close

తాజా వార్తలు

Published : 21/11/2020 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోహ్లీ తర్వాత మెచ్చుకున్నాడు: సూర్యకుమార్

(Photo: Surya Kumar Yadav Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓ మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను స్లెడ్జింగ్‌ చేయబోయిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ముంబయి 165 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగగా సూర్య (79నాటౌట్‌; 43 బంతుల్లో 10x4, 3x6) కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఆ జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లీ సూర్య వైపు గంభీరంగా చూస్తూ దగ్గరికి వెళ్లాడు. అప్పుడు సూర్య సైతం అంతే దీటుగా చూస్తూ పక్కకు వెళ్లిపోయాడు. ఈ విషయంపై తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ముంబయి బ్యాట్స్‌మన్‌.. మ్యాచ్‌ తర్వాత కోహ్లీ తనని మెచ్చుకున్నాడని చెప్పాడు. మ్యాచ్‌ జరిగేటప్పుడు బెంగళూరు సారథి ఒత్తిడిలో ఉన్నాడని, మ్యాచ్‌ గెలిచాక తనవద్దకు వచ్చి మంచి ఇన్నింగ్స్‌ ఆడావని ప్రశంసించినట్లు తెలిపాడు. తాను కూడా ఆ ఇన్నింగ్స్‌ను ఆస్వాదించినట్లు సూర్య పేర్కొన్నాడు. 

మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలో తమ ప్రాక్టీస్‌ కోసం ముంబయి ఇండియన్స్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పాడు. ముంబయి మొత్తం వర్షపు నీటితో నిండిపోయినా తాము రిలయన్స్‌ స్టేడియంలో సాధన చేసినట్లు చెప్పాడు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు పెద్ద పై కప్పు ఏర్పాటు చేసిందని, అలాగే మూడు వేర్వేరు పిచ్‌లు సిద్ధం చేసిందని చెప్పాడు. ఇక 13వ సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లినా అక్కడా అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని వివరించాడు. కఠిన పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జాగ్రత్తలతో పాటు మంచి భోజనం, హాటల్‌ వసతి, ఆటవిడుపు అంశాల్లో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించిందన్నాడు. తమ కోసమే ప్రత్యేక చెఫ్‌ను నియమించిందని, దాంతో ఏది కావాలంటే అది వడ్డించి పెట్టారని తెలిపాడు. మ్యాచ్‌లు లేని సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలు చేసుకున్నామని, దాంతో బయోబబుల్‌ లాంటి వాతావరణంలో కుటుంబసభ్యుల ప్రాముఖ్యత ఎలాంటిదో తమ జట్టు అర్థం చేసుకుందని చెప్పాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు తనని ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ రెండు, మూడు రోజులు ఎవరితో మాట్లాడలేకపోయానని అన్నాడు. అయితే, కొద్ది రోజుల తర్వాత సచిన్ తెందూల్కర్‌ నుంచి ఓ సందేశం వచ్చిందని, దాంతో తనలో నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పాడు. ఆట పట్ల అంకిత భావంతో ఉంటే, అదే నిన్ను పైకి తీసుకొస్తుందని మాస్టర్‌ బ్లాస్టర్‌ చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని