close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్‌

‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే’ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన డీడీని తానే స్వయంగా దిల్లీ వెళ్లి అధికారులకు అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దేశంపట్ల తమ బాధ్యతను గుర్తు చేశారంటూ ప్రధాని మోదీకి పవన్‌ కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు

ఆర్టీసీ సమ్మె సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 మంది కార్మికులు చనిపోయారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తొలుత కుటుంబానికి ఒక్కరుచొప్పున ఉద్యోగాలకు ఎంపిక చేశారు. నలుగురికి జూనియర్‌ అసిస్టెంట్‌, ఐదుగురికి కానిస్టేబుల్‌, ఒకరిని కండక్టర్‌ ఉద్యోగానికి ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు. సమ్మె సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, రూ.2లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ఇటీవల సీఎం హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ రాహుల్‌కు?

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో ఆ పార్టీ సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిని వీడిన రాహుల్‌ గాంధీ.. మళ్లీ ఆ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టనున్నారని కేసీ వేణుగోపాల్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్‌ చేపట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమని, ఇదే విషయమై పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తిని ఆయన అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నిత్యానంద ఎక్కడున్నాడో చెప్పడం కష్టం

వివాదాస్పద గురువు స్వామి నిత్యానంద ఆచూకీ స్పష్టంగా చెప్పలేమని, అయితే అతడి పాస్‌పోర్టు రద్దు చేశామని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. నిత్యానంద ఈక్వెడార్‌ సమీపంలో చిన్న దీవిని కొనుగోలు చేసి, దానికి కైలాసం అనే పేరు పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. ‘నిత్యానంద ఎక్కడున్నాడో ఊహించడం కష్టం. అయితే అతడి పాస్‌పోర్టును రద్దు చేశాం. కొత్త పాస్‌పోర్టు కోసం చేసుకున్న దరఖాస్తును కూడా తిరస్కరించాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అత్యాచార ఘటనలపై ఉబర్‌కు 235 ఫిర్యాదులు

ఉబర్‌ వాహనాల్లో ప్రయాణిస్తుండగా తమపై అత్యాచారం జరిగినట్టు 2018 జనవరి నుంచి డిసెంబర్‌ మధ్యలో తమకు 235 ఫిర్యాదులు వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది. అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే అమెరికా వాహన సేవల సంస్థ ఉబర్‌ తొలిసారిగా తన సంస్థ భద్రతా నివేదికను విడుదల చేసింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 2017, 2018లో తమ వాహనాల్లో జరిగిన లైంగిక దాడులు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు వంటి దుర్ఘటనల సమాచారాన్ని బయటపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మార్కెట్లోకి 2020 మోడల్‌ ట్రయాంప్‌ రాకెట్‌ 3R

దేశీయ మార్కెట్లోకి ట్రయాంప్‌ మోటార్‌ సైకిల్స్‌ సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. సరికొత్త రాకెట్‌ 3 మోడల్‌ను భారతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. దీని ధర రూ.18 లక్షలు (ఎక్స్‌షోరూం)గా నిర్ణయంచారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిలో ఆర్‌, జీటీ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లోకి ఆర్‌ వేరియంట్‌ను విడుదల చేశారు. దీనిలో శక్తివంతమైన ఇంజిన్‌, తక్కువ బరువు, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్‌ను అమర్చారు.  ఇది పాత మోడల్‌ కంటే రెండు లక్షలు చౌకగా లభిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శాస్త్రిపై కక్షా? హ్హహ్హహ: దాదా

గత విభేదాలను దృష్టిలో పెట్టుకొని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిపై కక్షపూరితంగా వ్యవహరిస్తామనడంలో అర్థం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. పదవీకాలంలో చేసిన ప్రదర్శనల ఆధారంగానే వ్యక్తుల పనితీరు అంచనా వేస్తారని స్పష్టం చేశారు. 2016లో అనిల్‌కుంబ్లేను కోచ్‌గా ఎంపిక చేయడంలో దాదా కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఇంటర్వ్యూకు హాజరైన శాస్త్రికి ఈ పదవి దక్కలేదు. దీంతో గంగూలీ వల్లే తనకు పదవి దక్కలేదని శాస్త్రి విమర్శించారు. దాదా సైతం ప్రతివిమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శ్రీకాకుళంలో నటి నిధి అగర్వాల్‌ సందడి

9. ఆసీస్‌తో భారత్ డే/నైట్‌ టెస్టులు?

2021 ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా డే/నైట్‌ టెస్టులు ఆడాలని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) బీసీసీఐని కోరనుందని తెలుస్తోంది. దీని గురించి వచ్చే ఏడాది జనవరిలో బీసీసీఐతో చర్చిస్తామని సీఏ ఛైర్మన్‌ ఎడ్డింగ్స్‌ ఈఎస్‌పీన్‌ క్రిక్‌ఇన్ఫోతో అన్నారు. జనవరిలో ఆస్ట్రేలియాతో భారత్‌ మూడు వన్డేలు ఆడనుంది. ‘తొలి డే/నైట్‌ టెస్టులో భారత్ సులభంగా విజయం సాధించింది. వారు మరిన్ని డే/నైట్‌ టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. జనవరిలో దీనిగురించి చర్చిస్తాం’ అని ఎడ్డింగ్స్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రపంచంలో అతిపెద్ద ఐపీవోగా సౌదీ ఆరామ్‌కో

సౌదీ అరేబియాకు చెందిన చమురు రంగ దిగ్గజం ఆరామ్‌కో గురువారం ఐపీవోను ప్రారంభించింది. అత్యధికంగా 32 రియాళ్ల రేటు వద్ద షేరు ధరను నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా 25.6 బిలియన్‌ డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ మొత్తం చైనాకు చెందిన ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ గ్రూప్‌ అలీబాబా ఐపీవో (25 బిలియన్‌ డాలర్ల) కంటే ఎక్కువ. ఈ సంస్థ మార్కెట్లోకి  ప్రవేశిస్తే దీని విలువ 1.7 ట్రిలియన్‌ డాలర్లతో అత్యధిక మార్కెట్‌ విలువ ఉన్న తొలి కంపెనీగా మారుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.