
తాజా వార్తలు
ఇందుకే సూచీలు ‘బేర్’మంటున్నాయి...!
ఇంటర్నెట్‌డెస్క్: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో బెంబేలెత్తిపోయాయి. ఒక దశలో లోయర్ సర్క్యూట్‌ను విధించారు. దీంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ ట్రేడింగ్‌ను కొనసాగించారు. మార్కెట్లు మళ్లీ కోలుకొంటున్నాయి. కరోనా, చమురు ఈ రెండు నిలకడగా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు జీడీపీ వృద్ధిరేటు తగ్గిపోతుందనే అంచనాలు కూడా ఆందోళనకు గురిచేశాయి.
వాల్‌స్ట్రీట్ పతనంతో..
అమెరికా మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. అమెరికా ప్రయాణ ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దీంతోపాటు అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ పెరగడంతో అక్కడ మార్కెట్లలో తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. బ్లూచిప్ షేర్స్‌తో కూడా డోజోన్స్ ఇండెక్స్ భారీగా పతనమైంది. 1987 అక్టోబర్‌లో బ్లాక్ మండే స్థాయిలో పడిపోయింది. ఇప్పటికే నాస్డాక్, ఎస్అండ్పీ 500 కూడా వాటి మొత్తం విలువలో నాలుగో వంతు కోల్పోయాయి. కేవలం 16 సెషన్లలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం మార్క్ట్ భయాలకు అద్దం పడుతోంది.
పాతాళానికి ఆసియా మార్కెట్లు..
మరోపక్క ఆసియా మార్కెట్లు కూడా పాతాళానికి పడిపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ పరిస్థితి కూడా ఇంతే ఉంది. ఆ దేశ సూచీ నిక్కీ 10శాతం పతనమైంది. 2008 తర్వాత ఒక వారంలో ఇంతగా విలువ కోల్పోవడం ఇప్పుడే. ఇవాళ ఒక్కరోజే 6శాతం వరకు విలువ కోల్పోయింది. ఇక తైవాన్ మార్కెట్లు కూడా 4శాతం, హాంకాంగ్ మార్కెట్లు 5శాతం, చైనా మార్కెట్లు 3శాతం విలువ కోల్పోయి ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా ఇదే బాట పట్టాయి.
యూబీఎస్ జీడీపీ వృద్ధిరేటు తగ్గించడం..
స్విస్‌కు చెందిన ప్రముఖ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ భారత జీడీపీ అంచనా విలువను తగ్గించడం కూడా మార్కెట్లను భయపెట్టింది. ఈ సంస్థ 2020-21కి దేశ జీడీపీ 5.1శాతం ఉండొచ్చని అంచనా కట్టింది. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 4.8శాతంగా జీడీపీ వృద్ధిరేటును అంచనా కట్టింది. దశాబ్దకాలంలో ఇదే అతితక్కువ జీడీపీ వృద్దిరేటు.
వీడని చమురు తెట్టు..
మార్కెట్లను చమురు యుద్ధ భయాలు వీడలేదు. దీంతో 1991 స్థాయికి ధరలు పడిపోయాయి. వరుసగా మూడోరోజు కూడా చమురు ధరలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా చమురు సూచీలు 2008 నాటి పరిస్థితికి చేరుకొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారంలో బ్రెంట్ క్రూడ్ ధర 28శాతానికి పైగా పతనమైంది. గల్ఫ్ వార్ సమయంలో 29శాతం పడిపోయింది.
భయపెట్టిన తొలి మరణం..
భారత్‌లో తొలిసారి కరోనా మరణం సంభవించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. వైరస్ సమస్య తీవ్రమైపోతుందనే ఆందోళన కూడా సూచీలను పడేసింది. హైదరాబాద్‌లో మంగళవారం మరణించిన 70 ఏళ్ల కర్ణాటక వ్యక్తి కరోనాతోనే మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు చెప్పారు. మరోవైపు కోవిడ్-19 చాప కింద నీరులా ప్రపంచం మొత్తానికీ పాకుతూ అటు ప్రజలు, ఇటు ఆర్థిక వ్యవస్థల ఆరోగ్యాన్ని కుంగదీస్తోంది. దీని తాకిడికి దేశ దేశాలే క్వారంటైన్లుగా మారిపోయాయి. కరోనా వ్యాప్తి ఆందోళనతో దేశంలోని 18-20 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసేలా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ వెసులుబాటు కల్పించాయి. 115 దేశాలకు దీని పాద ముద్ర విస్తరించింది. హాలీవుడ్, క్రీడా ప్రముఖులకూ దీని బాధ తప్పలేదు.
వారాంతం భయాలు..
మార్కెట్లు నేటి తర్వాత శని, ఆదివారం విరామం తీసుకొని మళ్లీ సోమవారం మొదలవుతాయి. కరోనా వైరస్ విషయంలో వేగంగా పరిణామాలు సంభవిస్తుండటంతో ఈ రెండ్రోజుల్లో ఏమైనా జరిగితే తాము సోమవారం నాటి ట్రేడింగ్‌లో నష్టపోతామని భయంతో మదుపరులు స్టాక్స్‌ను అమ్మేస్తున్నారు. దీనికి తోడు నేడు అమెరికా మార్కెట్లు మరోసారి పతనం అయితే ఆ ప్రభావం భారత మార్కెట్లపై సోమవారం కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా మార్కెట్ల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు.
ఎఫ్ఐఐల అమ్మకాలు.. బంగారం వెండి ధరల పతనం..
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు విక్రయాలను కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కడా పరిస్థితి బాగోకపోవడంతో వారు తమ సొమ్మును ఉపసంహరించుకొంటున్నారు. దీనికి తోడు బంగారం వెండి మార్కెట్లు నష్టాల్లో ఉండటం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.