు రాబట్టినా పట్టు వీడలేదు. కృనాల్‌ వేసిన నాలుగో ఓవర్లో డుప్లెసిస్‌ 2 బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదాడు. ఐతే అదే ఓవర్లో మరో భారీ షాట్‌ కోసం వికెట్లు ముందుకొచ్చిన డుప్లెసిస్‌ను డికాక్‌ స్టంపౌట్‌ చేశాడు. వాట్సన్‌, డుప్లెసిస్‌ తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఆ వెంటన వాట్సన్‌ అందుకున్నాడు. మలింగ వేసిన ఆరో ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. ఐతే 12 పరుగుల తేడాలో రైనా (8), రాయుడు (1), ధోని (2) ఔటవడంతో 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక చెన్నై పనైపోయినట్లుగా అనిపించింది. రాహుల్‌ చాహర్‌ గొప్పగా బౌలింగ్‌ చేశాడు. 4 ఓవర్లలో ఒక వికెట్‌ తీసి 14 పరుగులే ఇచ్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 88/4. ఆ సమయంలో చెన్నై విజయానికి 30 బంతుల్లో 62 పరుగులు కావాలి. దాదాపుగా రెట్టింపు రన్‌రేట్‌. ఐతే మలింగ వేసిన 16వ ఓవర్‌ మ్యాచ్‌ను ఉత్కంఠ వైపు తిప్పింది. తొలి బంతినే బ్రావో సిక్సర్‌గా మలచగా.. వాట్సన్‌ వరుసగా 3 బౌండరీలు బాదాడు. ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. సమీకరణం 24 బంతుల్లో 42 పరుగులుగా మారిపోయింది. 17వ ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇచ్చాడు. కృనాల్‌ 18వ ఓవర్లో వాట్సన్‌ వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగి 20 పరుగులు రాబట్టాడు. ఇక 12 బంతుల్లో 18 పరుగులు చేయాలి. మ్యాచ్‌ చెన్నై చేతుల్లోకి వచ్చేసినట్లుగా అనిపించింది. 19వ ఓవర్లో బుమ్రా.. బ్రావో (15; 15 బంతుల్లో 1×6)ను ఔట్‌ చేశాడు. ఆఖరి బంతికి డికాక్‌ బైస్‌ ఇవ్వడంతో బంతి బౌండరీకి వెళ్లింది. చివరి ఓవర్లో చెన్నై 6 బంతుల్లో 9 పరుగులు చేయాలి. తొలి 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి రెండో పరుగు కోసం వెనక్కి వచ్చిన వాట్సన్‌ రనౌటయ్యాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్‌ ముంబయి వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు కావాలి. ఐదో బంతికి 2 తీసిన శార్దూల్‌ చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. 

ధోని నాటౌట్‌.. ఔట్‌!: హార్దిక్‌ వేసిన 13వ ఓవర్‌ ఉత్కంఠకు దారితీసింది. నాలుగో బంతికి వాట్సన్‌ సింగిల్‌ తీశాడు. మిడ్‌ వికెట్‌లో ఉన్న బౌలర్‌ నాన్‌ స్ట్రైకర్‌ వైపు వికెట్లకు బంతిని త్రో చేశాడు. హార్దిక్‌ బంతిని అందుకోలేదు. ఓవర్‌ త్రో వెళ్లగానే ధోని రెండో పరుగు మొదలుపెట్టాడు. డీప్‌ కవర్స్‌ నుంచి మెరుపులా పరుగెత్తుకుంటూ వచ్చిన ఇషాన్‌ కిషన్‌ నేరుగా వికెట్లను త్రో విసిరాడు. తొలుత ఔటని భావించి ధోని నడక ప్రారంభించగా.. అంపైర్లు వెళ్లొద్దంటూ అతడిని ఆపారు. థర్డ్‌ అంపైర్‌ చాలా సేపటి వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. చివరికి ధోని ఔటయ్యాంటూ ప్రకటించగానే ముంబయి మ్యాచ్‌ గెలిచినంత సంబరాల్లో మునిగి తేలింది. 
ముంబయి తడ‘బ్యాటు’: మొదట బ్యాటింగ్‌ పిచ్‌పై భారీస్కోరు సాధించి.. చెన్నైపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా రోహిత్‌ టాస్‌ గెలవగానే బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రోహిత్‌ ఆరంభంలోనే శార్దూల్‌ బౌలింగ్‌లోభారీ సిక్సర్‌తో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. చాహర్‌ వేసిన మూడో ఓవర్లో డికాక్‌ (29; 17 బంతుల్లో 4×6) చెలరేగాడు. 3 భారీ సిక్సర్లతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్‌ విడదీశాడు. భారీషాట్‌కు ప్రయత్నించిన డికాక్‌.. ధోని చేతికి చిక్కాడు. అక్కడ్నుంచి చివరి వరకు ముంబయి బ్యాటింగ్‌ తడబాటు కొనసాగింది. ఆ తర్వాతి ఓవర్లోనే అద్భుతమైన బంతితో రోహిత్‌ (15; 14 బంతుల్లో 1×4, 1×6)ను చాహర్‌ బోల్తాకొట్టించాడు. ఈ ఓవర్లో వికెట్‌, మెయిడిన్‌తో చాహర్‌ ఆకట్టుకున్నాడు. పవర్‌ ప్లేలో ముంబయి 2 వికెట్లకు 45 పరుగులే చేసింది. అనంతరం ముంబయి బ్యాట్స్‌మెన్‌పై చెన్నై బౌలర్లు ఒత్తిడి పెంచారు. హర్భజన్‌, బ్రావో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో సూర్యకుమార్‌ (15; 17 బంతుల్లో 1×4), ఇషాన్‌ కిషన్‌ (23; 26 బంతుల్లో 3×4) జాగ్రత్తగా ఆడారు. ఐతే క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్‌.. తాహిర్‌ వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. శార్దూల్‌ వేసిన తర్వాతి ఓవర్లో కృనాల్‌ పాండ్య (7) అతడికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తాహిర్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ బాదిన సిక్సర్‌తో ముంబయి స్కోరు 100 (14.1 ఓవర్లలో)కు చేరుకుంది. ఐతే అదే ఓవర్లో ఇషాన్‌ ఔటయ్యాడు. పొలార్డ్‌కు జతగా హార్దిక్‌ క్రీజులో ఉండటంతో ముంబయి భారీస్కోరుపై ఆశలు సన్నగిల్లలేదు. అందుకు తగ్గట్లే పొలార్డ్‌, హార్దిక్‌ సిక్సర్లతో చెలరేగారు. హెలిక్యాప్టర్‌ షాట్‌తో సిక్సర్‌ బాదిన హార్దిక్‌ను చాహర్‌ యార్కర్‌ బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్లో రాహుల్‌ చాహర్‌ (0) నిష్క్రమించాడు. 19వ ఓవర్లో చాహర్‌ 4 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో పొలార్డ్‌ అన్ని బంతులూ ఎదుర్కొన్నా.. రెండు ఫోర్లు మాత్రమే బాదడంతో ముంబయి 149 పరుగులకే పరిమితమైంది.

అసలైన హీరో బుమ్రా

చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన మలింగ ముంబయికి హీరోగా నిలిచాడు కానీ.. అంతకుముందు ఆ జట్టును పోటీలో నిలబెట్టింది మాత్రం బుమ్రానే. 4-0-14-2.. ఈ గణాంకాలు చూస్తేనే అతడెలా బౌలింగ్‌ చేశాడో చెప్పేయొచ్చు. ఉత్కంఠలో, ఒత్తిడిలో అతను బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం. మలింగ వేసిన 16వ ఓవర్లో 20 పరుగులు రాబట్టి వాట్సన్‌, బ్రావో ఊపుమీదున్న దశలో బౌలింగ్‌కు వచ్చి కేవలం నాలుగే పరుగులిచ్చాడు బుమ్రా. తర్వాతి ఓవర్లో కృనాల్‌ 20 పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లలో 18 పరుగులు చేస్తే చాలు. ఆ స్థితిలో బ్రావో వికెట్‌ తీసి 9 పరుగులే ఇచ్చాడు. అందులో ఒక ఫోర్‌ కీపర్‌ డికాక్‌ తప్పిదం వల్ల వచ్చిన బైస్‌ కావడం గమనార్హం.

