ప్రధానాంశాలు

Published : 04/05/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
IPL మళ్లెప్పుడో! BCCI ఏం చేయనుందో!

గందరగోళంలో బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి

అనుకున్నదే జరిగింది! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌పై కరోనా కసికసిగా పంజా విసిరింది. నిరాటంకంగా కొనసాగుతున్న సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసేలా చేసింది. సరిగ్గా సగం మ్యాచులు ముగిసిన తర్వాత పాజిటివ్‌ కేసులు రావడంతో బీసీసీఐ తలపట్టుకుంది. ఆటను ఆపేసింది. ఆటగాళ్ల సంక్షేమానికే ఓటేసింది!  ఇప్పటి వరకు ఏం జరిగిందంటే?


ఐఎస్‌ఎల్‌ నిర్వహణతో..

ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీసులను బీసీసీఐ విజయవంతంగా నిర్వహించింది. చక్కని బయో బుడగలను ఏర్పాటు చేసి నిరాటంకంగా మ్యాచులు నిర్వహించింది. నిజానికి అప్పుడు భారత్‌లో కేసుల సంఖ్య చాలా తక్కువ. దేశవ్యాప్తంగా సగటున 20వేల కేసులే నమోదవుతున్న కాలమది. అంతకుముందే ఇండియన్‌ సూపర్‌లీగ్‌ను నిర్వాహకులు విజయవంతం చేేయడంతో ఐపీఎల్‌పై బీసీసీఐ ముందుకొచ్చింది. సెప్టెంబర్లో టీ20 ప్రపంచకప్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి రావడంతో లీగ్‌ను ఇక్కడే నిర్వహించాలని అనుకుంది. టీ20 ప్రపంచకప్‌కు ఈ అనుభవం పనికొస్తుందని భావించింది.


ముందు నుంచే భయం

ఏప్రిల్‌ 9, శుక్రవారం రోజు ఐపీఎల్‌-21లో తొలి మ్యాచ్‌ జరిగింది. కానీ అంతకు ముందు నుంచే వైరస్‌ భయం పట్టుకుంది. ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. కేవలం మహారాష్ట్రలోనే రోజుకు 50వేల కేసులుండేవి. దేశవ్యాప్తంగా 2-3 లక్షల కేసులు నమోదయ్యేవి. ఇక ముంబయిలోని వాంఖడే మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. ఐపీఎల్‌ ప్రసారదారు సిబ్బంది సైతం పాజిటివ్‌గా తేలారు. సరిగ్గా సీజన్‌కు ముందు కోల్‌కతా ఆటగాడు నితీశ్‌ రాణా, క్వారంటైన్‌లో ఉండగా దిల్లీ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కరోనా బాధితులయ్యారు. అయినప్పటికీ ముంబయి, చెన్నై లెగ్‌ను బీసీసీఐ విజయవంతం చేసింది.


ఆటగాళ్లకు రావడంతో..

ముంబయి, చెన్నై వేదికల్లో మొత్తం 20 మ్యాచులు జరగడం.. ఎలాంటి ఇబ్బందీ తలెత్తకపోవడంతో బోర్డు అంతా సవ్యంగా సాగుతోందనే అనుకుంది. జట్లను అహ్మదాబాద్‌, దిల్లీకి పంపించింది. సామగ్రిని సైతం తరలించింది. మోదీ స్టేడియంలో 8 లీగ్‌ మ్యాచులు జరగాల్సి ఉండగా 5 పూర్తయ్యాయి. దిల్లీలో 8 లీగు మ్యాచులకు 4 ముగిశాయి.  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు కొందరు ఇంటిబాట పట్టడం, సోమవారం కోల్‌కతా ఆటగాళ్లు సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తికి పాజిటివ్‌ రావడంతో కలకలం రేగింది. దాంతో కోల్‌కతా, బెంగళూరు మ్యాచును రీషెడ్యూలు చేశారు. అదేరోజు సాయంత్రం చెన్నై సిబ్బందిలో బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌, ఓ బస్సు క్లీనర్‌కు కరోనా వచ్చిందని తెలియడంతో కలవరం మరింత పెరిగింది. మంగళవారం నాటి మ్యాచుపైనా సందిగ్ధం ఏర్పడింది.


తప్పని నిరవధిక వాయిదా

బాలాజీని కలవడంతో ఎప్పుడైతే చెన్నై జట్టంతా వారం రోజుల కఠిన క్వారంటైన్‌కు వెళ్లిందో గందరగోళం మొదలైంది. వేదికను ముంబయికి మార్చి అక్కడే అన్ని మ్యాచులు ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లూ మొదలుపెట్టింది. ఈ వారం రోజుల మ్యాచులు వాయిదా వేసి తర్వాతి వారంలో రోజుకు రెండు చొప్పున ఆడించాలని అనుకుంది. కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు వృద్ధిమాన్‌సాహా, దిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాకు పాజిటివ్‌ వచ్చిందని తెలియడంతో బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి ఆగమేఘాలపై సమావేశం నిర్వహించి లీగ్‌ నిరవధిక వాయిదాకు నిర్ణయం తీసుకున్నాయి. ఆటగాళ్లు సురక్షితంగా, క్షేమంగా ఉండటమే తమకు ముఖ్యమని ప్రకటించాయి. విదేశీ ఆటగాళ్లను సొంత దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. తర్వాతి విండో దొరికితే లీగ్‌ నిర్వహిద్దామని బీసీసీఐ ఆలోచన. కానీ అదంత సులభం కాదని తెలుస్తోంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net