డ్రాగన్‌ ‘కృత్రిమ’ తెలివి..!
close

తాజా వార్తలు

Updated : 23/03/2021 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రాగన్‌ ‘కృత్రిమ’ తెలివి..!

సరిహద్దుల వెంట సలామీ స్లైసింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ మా మిత్రదేశం.. ప్రత్యర్థి కాదంటూ రెండు వారాల క్రితం చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ ప్రకటన చేశారు. ఆయన ప్రకటన సారాంశం వాస్తవిక పరిస్థితుల్లో ఎక్కడా కనిపించడంలేదు.. వివాదాస్పద సరిహద్దుల్లో వేగంగా సరికొత్త గ్రామాలను నిర్మిస్తోంది. ముఖ్యంగా భారత్‌, భూటాన్‌, నేపాల్‌ సరిహద్దుల్లో ఇవి కనిపిస్తున్నాయి. ఈ విషయంపై జపాన్‌ టైమ్స్‌ పత్రిక కథనం ప్రచురించింది.

624 గ్రామాలు నిర్మించాలని ప్రణాళిక..?

డ్రాగన్‌ ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ గ్రామాలను నిర్మిస్తోందని ఆ కథనం పేర్కొంది. ఇలా నిర్మించిన గ్రామాల ద్వారా ఆయా ప్రాంతాలపై పట్టు సాధించాలని చూస్తోంది.  ఈ ప్రాంతాల్లో ప్రజలు నివసించేలా చేస్తుంది. ఆ తర్వాత అక్కడ మెల్లగా సైనిక స్థావరాల నిర్మాణం చేపడుతుంది. వీటిల్లో ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ స్టేషన్లు, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌, భూగర్భ ఆయుధ బంకర్లను ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో ప్రత్యర్థును భయపెట్టేందుకు సైకలాజికల్‌ వార్ఫేర్‌ను, తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకురావడం,  భయపెట్టే దౌత్య విధానాలను అవలంభించడం చేస్తుంది. ప్రత్యర్థులు పూర్తి స్థాయి యుద్ధానికి దిగకుండా.. చిన్నమొత్తంలో భూభాగాలను ఆక్రమించుకొంటూ వెళుతుంది. దీనిని ‘సలామీ స్లైసింగ్‌’ విధానం అంటారు. హిమాలయాల్లోని సరిహద్దు వివాదాలున్నచోట్ల దాదాపు 624 గ్రామాలను నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకొంది. ఈ విషయాన్ని  గతేడాది ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు’ చైనా అధికారిక పత్రాలను ఉటంకిస్తూ పేర్కొంది. పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చైనా ఇలా గ్రామాలను నిర్మించి.. వాటిలోకి ప్రజలను తరలిస్తోంది.

ప్రజలను తరలించేది ఎందుకంటే..?

ఇలా నిర్మించిన గ్రామాల్లో నివసించేందుకు టిబెట్‌ వాసులను, హాన్‌ చైనీయులను సరిహద్దులకు తరలిస్తోంది. ఇలా వచ్చిన హాన్‌ చైనీలు కమ్యూనిస్టు పార్టీ తరఫున అధికారిక వ్యవహారాలను చూస్తుంటారు. ముఖ్యంగా ఈ ఆక్రమణలకు, సరికొత్త భూవివాదాలను సృష్టించడానికి పశువుల కాపర్లను వాడుకుంటారు. దీంతో అంతర్జాతీయ చట్టాల ప్రకారం తన వాదానలకు బలం లభించేందుకు డ్రాగన్‌ సరిహద్దుల్లో గ్రామాలను నిర్మించి.. అందులో తమ పౌరులను ఉంచుతోంది. వీరు చైనా వాదనలకు అవసరమైనా ఆధారాలను అక్కడ సిద్ధం చేస్తారు.  అవసరమైన సమయంలో ఇంటెలిజెన్స్‌ సమాచార సేకరణకు కూడా వీరిని ఉపయోగిస్తోంది. ఇటీవల భారత్‌ నుంచి ఆక్రమించిన భూభాగంలో చైనా గ్రామాన్ని నిర్మించింది. ఆ ప్రదేశంలో భారత్‌ సార్వభౌమత్వాన్ని గుర్తించబోమని పేర్కొంది. నేపాల్‌, భూటాన్‌లతో కూడా ఇలానే వ్యవహరిస్తోంది. పొరుగుదేశాలు సైనిక చర్యలకు దిగితే ‘పౌరులపై సైనిక దాడులు’గా చూపించేందుకు చైనాకు అవకాశం లభిస్తోంది.

దక్షిణ చైనా సముద్రంలోనూ ఇలాంటి వ్యూహమే..

చైనా 2013 తర్వాత దక్షిణ చైనా సముద్రంలో చడీచప్పుడు లేకుండా కృత్రిమ దీవులను నిర్మించింది. దీంతో ఆ చుట్టుపక్కల సముద్రం మొత్తం తమ ప్రాదేశిక జలాలుగా చెప్పడం మొదలుపెట్టింది. ఇతర దేశాల ప్రాదేశిక జలాలను తనవిగా చెప్పుకొనేందుకు మత్స్యకారులను అక్కడకి పంపిస్తోంది. వారికి చైనా కోస్టుగార్డు మద్దతుగా ఉంటోంది. ఈ క్రమంలో దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో ఘర్షణలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇప్పుడు ఆ కృత్రిమ దీవులను తలిపించేలా.. హిమాలయాల్లో కృత్రిమ గ్రామాలను నిర్మిస్తోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని