
తాజా వార్తలు
అలా అయితే.. వారికి వడ్డీ చెల్లిస్తారా?:రేవంత్ రెడ్డి
విద్యుత్ ఛార్జీల మదింపుపై కేసీఆర్‌కు లేఖ
భద్రాచలం: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మదింపులో పేద, మధ్య తరగతి జేబులకు ప్రభుత్వం చిల్లు పెడుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మూడు నెలల వినియోగాన్ని కలిపి లెక్కించడంతో శ్లాబులు మారుతున్నాయని.. దీనివల్ల వినియోగదారులపై మూడింతలు అదనపు భారం పడుతోందన్నారు. 100 యూనిట్ల శ్లాబ్‌లో ఉన్న వినియోగదారులు 300 యూనిట్ల శ్లాబ్‌లోకి వచ్చారన్నారు. బకాయిలు వాయిదాల్లో చెల్లిస్తే 1.5 శాతం వడ్డీతో వసూలు చేస్తానని చెప్పడం దారుణమన్నారు. అడ్వాన్స్ ఛార్జీలు చెల్లించిన వారికి మీరు వడ్డీ చెల్లిస్తారా?అని ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో ఉపాధి పోయి కుటుంబ పోషణ భారంగా మారిన పేద, మధ్య తరగతికి కరెంట్ షాక్ ఇస్తున్నారని ఆక్షేపించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఒక్క రూపాయి అదనపు భారం పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.