close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 16/03/2020 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పటాస్‌’ చూసి ఇదో చెత్త సినిమా అన్నారు

ఆ మూడేళ్లు నాకు బ్రేక్‌ లేదు!

‘పటాస్‌’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల టపాసుల మోత మోగించారు. ‘సుప్రీమ్‌’తో సూపర్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నారు. ‘రాజా ది గ్రేట్‌’తో గ్రేట్‌ డైరెక్టర్‌ అంటూ ప్రశంసలు అందుకున్నారు. ‘ఎఫ్‌2’తో అటు ఫ్రస్ట్రేషన్‌ ఇటు ఫన్‌ను కలగలిపి నవ్వులు పూయించారు. ‘సరిలేరు నీకెవ్వరు’తో మహేశ్‌ అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చారు. ఆయనే యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి. వరుస విజయాలతో జోరుమీదున్న ఆయన తరుణ్‌ భాస్కర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీ ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘నీకు మాత్రమే చెప్తా’ షోకు విచ్చేసి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన తన కెరీర్‌ రచయితగా  ఎలా మారింది? ఎలా దర్శకుడు అయ్యారు? ఇలా అనేక విషయాలను పంచుకున్నారు. 

మీకు సంబంధించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పాలి?

అనిల్‌ రావిపూడి: నాకు ఫ్లైట్‌ ఫోబియా ఉంది. విమానం ఎక్కి కూర్చునే ఆ గంట ప్రయాణాన్ని చిత్రీకరిస్తే అదో సినిమా అవుతుంది. మామూలుగా వెళ్లిన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎక్కడైనా కుదుపు వస్తే అంతే అక్కడి నుంచి వణికిపోతా!

గత సంక్రాంతికి అల్లుళ్లతో వచ్చారు.. ఈ సంక్రాంతికి ‘అల్లుడు కాదు.. మొగుడు వచ్చాడు’ అని చూపించారు. మరి మీ ఇంట్లో మీరు అల్లుడా? మొగుడా?

అనిల్‌ రావిపూడి: మా ఇంట్లో నేను అల్లుడినే. అందుకే ‘ఎఫ్‌2’ తీశా. అంతేగా.. అంతేగా..!

ఈ కథను ఎక్కడి నుంచి స్ఫూర్తి పొంది రాశారు?

అనిల్‌ రావిపూడి: నా వ్యక్తిగత జీవితం నుంచే. నాలుగైదేళ్లు సంసార సాగరాన్ని ఈదీ.. ఈదీ.. చివరిగా తెలుసుకున్న మంత్రం ఏంటంటే.. పెళ్లాలకు తలూపడంలో వచ్చినంత కిక్కు మరెందులోనూ రాదు.(నవ్వులు)

‘సరిలేరు..’విజయాన్ని ఎలా ఆస్వాదించారు?

అనిల్‌ రావిపూడి: జనవరి 5న నాకు బాబు పుట్టాడు. ఒకవైపు కొడుకు.. మరోవైపు సినిమా బ్లాక్‌బస్టర్‌. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూశాం. నా కెరీర్‌లో వరుసగా ఐదో బ్లాక్‌ బస్టర్‌. కెరీర్‌పరంగా చాలా హ్యాపీ. 


 

మీ సినిమాలకు మొదటి రివ్యూ మీ ఇంటి నుంచే ఉంటుందా?

అనిల్‌ రావిపూడి: నేను సినిమాలు చేసేటప్పుడే కథ మా ఆవిడకు చెబుతా. అక్కా, అమ్మానాన్న అందరూ కలిసి కూర్చున్నప్పుడు కొన్ని సీన్లు చెబుతా. వాళ్లకు స్క్రిప్ట్‌ నాలెడ్జ్‌ ఉండదు. కామన్‌ ఆడియన్స్. వాళ్లకు నవ్వితే సీన్‌ బాగున్నట్లు. లేకపోతే బాగోలేనట్లు. వారి నుంచే నా మొదటి నిర్ణయం తీసుకుంటా. 