చెన్నై రనౌట్‌

చెన్నైకి టైటిల్‌ దూరం చేసింది రనౌట్లే. ముంబయి ఫీల్డింగ్‌ తప్పిదాలు చెన్నైకి చాలా వరకు కలిసొచ్చాయి కానీ.. రెండు కళ్లు చెదిరే రనౌట్లు ధోనీసేన కొంపముంచాయి. వికెట్ల మధ్య పరుగులో తిరుగులేని ధోనీనే రనౌటవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. హార్దిక్‌ పాండ్య వేసిన 13వ ఓవర్లో వాట్సన్‌ సింగిల్‌ తీశాడు. ఐతే మలింగ విసిరిన త్రో బౌలర్‌ను దాటి వెళ్లడంతో రెండో పరుగుకు ప్రయత్నించారు. ఐతే మిడాఫ్‌ నుంచి బంతి అందుకున్న ఇషాన్‌ కిషన్‌ మెరుపు వేగంతో నాన్‌-స్ట్రైక్‌ క్రీజు వైపు డైరెక్ట్‌ త్రో వేశాడు. మూడో అంపైర్‌ చాలాసేపు సమయం తీసుకుని.. ధోనీని ఔట్‌గా ప్రకటించాడు. మహి ఔట్‌ కావడంతో చెన్నై ఆత్మరక్షణలో పడిపోయింది. కానీ వాట్సన్‌ మెరుపులతో మళ్లీ పోటీలోకి వచ్చింది. ఐతే చివరి ఓవర్‌ నాలుగో బంతికి రెండో పరుగు తీసే విషయంలో తటపటాయించాడు. కృనాల్‌ త్రోను అందుకున్న డికాక్‌.. వాట్సన్‌ వచ్చే లోపే వికెట్లను గిరాటేశాడు.

నమ్మకాన్ని నిలబెట్టాడు 

చెన్నైతో ఫైనల్లో ముంబయి పోరాడే స్కోరు చేసిందంటే అది పొలార్డ్‌ వల్లే. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌ చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించాడు. కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 41 (నాటౌట్‌) పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఈ లీగ్‌లో అతడు పెద్దగా రాణించకపోయినా.. చాలా మ్యాచ్‌ల్లో విఫలమైనా తనని జట్టులో కొనసాగించినందుకు పొలార్డ్‌ సరైన సమయంలో ముంబయికి బహుమానం అందించాడు. ఈ టోర్నీలో 10, 20, 13, 10, 6 ఇలా స్వల్ప స్కోర్లు చేసిన పొలార్డ్‌ సరైన సమయంలో ఆడి తనపై ముంబయి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. ఫైనల్లో పొలార్డ్‌ ఇన్నింగ్స్‌ లేకపోతే ముంబయికి అసలు పోరాడే స్కోరు చేసేదే కాదు. గతంలో ముంబయి ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచినప్పుడు తన బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో సత్తా చాటిన పొలార్డ్‌.. మరోసారి జట్టు ట్రోఫీ నెగ్గడంలో కీలకమయ్యాడు.

‘‘ముంబయి విజయం జట్టు అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో సత్తా చాటారు. ఒక ఛాంపియన్‌ బౌలర్‌ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. 20 ఓవర్‌ హార్దిక్‌ పాండ్యతో వేయిద్దాం అనుకున్నాం. కానీ గతంలో ఈ స్థితిలో బౌలింగ్‌ చేసిన అనుభవం ఉన్న మలింగ వైపే మళ్లాం’’

- రోహిత్‌

ముంబయి: డికాక్‌ (సి) ధోని (బి) శార్దూల్‌ 29; రోహిత్‌ (సి) ధోని (బి) చాహర్‌ 15; సూర్యకుమార్‌ (బి) తాహిర్‌ 15; ఇషాన్‌ (సి) రైనా (బి) తాహిర్‌ 23; కృనాల్‌ (సి) అండ్‌ (బి) శార్దూల్‌ 7; పొలార్డ్‌ నాటౌట్‌ 41; హార్దిక్‌ (ఎల్బీ) (బి) దీపక్‌ చాహర్‌ 16; రాహుల్‌ చాహర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) దీపక్‌ చాహర్‌ 0; మెక్లెనగన్‌ రనౌట్‌ 0; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; 

మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149; 
వికెట్ల పతనం: 1-45, 2-45, 3-82, 4-89, 5-101, 6-140, 7-140, 8-141; 
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-1-26-3; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-37-2; హర్భజన్‌ 4-0-27-0; బ్రావో 3-0-24-0; ఇమ్రాన్‌ తాహిర్‌ 3-0-23-2; జడేజా 2-0-12-0 
చెన్నై: డుప్లెసిస్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) కృనాల్‌ 26; వాట్సన్‌ రనౌట్‌ 80; రైనా ఎల్బీ (బి) దీపక్‌ చాహర్‌ 8, రాయుడు (సి) డికాక్‌ (బి) బుమ్రా 1; ధోని రనౌట్‌ 2; బ్రావో (సి) డికాక్‌ (బి) బుమ్రా 15; జడేజా నాటౌట్‌ 5; శార్దూల్‌ ఠాకూర్‌ ఎల్బీ (బి) మలింగ 2; ఎక్స్‌ట్రాలు 9; 
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 148; 
వికెట్ల పతనం: 1-33, 2-70, 3-73, 4-82, 5-133, 6-146, 7-148; 
బౌలింగ్‌: మెక్లెనగన్‌ 4-0-24-0; కృనాల్‌ పాండ్య 3-0-39-1; మలింగ 4-0-49-1; బుమ్రా 4-0-14-2; రాహుల్‌ చాహర్‌ 4-0-14-1; హార్దిక్‌ పాండ్య 1-0-3-0

నమోదైన హ్యాట్రిక్‌లు. శ్రేయస్‌ గోపాల్‌ (బెంగళూరుపై), సామ్‌ కరన్‌ (దిల్లీపై) సాధించారు.

ఈ ఐపీఎల్‌లో నమోదైన సెంచరీలు. వార్నర్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లి, బెయిర్‌స్టో, రహానె, శాంసన్‌ సాధించారు.

8

వార్నర్‌ సాధించిన అర్థసెంచరీలు. అత్యధిక యాభైల రికార్డు అతడిదే.

17

కోల్‌కతాపై యాభై పరుగులు చేయడానికి హార్దిక్‌ పాండ్యకు అవసరమైన బంతులు. వేగవంతమైన అర్ధశతకం అతడిదే.

26

చెన్నై సూపర్‌కింగ్స్‌ స్పిన్నర్‌ తాహిర్‌ తీసిన వికెట్లు. అత్యధిక వికెట్ల ఘనత అతడిదే.

28

ఒక ఓవర్లో నమోదైన అత్యధిక పరుగులు. బెంగళూరుపై ఆండ్రి రసెల్‌ సాధించాడు.

52

ఓ ఆటగాడు సాధించిన అత్యధిక సిక్సర్లు. ఆండ్రి రసెల్‌ (కోల్‌కతా) బాదాడు. అతడు కొట్టిన ఫోర్లు 31 మాత్రమే.

52

బెంగళూరుపై సెంచరీ సాధించడానికి బెయిర్‌స్టో ఆడిన బంతులు. ఈ ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ బెయిర్‌స్టోదే.

64 

ఓ ఆటగాడు సాధించిన అత్యధిక ఫోర్లు. ధావన్‌ (దిల్లీ)దే ఈ రికార్డు.

66 

ఓ మ్యాచ్‌లో బౌలర్‌ సమర్పించుకున్న అత్యధిక పరుగులు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముజీబ్‌  రెహ్మాన్‌ ఇచ్చుకున్నాడు.

114 

ఈ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. బెంగళూరుపై బెయిర్‌స్టో (హైదరాబాద్‌) నమోదు చేశాడు.

190

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ వేసిన డాట్‌ బాల్స్‌. ఈ టోర్నీలో మరే బౌలరూ ఇన్ని డాట్‌ బాల్స్‌ వేయలేదు.

692

వార్నర్‌ పరుగులు. లీగ్‌లో అత్యధిక పరుగులు, ఆరెంజ్‌ క్యాప్‌ అతడిదే. పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ (593) అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు.

204.81

ఆండ్రి రసెల్‌ స్ట్రైక్‌రేట్‌. 13 ఇన్నింగ్స్‌లో 200పైగా స్ట్రైక్‌రేట్‌తో అతడు 510 పరుగులు చేయడం విశేషం. అతడి తర్వాత అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌ హార్దిక్‌ (193)దే.

4

ముంబయి ఐపీఎల్‌ టైటిళ్ల సంఖ్య. లీగ్‌లో మరే జట్టూ ఇన్నిసార్లు విజేత కాలేదు. చెన్నై 3 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది.


Tags :

మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net