close

తాజా వార్తలు

Published : 10/08/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. ప్రాజెక్టులు: ఏపీ ఫిర్యాదులపై కేసీఆర్‌ ఆగ్రహం

తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ అర్థం పర్థంలేని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఏపీ ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని విమర్శించారు. నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి లేఖ, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఎంసెట్ ఈ తేదీల్లోనే అనుకుంటున్నాం: సబితా

ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఈ నెల 31న ఈ సెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌  9, 10, 11, 14న ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. స్వర్ణ ప్యాలెస్‌ ఘటనపై కమిటీ పరిశీలన

స్వర్ణ ప్యాలెస్‌ ఘటనపై జేసీ శివశంకర్‌ నేతృత్వంలోని కమిటీ పరిశీలన మొదలుపెట్టింది. స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగిన మూడు ఫ్లోర్లను కమిటీ పరిశీలించింది. మూడు అంశాల ప్రాతిపదికన విచారణ చేస్తున్నామని జేసీ శివశంకర్‌ తెలిపారు. హోటల్‌లో సంరక్షణ చర్యలు ఉన్నాయా లేదా? కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారా? ప్రమాదం జరగడానికి కారణమేంటి? అనే అంశాలపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. గత 14 నెలల్లో ఏం చేశారో చెప్పగలరా?

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తెలుగుదేశం నాంది పలికిందని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా హయాంలో చేసిన అభివృద్ధి గురించి దృశ్యమాధ్యమం ద్వారా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లామన్నారు. పదమూడు జిల్లాల అభివృద్ధికి మేం ఏం చేశామో చెబుతున్నాం.. ఈ పద్నాలుగు నెలల్లో మీరేం చేశారో చెప్పగలరా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఏపీ: కొత్తగా 7,665 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో(9AM-9AM)రాష్ట్రంలో కొత్తగా 46,999 నమూనాలు పరీక్షిస్తే.. 7,665 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,773 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 25,34,304 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా కరోనాతో 80 మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అక్కడ నా విగ్రహమా?అబ్బే లేదే: ట్రంప్‌

ఉద్దేశ పూర్వకంగానో లేదా అనుకోకుండానో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు వార్తల్లో ఉండటం పరిపాటి. కాగా ఆ దేశంలోని ప్రఖ్యాత రష్‌మోర్‌ పర్వతంపై ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారనే వార్త ఇటీవల సంచలనం సృష్టించింది. అయితే, ఆ కథనాలు ఆవాస్తవమని అధ్యక్షుడు వివరణ ఇచ్చారు. రష్‌మోర్‌ పర్వతంపై తన విగ్రహాన్ని కూడా చెక్కనున్నారనే వార్తలను అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ‘సచివాలయాల’ కోసం పీఎంయూ కాల్‌సెంటర్

గ్రామ, వార్డు సచివాలయాల కోసం ఏర్పాటు చేసిన పీఎంయూ కాల్‌సెంటర్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్షలో ఈ కాల్‌సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేశారు. మొదట నాలుగు ప్రభుత్వ సేవల అమలు ప్రక్రియను పీఎంయూ పర్యవేక్షించనుంది. అక్టోబర్‌ నుంచి ప్రభుత్వం అందించే 543 సేవల అమలు ప్రక్రియను పర్యవేక్షించనుంది. 

8. ‘స్వాత్రంత్య వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలి’

తెలంగాణలోని న్యాయస్థానాల్లో స్వాతంత్ర్య దినోత్సవాలపై హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. కోర్టుల్లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో 50 మందికి మించకూడదని హైకోర్టు తెలిపింది. స్వాత్రంత్య వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలని సూచించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించొద్దని.. మాస్కులు, భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

9. యడియూరప్పకు కరోనా నెగెటివ్‌

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. పది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. AP: అమల్లోకి పెంచిన భూముల ధరలు

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూమి విలువ రేట్లు అమల్లోకి వచ్చాయి. మార్కెట్‌ ధరకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వ్యత్యాసం తగ్గించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో వెబ్‌సైట్‌ ద్వారా రెవెన్యూశాఖ ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 30 శాతం వరకు భూముల ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.