మీ వాళ్లు బాగోలేదని చెబితే మీరు దాన్ని సీరియస్‌గా తీసుకుంటారా?

అనిల్‌ రావిపూడి: తప్పకుండా ఆలోచిస్తా. ఎందుకంటే నా భార్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నేను సీన్‌ చెప్పేటప్పుడు నా భార్య హావభావాలు కూడా అంతే లాజికల్‌గా ఉంటాయి. ఏదైనా చెబితే బాగుందనిపిస్తే తప్పకుండా చెబుతుంది. మరో సీన్‌ చెప్పినప్పుడు ‘నవ్వలేదంటి’ అని అడిగితే.. ‘నాకు నవ్వు రాలేదు.. నవ్వలేదు’ అని మొహం మీదే చెప్పేస్తుంది. నాకు స్పష్టత వచ్చేస్తుంది. చెప్పే కొద్దీ సీన్లు ఇంప్రూవ్‌ అవుతాయి. అందుకే నేను దాదాపు 100 సార్లు నా సినిమాలోని సీన్లను చెబుతుంటా. 

రచయితగా ఉన్నప్పుడు కూడా అభిప్రాయాలు తీసుకునేవారా? 

అనిల్‌ రావిపూడి: అవును! స్క్రిప్ట్‌ డైలాగ్‌ వెర్షన్‌ అయిపోయిన తర్వాత సినిమా రంగంతో సంబంధం లేని నా ఫ్రెండ్స్‌ను కొంతమందిని పిలుస్తా. వాళ్లు కరెక్ట్‌గా చెబుతారు. ఎందుకంటే, ప్రేక్షకుల నవ్వులు.. ఎమోషన్‌ కరెక్ట్‌గా ఉంటే సినిమా హిట్‌. 

ఈ కథ ఫలానా హీరోది అని చెప్పి సీన్లు చెబుతారా?

అనిల్‌ రావిపూడి: నెరేషన్‌లో నేను చాలా స్ట్రాంగ్‌. అవసరమైతే కొందరిని ఇమిటేట్‌ చేసి చెబుతా. అందువల్ల వినే వారికి సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. జడ్జిమెంట్‌ కూడా కరెక్ట్‌గా ఉంటుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రజలపై చాలా ఇంపాక్ట్‌ చూపించింది. దీనిపై మీరేంటారు?

అనిల్‌ రావిపూడి: నేను చేసిన గత సినిమాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, కొత్త సినిమాలకు జాగ్రత్తలు తీసుకుంటా. ‘ముందు సినిమాలో ఏం చూపించాం.. తర్వాత సినిమాలో ఏం చూపించబోతున్నాం. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి. మనం చేయనిది చేయాలి’ అని ముందు అనుకుంటా. నా గత సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎలివేషన్స్‌, హీరోయిజం, మాస్‌ కంటెంట్‌ ఎక్కువగా చూపించా. అయితే, భావోద్వేగ సన్నివేశాలను ఎక్కువగా చూపించలేదు. ఈ సినిమాలో అది కుదిరింది. ముఖ్యంగా ఆర్మీ గురించి, కొడుకు రాలేని విషయాన్ని విజయశాంతిగారు చెప్పే సన్నివేశాన్ని అందరి సైనికుల తల్లిగా అందరి హృదయాలను హత్తుకునేలా తీశా. నేను చాలా గర్వంగా ఫీలయ్యా. అందరూ చివరి 20 నిమిషాలు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఈ సీన్‌ చేసేటప్పుడు మహేశ్‌గారు కూడా సెల్యూట్‌ చేశారు. వెంటనే నేను కూడా లేచి సెల్యూట్‌ చేశా. 

‘సరిలేరు..’ విజయంపై మహేశ్‌ మెచ్చుకున్నప్పుడు మీకేనిపించింది?

