‌రాజకీయాల కోసం దేవుణ్నీ వదలడం లేదు:జగన్‌
close

తాజా వార్తలు

Updated : 04/01/2021 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‌రాజకీయాల కోసం దేవుణ్నీ వదలడం లేదు:జగన్‌

తిరుపతి: రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రజలపై ఎలాంటి వివక్ష చూపలేదని పేర్కొన్నారు. అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని.. పార్టీలు, కులాలు, మతాలు చూడాల్సిన అవసరం తమకు లేదని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్‌ పేర్కొన్నారు. మంచి పాలన చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారన్నారు. నేరాలు చేసే వారి మనస్తత్వాలు పూర్తిగా మారిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. తిరుపతి పోలీస్ పరేడ్‌ మైదానం కల్యాణి డ్యాం పోలీస్‌ శిక్షణా కళాశాల వేదికగా సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, డీజీపీ సవాంగ్‌ ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

‘రాష్ట్రంలో ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వసాలు దెబ్బతీసే విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఎవరిని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గాలు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలి. ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సమాజంలో వైట్‌ కాలర్‌ నేరాలు పెరిగిపోయాయి. యుగం మారింది.. కలియుగంలో క్లైమాక్స్‌ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేవుడంటే భక్తి, భయం లేని పరిస్థితి నేడు నెలకొంది. రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వదలడం లేదు. దేవుని ద్వారా రాజకీయాలు పొందే దారుణమైన క్లైమాక్స్‌లో మనం ఉన్నాం. దేవుని విగ్రహాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కన్పిస్తోంది’ అని జగన్‌ అన్నారు.

సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న రోజుల్లోనే విగ్రహాల ధ్వంసాలు జరగుతున్నాయని జగన్‌ అన్నారు. ‘ప్రభుత్వ పథకాలకు ప్రచారం జరగకూడదనే విగ్రహ ధ్వంసాల కుట్రలు జరగుతున్నాయి. ప్రభుత్వం ఎప్పుడు మంచి పనులు చేస్తుందో అప్పుడే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 20 వేల ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. తప్పు ఎవరు చేసినా తప్పే. అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందే’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రైవేటు ఆలయాలు, ప్రతిపక్ష నాయకుల ఆలయాల్లో ఘటనలు జరుగుతున్నాయన్నారు. రాజకీయపరంగా జరుగుతున్న గెరిల్లా యుద్ధాన్ని పోలీసులు అడ్డుకోవాలని ఆయన ఆదేశించారు. 

కొవిడ్‌ సమయంలో పోలీసు సేవలు అమోఘం: డిప్యూటీ సీఎం 
కొవిడ్‌ సమయంలో పోలీసులు వెనకడుగు వేయకుండా గొప్పసేవలు అందించారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కొనియాడారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్టేట్‌ పోలీస్ మీట్‌కు ఇగ్నైట్‌ అనే పేరు పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను జాతీయ స్థాయి ప్రమాణాలతో జరుపుతున్నారు. డ్యూటీ మీట్‌లో నిర్వహించే 18 రకాల పోటీల్లో అన్ని విభాగాల పోలీసు శాఖలకు చెందిన 450 మంది పాల్గొంటారు. 40 మంది ఐపీఎస్‌ అధికారులు హాజరవుతున్న విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి..
సీతమ్మ విగ్రహం ధ్వంసం

వైకాపాది హత్యారాజకీయం: చంద్రబాబు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని