close
Array ( ) 1

తాజా వార్తలు

సచిన్‌.. ఆ రోజే వందో శతకం చేసుంటే..

పాక్‌పై ఆడిన మ్యాచ్‌లన్నీ చిరస్మరణీయం: సచిన్‌

పాకిస్థాన్‌పై ప్రపంచకప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లూ చిరస్మరణీయమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ అన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన లిటిల్‌ మాస్టర్‌ తృటిలో వందో శతకం చేజార్చుకున్నాడు. టీమ్‌ఇండియా విజయం సాధించాక ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికై పై విధంగా స్పందించాడు. తర్వాత భారత్‌ ఫైనల్లో శ్రీలంకతో తలపడి రెండోసారి వన్డేల్లో విశ్వవిజేతగా నిలిచింది. పాకిస్థాన్‌తో సెమీస్‌ జరిగి నేటికి తొమ్మిదేళ్లు గడిచాయి. సచిన్‌ ఆ రోజు మూడంకెల స్కోర్‌ సాధించింటే ఎప్పటికీ గుర్తుండిపోయే రికార్డు నెలకొల్పేవాడు. 


ఆ రోజు శతకం చేసుంటే.. వంద శతకాలు

పాకిస్థాన్‌తో సెమీఫైనల్‌కు ముందు సచిన్‌ 99 అంతర్జాతీయ శతకాలతో కొనసాగుతున్నాడు. చిరకాల ప్రత్యర్థిపై వందో శతకం బాదుతాడని అభిమానులంతా ఆశించారు. అప్పటికే ఐదుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా శతకానికి చేరువలో ఔటయ్యాడు. 85 పరుగుల వద్ద సయీద్‌ అజ్మల్‌ బౌలింగ్‌లో షాహిద్‌ అఫ్రిదీ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. సెహ్వాగ్‌ (38), సురేశ్‌ రైనా (36) తమ వంతు బ్యాటింగ్‌ చేయడంతో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 260/9 స్కోర్‌ సాధించింది. పాక్‌ బౌలర్లు ఆది నుంచీ సచిన్‌ను ఔట్‌ చేయాలని చూసినా కుదరలేదు. దాయాది ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదలడంతో పాటు కీపర్‌ కమ్రన్‌ అక్మల్‌ ఒకసారి స్టంపౌట్‌ అవకాశాన్ని జారవిడిచాడు. మధ్యలో ఎల్బీడబ్ల్యూను కూడా తప్పించుకున్న లిటిల్‌ మాస్టర్‌.. వంద శతకాల రికార్డు ముంగిట ఔటయ్యాడు.


పాక్‌ ఛేదనలో చెలరేగిన భారత బౌలర్లు

అనంతరం పాకిస్థాన్‌ లక్ష్య ఛేదనకు దిగడంతో భారత బౌలర్లు సమష్టిగా రాణించి కట్టడి చేశారు. ఆ జట్టుకు శుభారంభం దక్కినా తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. మిస్బా ఉల్‌ హక్‌(56), మహ్మద్‌ హఫీజ్‌(43) పోరాడినా టీమ్‌ఇండియా బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. జహీర్‌ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా, మునాఫ్‌ పటేల్‌, హర్భజన్‌సింగ్‌, యువరాజ్‌ సింగ్‌ రెండేసి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్‌ చేశారు. దీంతో భారత్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సచిన్‌ మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 


మ్యాచ్‌పై సచిన్‌ ఏమన్నాడంటే.. 

‘మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌’గా ఎంపికైన సచిన్‌ పాకిస్థాన్‌పై ఆడిన ఐదు (ప్రపంచకప్‌లలో) మ్యాచ్‌లూ చిరస్మరణీయమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తమకు అద్భుతమైన మద్దతు పలికిన మొహాలీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాడు. ‘టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడింది. మా జట్టు బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. సెహ్వాగ్‌ శుభారంభం ఇచ్చినా తర్వాత మేం స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి అనుకున్న స్కోర్‌ సాధించలేకపోయాం. చివర్లో రైనా బ్యాటింగ్‌ బాగుంది. ఆట మొదలైనప్పుడు 300-310 పరుగులు చేస్తామనుకున్నాం. కానీ కుదరలేదు. ఇక ముంబయి (ఫైనల్‌)కు వెళ్లడం గొప్ప విశేషం. ఇప్పుడు తుదిపోరుకు సన్నద్ధమవ్వాలి. పాక్‌ మీద ఆడిన మ్యాచ్‌లన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని లిటిల్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చాడు. 

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.