అనిల్‌ రావిపూడి: చాలా హ్యాపీగా అనిపించింది. సక్సెస్‌ మీట్‌లో ఆయన నన్ను హగ్‌ చేసుకున్నారు. ఆ సీన్‌ ఫొటో తీసి ఫ్రేమ్‌ కట్టించుకున్నా. 

అసలు మొదటి విజయాన్ని మీరెలా ఆస్వాదించారు?

అనిల్‌ రావిపూడి: ప్రతి ఒక్కరికీ దర్శకుడు కావాలన్నది కల. దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. అమ్మానాన్న, భార్య, అక్క, ఫ్రెండ్స్‌ ఇలా ఎంతో మంది సపోర్ట్‌ ఉంటుంది. ఒక సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌ తెచ్చుకున్న తర్వాత అది రెండు కన్నీటి చుక్కల రూపంలో బయటకు వస్తుంది. ఏదో సాధించామన్న తృప్తి ఉంటుంది. అది ‘పటాస్‌’కు నేను ఫీలయ్యా!

రచయితగా మొదటిసారి సక్సెస్‌ అయినప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి?

అనిల్‌ రావిపూడి: నాకు టైటిల్ కార్డు పడిన సినిమాలు ఆడలేదు. అలా కాకుండా ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేసిన సినిమాలు బాగా ఆడాయి. దాంతో రైటర్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఎక్కువ రోజులు చేయలేకపోయా. డైరెక్టర్‌ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చా. రైటింగ్‌ నాకున్న అదనపు బలం. తొలిసారి ‘శౌర్యం’ సినిమాకు రైటర్‌గా పనిచేశా. కానీ, దానికి రత్నంగారి పేరు పడింది. అది విజయం సాధించింది. నాకు క్రెడిట్‌ దక్కలేదు. దర్శకుడు కావాలన్న నా లక్ష్యం ముందు ఇవేవీ పట్టించుకోలేదు. 

ఆ తర్వాత ‘శంఖం’కు క్రెడిట్‌ ఇచ్చారు. అది ఆడలేదు. నేను సరిగానే రాస్తున్నానా? లేదా? నేను రాసిన డైలాగ్‌లకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? అన్నది థియేటర్‌కు వెళ్లి చెక్‌ చేసుకునే వాడిని. అలా రెండు, మూడేళ్లు అసలు సక్సెస్‌లు లేవు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఘోస్ట్‌గా పనిచేశా. ఆ తర్వాత ‘కందిరీగ’ నాకు పూర్తి బ్రేక్‌నిచ్చిన చిత్రం. 


 

సినిమాలకు సంబంధించి మీ కుటుంబం నుంచి ఎలాంటి సహకారం ఉండేది?

అనిల్‌ రావిపూడి: నన్ను ఎంతో ప్రోత్సహించారు. నేను సినిమా ఫీల్డ్‌కు వచ్చిన తర్వాత నా పనిలో బిజీగా ఉండేవాడిని. దీంతో అమ్మతో మాట్లాడే తీరిక ఉండేది కాదు. ఆమెకు నాతో మాట్లాడాలని ఉన్నా, నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఫోన్‌ చేసేది కాదు.

విడుదలైన ప్రతి సినిమాను మీకు చూపించేవారట!

అనిల్‌ రావిపూడి: మా నాన్న ప్రతి సినిమా విడుదలైన వెంటనే తీసుకెళ్లి నాకు చూపించేవారు. దీంతో సినిమా నా జీవితంలో భాగం అయిపోయింది. ‘గ్యాంగ్‌లీడర్‌’కు మొదటి రోజు వెళ్తే టికెట్లు దొరకలేదు. లేడీస్‌ క్యూలో అమ్మ, అక్కను బెట్టారు. సరిగ్గా వాళ్ల దగ్గరకు రాగానే హౌస్‌ఫుల్‌ బోర్డ్‌ పెట్టేశారు. నేను చాలా నిరాశపడ్డా. ఆ మరసటి రోజు ఉదయం మూడు గంటల ముందే థియేటర్‌కు చేరుకుని, లైన్‌లో నిలబడి టికెట్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టినప్పుడు చెప్పలేని సంతోషం.

