close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ సారి కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ఇచ్చింది. రాత్రి పూట కర్ఫ్యూ విషయంలో సడలింపులు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏం చేయలేదు.. తీపికబురు చెప్తారంటా: ఉత్తమ్‌

తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని.. స్థానిక సంస్థలను తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్థానిక సంస్థల కాంగ్రెస్‌ శ్రేణులతో ఉత్తమ్‌ మాట్లాడారు. ప్రభుత్వం స్థానిక సంస్థలను పట్టించుకోవడం లేదని.. అవసరమైన మేరకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ సంపాదనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కేసీఆర్‌ కొంటున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. త్వరలోనే స్వావలంబన భారత్‌: పవన్‌

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా అవతరించబోతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది కాలంలో దేశం ఎన్నో చారిత్రక, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను చూసిందని పవన్‌ అన్నారు. త్వరలోనే భారత్‌ స్వావలంబన సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ 21వ శతాబ్ది భారత్‌దేనని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌లో తిరుమల లడ్డూ విక్రయాలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రేపటి నుంచి హైదరాబాద్‌లో విక్రయించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. ఈ మేరకు తిరుమల నుంచి 40 వేల లడ్డూలను హైదరాబాద్‌కు పంపించినట్లు తితిదే తెలిపింది. గత 6 రోజులుగా ఏపీలో 13 జిల్లాల్లో లడ్డూలను విక్రయించగా.. దాదాపు 13 లక్షల మంది భక్తులు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసినట్లు  తితిదే అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

5. అవసరమైతే ఆస్తులను జప్తు చేస్తాం

రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేస్తూ ఇసుక, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేసి  ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపు దాడులు చేస్తున్నట్లు చెప్పారు.  నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీట్స్‌ తెరిచే యోచనలో ఉన్నట్లు  కమిషనర్ తెలిపారు. వారి ఆస్తులను సైతం జప్తు చేసేందుకు వెనకాడమని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 

6. దొంగతనం చేసినా కేసు పెట్టలేదు..కారణమిదే

కేవలం రూ.100 దొంగతనం చేస్తేనే ఆ వ్యక్తిని  కొట్టి చంపిన ఘటనలు మనం చాలానే చూశాం. అలాంటిది తన దుకాణంలోకి అక్రమంగా చొరబడి దొంగతనం చేసిన వ్యక్తిపై  దుకాణదారుడు పోలీస్‌ కేసు పెట్టకుండా మానవత్వంతో వదిలేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని యవత్మాల్‌ జిల్లా అంతటా కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా లాక్‌డౌన్‌ విధించారు. ఈ క్రమంలోనే గత బుధవారం రాత్రి స్థానిక గాంధీచౌక్‌ ప్రాంతంలో ఓ వ్యక్తికి బాగా ఆకలి వేయడంతో ఏం చేయాలో పాలుపోక సమీపంలో ఉన్న రాజేష్‌మోర్‌ అనే వ్యక్తికి చెందిన తినుబండారాల దుకాణం తలుపులు బద్దలుగొట్టి అందులోకి చొరబడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పెట్రోల్ హోం డెలివరీ!

 ఇతర నిత్యావసరాల మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీని హోం డెలివరీ చేసేందుకు కేంద్రం త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వాహనదారులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  వెల్లడించారు. 2018 నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొన్ని నగరాల్లో మొబైల్ డిస్పెన్సర్లతో డీజిల్‌ను‌ హోం డెలివరీ చేస్తోంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని స్టార్టప్‌ కంపెనీ రెపోస్ ఎనర్జీ.. మొబైల్ పెట్రోల్ పంప్‌ల తయారీకి ముందుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లిఫ్టులో చిన్నారి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో

లిఫ్టులో పైకి కిందికి వెళుతూ ఆడుకోవటం అంటే పిల్లలకు చాలా ఇష్టం. తల్లితండ్రులు కూడా ఇందులో ఏమీ ప్రమాదం లేదనే అనుకుంటారు. అయితే ఎవరూ వెంటలేకుండా చిన్నారులను లిఫ్టులో ఒంటరిగా వెళ్లనిచ్చే విషయంలో వీరు మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గుండె కొట్టుకోవటం ఒక్క క్షణం ఆగిపోయేలా ఉన్న ఈ వీడియోలో... పెద్దలు ఎవరూ వెంటలేకుండా ఓ చిన్నారి లిఫ్టులోకి రావటం చూడవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఖేల్‌ రత్నకు రోహిత్‌.. అర్జునకు ధావన్‌

ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పురస్కారానికి టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేరును బీసీసీఐ ప్రతిపాదించింది. పేసర్‌ ఇషాంత్‌ శర్మ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, మహిళా క్రికెటర్‌ దీప్తిశర్మను అర్జున పురస్కారాలకు నామినేట్‌ చేసింది. 2020 ఏడాదికి గాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు వీరి పేర్లను పంపించింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టుకు రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌ అన్న సంగతి తెలిసిందే. క్రీజులో నిలిస్తే విధ్వంసం సృష్టించే హిట్‌మ్యాన్‌ 2019 ఏడాదికి గాను ఐసీసీ వన్డే క్రికెట్‌ పురస్కారం అందుకున్నాడు. ఒక ప్రపంచకప్‌ టోర్నీలో ఐదు శతకాలు బాదేసిన ఏకైక క్రికెటర్‌ ఘనత సొంతం చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

తిరుపతి తిలక్‌ రోడ్డులోని మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి మద్యం ప్రియులు, దానిని తాగేందుకు నీటి కోసం దుకాణం సమీపంలోని మున్సిపాలిటీ పంపు వద్ద నీటిని పట్టుకుంటున్నారు. ప్రభుత్వ మద్యం, మున్సిపాలిటీ నీరు రెండింటిని కలుపుకొని బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. ఇలా బహిరంగంగా తాగడాన్ని నివారించాలని ఆ ప్రాంతంలోని స్థానికులు, వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.