
తాజా వార్తలు
నగ్రోటా ఎన్కౌంటర్: పాక్‌కు భారత్ సమన్లు
దిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా ఎన్కౌంటర్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను హతమార్చి భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన వ్యవహరంలో భారత విదేశాంగ శాఖ పాకిస్థాన్ హై కమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. పాక్ తీరుపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇకనైనా దాయాది దేశం.. ఉగ్రవాదులకు మద్దతివ్వడాన్ని, వారి భూభాగంలో ఉగ్రముఠాలు నిర్వహించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు ఉగ్రవాదం పాక్‌లో బలంగా ఉందని, దీనిపై దాయాది దేశం వెంటనే చర్యలు చేపట్టాలని విదేశాంగశాఖ డిమాండ్ చేసింది. కశ్మీర్లో ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ఇలాంటి పథకాలు రచించి దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. దాడుల కోసం పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి ఉపయోగించి భారత్‌ను అస్థిరపరిచేందుకు పాక్ ప్రణాళికలు రచిస్తోందని దుయ్యబట్టింది.
భారత్‌తో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను పాకిస్థాన్ ఏ మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించింది. ఈ సందర్భంగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను ఐక్యరాజ్యసమితి నిషేధించిన విషయాన్ని విదేశాంగ శాఖ ప్రస్తావించింది. ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి పాక్ అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేయడం వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ నెల 14న కాల్పుల విరమణను ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా ప్రాంతంలో గత గురువారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళ్తున్న ట్రక్కును నగ్రోటా టోల్ ప్లాజా వద్ద తనిఖీ నిమిత్తం ఆపగా.. అందులోని ముష్కరులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. దీంతో స్పందించిన దళాలు ఎదురుకాల్పులు జరిపి ముష్కరులను హతమర్చాయి. ఈ ఉగ్రవాదులు భారత్‌లో ముంబయి పేలుళ్ల తరహా భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పేలింది. కాగా.. ఉగ్రవాదులు ఉపయోగించిన వైర్లెస్ సెట్, ఇతర ఆయుధాలు పాక్‌లో తయారైనవని దర్యాప్తులో తేలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.