మీ మదర్‌కు డెలివరీ డేట్‌ ఇచ్చిన తర్వాత కూడా వెళ్లి సినిమా చూశారట!

అనిల్‌ రావిపూడి: (నవ్వులు) అవును! ఈ విషయం నాకూ చెప్పింది. అప్పుడు ‘గుండమ్మ కథ’ చూసింది. అది కామెడీ సినిమా కాబట్టి, నాకు కూడా అది వచ్చిందేమో. ఆ సినిమాను చాలా సార్లు చూశా.

‘గుండమ్మకథ’ నుంచి మీరు ఏమైనా స్ఫూర్తి పొందారా?

అనిల్‌ రావిపూడి: చాలా సన్నివేశాలు. రమణారెడ్డిగారికి ఎన్టీఆర్‌గారికి మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అవి నాపై చాలా ప్రభావాన్ని చూపాయి. ‘గుండమ్మకథ’ అనేది మాస్టర్‌ పీస్‌. ‘ఎఫ్‌2’లో అన్నపూర్ణమ్మ, వై.విజయ పాత్రలు సూర్యకాంతం, ఛాయా దేవిల పాత్రకు దగ్గరగా ఉంటాయి. 

మీ సినిమాలో చాలా పంచ్‌లు ఉంటాయి? మీ మొదటి పంచ్‌ డైలాగ్‌ ఏది? థియేటర్‌లో దానికి రెస్పాన్స్‌ ఎలా ఉంది?

అనిల్‌ రావిపూడి: నాగార్జున గారి ‘బాస్‌’ కోసం వి.ఎన్‌.ఆదిత్య గారి దగ్గర పనిచేశా. ఆ సినిమాలో ఆలీగారికి ట్రాక్‌ రాశా. అందులో ‘సాగర్‌.. నాగార్జున సాగర్‌’ అని ఆలీ అంటే ‘డ్యామా..’ అని నాగ్‌ ప్రశ్నిస్తారు. వెంటనే ఆలీ ‘కాదు.. నా నేమ్‌’అంటారు. థియేటర్‌లో మంచి స్పందన వచ్చింది. 

చిన్నప్పుడు మీరు బాగా డ్యాన్స్‌ చేసేవారట!

అనిల్‌ రావిపూడి: అవును. డ్యాన్స్‌ అంటే నాకు విపరీతమైన ఇష్టం. సాంగ్‌ వినపడితే, సందర్భం ఏంటి? ఎక్కడ ఉన్నాం? ఇవేవీ చూసుకునేవాడిని కాదు. ఎవరైనా డ్యాన్స్‌ వేయమంటే వేసేస్తా. వేరే వాళ్లు చేస్తే కాస్త కుళ్లుకునేవాడిని.

సినిమా ఇండస్ట్రీ అంటే కొందరు చెడ్డదని చెబుతుంటారు. మీ కుటుంబంపై ఆ ప్రభావం ఎప్పుడైనా పడిందా?

అనిల్‌ రావిపూడి: ఇంటర్మీడియట్‌ వరకూ నేను బాగా చదివే వాడిని. బీటెక్‌కు వచ్చిన తర్వాత సినిమాల కారణంగా చదువు అటకెక్కింది. ఆ తర్వాత మా తండ్రి కోరిక మేరకు చదువంతా పూర్తి చేశా. మా పెదనాన్నకు నాపై చాలా నమ్మకం ఉండేది. నాకు చాలా స్వీట్‌ మెమొరీస్‌ ఉన్నాయంటే ఆయనవల్లే. మా కుటుంబంలో నేను బాగా ఎదగాలని కోరుకున్న వాళ్లలో ఆయన కూడా ఒకరు. అయితే, దురదృష్టవశాత్తూ నేను దర్శకుడిని అవ్వడానికి రెండేళ్ల ముందే ఆయన చనిపోయారు. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేటప్పుడు అందరికీ గొప్పగా చెప్పేవారు. 

వృతి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఇంట్లో పంచుకునేవారా?

అనిల్‌ రావిపూడి: ‘పటాస్‌’కు మూడేళ్ల ముందు నా జీవితం చాలా కష్టంగా గడిచేది. 2012లో నాకు పెళ్లయింది. భార్య అన్ని విషయాల్లో సపోర్ట్‌గా ఉన్నా, జీవితంలో ఇంకా సెటిల్‌ కాలేదేనన్న ఒత్తిడి ఉండేది. 

మీ పెళ్లి ఎలా అయింది? 

అనిల్‌ రావిపూడి: తను నా క్లాస్‌మేట్‌. అయితే, మాట్లాడుకున్నది మాత్రం చాలా తక్కువ. పైగా మనం బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్లం. అమ్మాయిలు మనల్ని ఎప్పుడు చూస్తారా?అని ఆసక్తిగా ఎదురు చూస్తుండేవాళ్లం. నా భార్యతో పాటు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు బాగుండేవారు. (నవ్వులు) ఏ అమ్మాయి నాతో మాట్లాడకపోవడంతో ఏదో ఒకటి చేయాలని అనుకున్నా. ఏటా కాలేజ్‌లో ‘విజ్ఞాన్‌ మహోత్సవ్‌’ అనే కల్చరల్‌ ఈవెంట్‌ జరిగేది. ఏదో ఒక దానిలో ముందుంటే గుర్తింపు వచ్చి మాట్లాడతారని ‘ఛలో తిరుపతి’ అనే స్కిట్‌ చేశా. అందరూ చాలా మెచ్చుకున్నారు. నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. నా కెరీర్‌లో వచ్చిన మొదటి ప్రశంస ఇదే. ఇక్కడే నా మైండ్‌ సెట్‌ మారిపోయింది. అలా ఆ స్కిట్‌కు షీల్డ్‌ తీసుకుని వస్తున్నప్పుడు తొలిసారి ఎదురుపడిన అమ్మాయి నా వైఫ్‌. నా దగ్గరకు వచ్చి ‘కంగ్రాట్స్‌’ చెప్పింది. ఇప్పటికీ ఆ ఫ్రేమ్‌ నా కళ్ల ముందు కదలాడుతోంది. 

జీవితంలో ‘సాంబర్‌’ వెనుక ఓ కథ ఉందట!

అనిల్‌ రావిపూడి: మా పెదనాన్న వాళ్లు బాలాజీ మెస్‌ నడిపేవారు. అందులో స్పెషల్ సాంబర్‌ ఉండేది. నాకు చాలా ఇష్టం. స్కూల్లో అందరూ నన్ను సాంబర్‌ అని పిలిచేవారు. ‘సాంబరు’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ కూడా ఉంది. (నవ్వులు) అందులో నా చిన్నప్పటి ఫ్రెండ్స్‌ ఉన్నారు. 

‘చెంబు’ కథ కూడా ఉందట!

అనిల్‌ రావిపూడి: చిన్నప్పుడు మా ఊళ్లో చెంబు తీసుకుని పొలానికి వెళ్లా. సడెన్‌ పాము ఎదురొచ్చింది. అంతే అక్కడ మొదలు పెట్టిన పరుగు ఇంటికి వచ్చే వరకూ ఆపలేదు. మా నాన్న వచ్చి పామును కొడతారేమో అనుకుంటే చెంబు వెతుకుతూ కూర్చొన్నారు. ఫైనల్‌గా చెంబు దొరికింది. పాము పోయింది. (నవ్వులు) 

మీకు ఫ్రస్ట్రేషన్‌ వచ్చి, ఎవరినీ ఏమీ లేని పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా?

