
తాజా వార్తలు
బైడెన్ ఫ్రమ్ ముంబయి..!
ముంబయిలో ఆయనకు బంధువులు!
2013, 2015లో స్వయంగా వెల్లడించిన జో బైడెన్
ముంబయి: అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికైన వేళ.. యావత్ ప్రపంచం ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుతెచ్చుకుంటోంది. ఇప్పటికే అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారతీయ అమెరికన్ కమలా హారిస్‌కు తమిళనాడు మూలాలుండడంతో ఆ రాష్ట్రంలో సందడి నెలకొంది. ఇదే సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కూ భారత్‌తో కుటుంబ అనుబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఐదుగురు బైడెన్లు ఉన్నారనే వార్త మరోసారి తెరపైకి వచ్చింది.
జో బైడెన్‌కు భారత్‌లోనూ బంధువులున్న విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా బైడెనే స్వయంగా వెల్లడించారు. తమ కుటుంబానికి చెందిన ఐదుగురు దూరపు బంధువులు ముంబయిలోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం రెండు సంవత్సరాల తర్వాత 2015లో వాషింగ్టన్లో జరిగిన ఓ సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించిన బైడెన్.. వారి వివరాలు తెలిశాయన్నారు. అయితే, బైడెన్ ఈ విషయాన్ని చెప్పినప్పటికీ తామే బైడెన్ బంధువులని ఇప్పటివరకూ ముంబయి నుంచి ఎవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
భారత్‌లో పర్యటనలో భాగంగా 2013 జులై 24న బాంబే స్టాక్ ఎక్ఛేంజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జో బైడెన్ ప్రసంగించారు. ఆ సమయంలో ‘బైడెన్ ఫ్రమ్ ముంబయి’ అంటూ తనకు భారత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘భారత్‌లో పర్యటించడం, ముఖ్యంగా ముంబయికి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను 29ఏళ్ల వయసున్న సమయంలో (1972) తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యా. ఆ సమయంలో భారత్ నుంచి బైడెన్ పేరుతో దూరపు బంధువు అయ్యే వ్యక్తి నుంచి ఉత్తరం వచ్చింది. అయితే, తర్వాత వారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని చింతిస్తున్నాను’’ అని తన ప్రసంగం మధ్యలో బైడెన్ గుర్తుచేసుకున్నారు. అయితే, వంశవృక్షంపై పరిశోధనలు చేసేవారు ఎవరైనా తమ బంధువుల సమాచారం తనతో పంచుకోవచ్చని బైడెన్ కోరారు.
అది జరిగిన రెండు సంవత్సరాల తర్వాత, 2015లో వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ముంబయి బంధువులపై బైడెన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీలో కెప్టెన్‌గా పనిచేసిన ‘జార్జ్ బైడెన్’ వరుసకు ముత్తాత (గ్రేట్, గ్రేట్, గ్రేట్, గ్రేట్, గ్రాండ్‌ఫాదర్). ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాక ముంబయిలోనే స్థిరపడ్డారు. అంతేకాకుండా ఆయన భారతీయ స్త్రీని వివాహం చేసుకున్నారు. మొబైల్ నంబర్ సహా వారి వివరాలను నాకు కొందరు అందించారు. అయితే, ఇప్పటివరకు వారిని నేను సంప్రదించలేదు. కానీ, వారిని కలిసే ప్రయత్నం చేస్తాను’’ అని వాషింగ్టన్లో భారతీయులతో జరిగిన ఓ సమావేశంలో బైడెన్ పేర్కొన్నారు. అయితే, దాని తర్వాత బైడెన్ వారిని కలిశారా? లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన నేపథ్యంలో ఆయన బంధువులు ముంబయిలో ఉన్నారన్న విషయం మరోసారి ఆసక్తిగా మారింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
