
తాజా వార్తలు
విశాఖ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు
పెందుర్తి: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం ఖాయమని.. తెదేపా విజయాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలోని పెందుర్తి కూడలి, గోపాలపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రచారంలో భాగంగా జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్‌ను చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో పీలా శ్రీనివాస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికల్లో తెదేపాకు బ్రహ్మాండమైన గెలుపును అందించాలని ప్రజలను కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని ఎంతో కృషి చేశానన్నారు. విశాఖను ప్రపంచ పటంలో పెట్టామని.. నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసినట్లు వెల్లడించారు. విశాఖను అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం తెదేపాకే ఉందన్నారు. విశాఖ ప్రజలు నీతి, నిజాయతీకి మారు పేరు అని అన్నారు. హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు విశాఖలోనే 10 రోజులు ఉన్నట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాకే తిరిగి వెళ్లినట్లు చెప్పారు. విశాఖను ప్రపంచ పటంలో పెట్టామని.. నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసినట్లు చెప్పారు. నగరాన్ని అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం తెదేపాకే ఉందన్నారు.
అనుక్షణం అండగా ఉంటాం..
‘‘విశాఖలో దందాలు, భూకబ్జాలు పెరిగాయి. రామతీర్థం వెళ్తే నాపై కేసులు పెట్టారు. వైకాపా గెలిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మీరు ఒప్పుకున్నట్లే అవుతుంది. అంతేకాదు.. ఆటవిక రాజ్యం వస్తుంది. మీ ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ఆటవిక రాజ్యంలో బలం ఉండే వారిదే పైచేయి అవుతుంది. రౌడీయిజం చేసే వారే రాజ్యమేలుతారు. మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాస్‌ను గెలిపించండి. విశాఖను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు అనుక్షణం శ్రీనివాస్‌కు అండగా ఉంటాం. విశాఖకు పూర్వ వైభవం తీసుకొస్తాం. శాంతి భద్రతలు అదుపులోకి తీసుకొస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.