ప్రధానాంశాలు

Published : 18/06/2021 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ఔషధంతో చిన్నారుల్లో తీవ్ర కొవిడ్‌కు చెక్‌

లండన్‌: ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి వాడే కార్టికో స్టెరాయిడ్లు.. కొవిడ్‌ బాధిత చిన్నారుల్లో తీవ్రస్థాయి రుగ్మతకు చికిత్సగా ఉపయోగపడతాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (ఎంఐఎస్‌-సి) అనే రుగ్మత.. కొవిడ్‌ బారినపడిన 50వేల మంది చిన్నారుల్లో ఒకరికి వస్తుందని అంచనా. వైరస్‌ సోకిన 2-6 వారాల్లో ఇది తలెత్తవచ్చు. ఫలితంగా బాధితుల్లో తీవ్ర జ్వరం, ఉదర భాగంలో నొప్పి, వాంతులు, కళ్లు ఎర్రబారడం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటివి రావొచ్చు. రక్త నాళాలు వ్యాకోచించొచ్చు. ఈ రుగ్మతతో మరణం ముప్పు కలిగించొచ్చు.

దీనికి యాంటీబాడీ చికిత్సకు బదులుగా చౌకలో, విస్తృతంగా అందుబాటులో ఉన్న చికిత్స సాధనంగా స్టెరాయిడ్లు ఉపయోగపడతాయని పరిశోధనకు నాయకత్వం వహించిన ఎలిజబెత్‌ విటేకర్‌ చెప్పారు. పరిశోధనలో భాగంగా తాము మిథైల్‌ ప్రెడ్నిసోలెన్‌ వంటి కార్టికోస్టెరాయిడ్లను, యాంటీబాడీ చికిత్సను పోల్చి చూశామన్నారు. యాంటీబాడీలు మాత్రమే పొందినవారు, యాంటీబాడీలతో కలిపి కార్టికో స్టెరాయిడ్లు పొందినవారు, కేవలం కార్టికో స్టెరాయిడ్లు పొందినవారు.. ఇలా మూడు రకాల చికిత్స మార్గాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ మూడు రకాలూ సమర్థంగానే పనిచేశాయని తేల్చారు. అయితే యాంటీబాడీలు మాత్రమే పొందినవారితో పోలిస్తే స్టెరాయిడ్లు మాత్రమే పొందినవారిలో అవయవాల వైఫల్య రేటు, మరణాలు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. దీనికితోడు యాంటీబాడీ లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో కార్టికో స్టెరాయిడ్లు మెరుగైన చికిత్స మార్గమవుతాయని తెలిపారు.


ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net