అనిల్‌ రావిపూడి: ‘పటాస్‌’ సినిమా పూర్తయింది. ఒక శాటిలైట్‌ ఛానల్‌ వాళ్లు వచ్చి ఎడిటింగ్‌ రూమ్‌లో కూర్చుని సినిమా చూశారు. ఆ మూవీ చూస్తున్నంత సేపూ వాళ్లు ముచ్చట్లు పెట్టుకుంటూ, కబుర్లు చెప్పుకున్నారట. బయటకు వచ్చి కల్యాణ్‌రామ్‌గారికి ‘ఇదొక చెత్త. ఈ సినిమా ఎలా తీశారు. ఇదొక సినిమానా? ఎలివేషన్స్‌ ఏవి? హీరోయిజం ఏది?’ అన్నారు. నాకూ, కల్యాణ్‌రామ్‌గారికి నోటి మాట రాలేదు. ‘సినిమా తీశాం.. కానీ వీళ్లు చెబుతున్నంత చెత్తగా అయితే తీయలేదు కదా’ అని అనిపించింది. ‘వేరొకరికి చూపిద్దాం’ అని అన్నాను. ఆ మరుసటి రోజు దిల్‌రాజుగారు, శిరీష్‌గారు చూడకపోయి ఉంటే, భయపడి మేం సినిమాను గందరగోళం చేసేవాళ్లం. ‘మీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌. వారంలో విడుదల చేయాలి’ అని వాళ్లు కల్యాణ్‌రామ్‌గారికి చెప్పారు. ఆ ఛానల్‌ వాళ్లు మళ్లీ కనిపించలేదు. 

సినిమా చూసిన తర్వాత చాలా మందికి చూపించి జడ్జిమెంట్‌ తీసుకుంటాం. అది ఎంతవరకూ కరెక్ట్‌?

అనిల్‌ రావిపూడి: సినిమాను సినిమాగా చూసేవాళ్లకు అదొక ‘షోలే’. సినిమా గురించి ఎక్కువ తెలిసిన వాళ్లకు సినిమా చూపించకూడదు (నవ్వులు)

షూట్‌ జరిగేటప్పుడు ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యారా?

అనిల్‌ రావిపూడి: జీవితంలో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎవడు ఎప్పుడు ఏమవుతాడో చెప్పలేం. ‘శంఖం’ సినిమాకు నేను రచయితను. ఇద్దరు ఆర్టిస్ట్‌లు టెంట్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ ఉన్నారు. షాట్‌ రెడీ అయిన తర్వాత పిలవడానికి వెళ్లా. ‘ఏమ్మా.. నీ పేరేంటి’ అన్నారు. ‘అనిల్‌’. ‘ఏం చేస్తున్నావు’ అని అడిగారు ‘ఈ సినిమాకు రైటర్‌ని’ అని చెప్పా. దాంతో ‘అదండీ.. ప్రతి వాడూ చేతిలో పెన్ను, పేపర్‌ పట్టుకుని రైటర్‌ అని చెప్పి వచ్చేస్తారు. డైలాగ్‌లేమో ఇలా ఉంటాయి. మనం ఇంప్రవైజ్‌ చేసి చెప్పాలి. ఇంకా ఏమవుదామనుకుంటున్నావు’ అని అడిగారు. ‘డైరెక్టర్‌ అవుదామని అనుకుంటున్నా’ అని చెప్పగానే ‘వీడు డైరెక్టర్‌ కూడా అవుతాడట’ అని పది నిమిషాల పాటు నాతో కామెడీ చేశారు. ‘ఎప్పుడైనా వీళ్లు నా సినిమాలో చేయకపోతారా’ అని అప్పుడు అనుకున్నా. అదృష్టవశాత్తూ, వాళ్లు నా సినిమాలో చేయలేదు. అప్పుడు బాగా బాధేసింది. చాలా ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యా!

‘కందిరీగ’ సినిమాకు నేను రైటర్‌ని. ఆ సినిమా అప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యా. సోనూసూద్‌కు కథ చెప్పినప్పుడు విలన్‌ అని చెప్పలేదు. హీరోతో సమానంగా ఉంటుందని అని చెప్పాం. తను హీరో అని ఫిక్స్‌ అయిపోయాడు. రోజూ సీన్‌ చెప్పడానికి కారావాన్‌ దగ్గరకు వెళ్తే, ‘మళ్లీ ఒకసారి కథ చెప్పు’ అని మొత్తం కథ చెప్పించుకునేవాడు. రోజూ ఇదే పని. ఒక సీన్‌లో హన్సికను మెడ పట్టుకుని గోడకేసి నొక్కాలి. ‘నేను హీరోను కదా. అలా ఎలా చేస్తాను’ అంటున్నాడు తప్ప చెప్పింది చేయటం లేదు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. కానీ, నేను రైటర్‌ను కావడంతో తమాయించుకున్నా. ఆ కోపం శ్రీనివాస్‌కు వచ్చింది. మైక్‌ పక్కకు విసిరేసి ‘ఏంటి ఇద్దరి మధ్య చర్చ’ అని గట్టిగా అరిచాడు. ‘సర్‌ ఎంత చెప్పినా వినడం లేదు’ అని అన్నారు. ‘సోనూ.. నువ్వు సినిమాలో విలన్‌.. హీరో కాదు.’ అని చెప్పి వెళ్లిపోయాడు. అంతే సోనూ ఒక నిమిషం బ్లాంక్‌ అయిపోయాడు. ‘నేను విలన్‌నా.. మరి కథ చెప్పినప్పుడు హీరో అని చెప్పారు’ అంటూ ఆశ్చర్యపోయాడు.

దర్శకుడు కథ రాసుకోవడానికి బ్యాంకాక్‌, ఆస్ట్రేలియా వెళ్తుంటారు. మీరు ఎక్కడకు వెళ్తారు?

అనిల్‌ రావిపూడి: గతంలో సినిమా మొత్తం వైజాగ్‌లో కూర్చుని రాసేవాడిని. గత రెండు సినిమాల నుంచి ఫస్టాఫ్‌ వైజాగ్‌లో రాసుకుని, సెకండాఫ్‌ మా ఊళ్లో మా ఇంటిపైన రూమ్‌లో కూర్చుని రాసుకుంటా. 

‘నేను డ్రైవర్‌ను జీతం తీసుకుంటాను ఏమీ సాధించలేదు. వాడినైనా ఏదైనా సాధించమని చెప్పు’ అని మీ నాన్న అన్నారట!

అనిల్‌ రావిపూడి: నేను సినిమాల్లోకి వెళ్తానంటే ఆయన మరో మాట మాట్లాడకుండా ‘వెళ్లు’ అన్నారు. వెంటనే మా అమ్మ ‘కొన్నాళ్లు ఉద్యోగం చేయమని చెబుతారని అనుకుంటే, సినిమాల్లోకి వెళ్లమని చెబుతున్నారు’ అని అన్నది. ‘నేను నా జీవితంలో ఏదో చేద్దామని అనుకుంటే ఆర్టీసీ డ్రైవర్‌గా మిగిలిపోయాను. వాడు ఇంకా పెద్దదవుదామని ఆశ పడుతున్నాడు. అయితే, వాడు సంచలనం సృష్టించినట్లే కదా! నా లైఫ్‌ను వాడిలో చూసుకుంటా. వెళ్లి ప్రయత్నించనివ్వు’ అని నాన్న అన్నారు. ఆ మాట చెప్పగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నన్ను అంతలా నమ్మారు. మా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. అందువల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాక కూడా చాలా జాగ్రత్తగా ఉన్నా. చదువుకునేటప్పుడు ఆయనకు ఏమీ చేయలేకపోతున్నాననే బాధ ఉండేది. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసినా నన్ను చదివించడానికి ఆయన జీతం సరిపోయేది కాదు. అందుకే పక్క ఊళ్లో కేబుల్‌ టీవీ నడిపేవారు. సైకిల్‌పై వెళ్లి కలెక్షన్లు వసూలు చేసేవారు. ఇవన్నీ చూశాను కాబట్టే, ఆ విలువ తెలిసింది. అందుకే డబ్బుకు నేను పెద్దగా విలువ ఇవ్వను. 

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే మీ ఫీలింగ్‌ ఎలా ఉంది?

అనిల్‌ రావిపూడి: మా బాబాయి అరుణ్‌ ప్రసాద్‌ డైరెక్టర్‌. ఆయనను ఒప్పించడానికి నెలరోజులు పట్టింది. నవదీప్‌ నటించిన ‘గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి.’ దానికి అప్రెంటీస్‌గా లీస్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని. సెట్‌కు వెళ్లగానే, పిలిచి నాకు పని చెబుతారేమో అనుకునేవాడిని. కానీ, ఒక్కరు కూడా చెప్పేవారు కాదు. ఎవరి పని వాళ్లు చేసుకుని వెళ్లిపోయేవాళ్లు. భోజనం సమయానికి బాబాయి పక్కన వెళ్లి కూర్చుని తినేవాడిని. అక్కడ అందరూ చీఫ్‌ టెక్నీషియన్లు ఉండేవారు. పది రోజుల పాటు ఇలాగే జరిగింది. ఆ తర్వాత మరో చోట షూటింగ్‌ జరుగుతుంటే, నేను మూలన వెళ్లి కూర్చున్నా. బాబాయి పిలిచి ‘ఏం చేస్తున్నావు’ అన్నారు. ‘నాకు ఏమీ అర్థం కావటం లేదు బాబాయ్‌. ఎవరూ పని చెప్పడం లేదు’ అని అన్నాను.

‘నువ్వు రోజూ నాతో కారులో వస్తున్నావు. నా పక్కన కూర్చుని భోజనం చేస్తున్నావు. మళ్లీ నాతో ఇంటికి వస్తున్నావు. నువ్వు అప్రంటీస్‌లో లీస్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌వి. నువ్వు అలా ఉంటే, వాళ్లలో కలిసిపోతావు. వాళ్లు కూడా నిన్ను కలుపుకొని వెళ్తారు. కానీ, నాతో, చీఫ్‌ టెక్నీషియన్లతో కలిసి కూర్చుంటున్నావు. అలాంటప్పుడు నీతో ఎవరు కలుస్తారు’ అని అన్నారు. మనల్ని ఎవరు తీసుకొచ్చినా.. డైరెక్టర్‌ మన బాబు అయినా, బాబాయి అయినా మన పొజిషన్‌కు తగినట్లు పనిచేయాలి. అప్పుడు వర్క్‌ తెలుస్తుందని ఆయన చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరూ వచ్చి మనకి పని చెప్పరు. ఒక స్పాట్‌లో మనం మెరుగుపడలాంటే మన పనితనం చూసి ఎదుటివాడు వచ్చి పని చెప్పాలి. ఆ తర్వాతి రోజు నుంచి అందరితో కలిసి పోయి పని చేసేవాడిని. డైలాగ్‌లు కూడా చెప్పేవాడిని. కొన్ని రోజులు అయిన తర్వాత నన్ను చూసి మా బాబాయే ఆశ్చర్యపోయేవాడు. 

* అనిల్‌ రావిపూడికి ఒక లెటర్‌ వచ్చింది. అందులో ఏముంది?

* అనిల్‌కు నిద్రలో పక్కవాళ్లపై కాళ్లు వేసే అలవాటు ఉందా? 

* తరుణ్‌కు .....తో ఆడుకోకపోతే నిద్ర పట్టదు? 

* తరుణ్‌కు బాగా నచ్చిన, ఇష్టమైన, తనతో పాటు ఉండేది ఏంటి?

* అనిల్‌ రావిపూడి....ను కళ్లార్పకుండా చూస్తాడు? ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు అనిల్‌ సమాధానాలు వచ్చేవారం..


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.