close

తాజా వార్తలు

Updated : 22/02/2020 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీమ్‌ఇండియా క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా వీడ్కోలు

ముంబయి: టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్ని ఫార్మాట్లలో దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. తన వీడ్కోలు లేఖను ట్విటర్లో ఉంచాడు. 33 ఏళ్ల ఓజా 2013లో ముంబయిలో చివరి టెస్టు ఆడాడు. సచిన్‌ తెందూల్కర్‌కు సైతం ఇదే ఆఖరి టెస్టు కావడం గమనార్హం. ఓజా 24 టెస్టుల్లో 113 వికెట్లు; 18 వన్డేల్లో 21 వికెట్లు పడగొట్టాడు. 6 టీ20లు ఆడాడు.

‘ఈ క్షణం నుంచే దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. నా జీవితంలో తర్వాత దశలో ప్రవేశించేందుకు ఇదే సరైన సమయం. నాపై ప్రతి ఒక్కరు చూపిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. అవి నా జీవితం మొత్తానికి ప్రేరణనిస్తాయి’ అని ఓజా ట్విటర్లో పేర్కొన్నాడు. ‘భారత క్రికెటర్‌గా అత్యున్నత స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని యువకుడిగా కలలుగన్నా. ఆ కల నెరవేరినందుకు నేనెంత అదృష్టవంతుడినో వర్ణించలేను’ అని తెలిపాడు. ఐపీఎల్‌లో ఓజా దక్కన్‌ ఛార్జర్స్‌, ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడాడు. 2014లో అతడి బౌలింగ్‌ శైలిపై అనుమానాలు రావడంతో 2015లో దానిని క్లియర్‌ చేసుకున్నాడు.

‘దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశమిచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం తరఫున దాదాపు 14 ఏళ్లు ఆడాను. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యధిక వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ సాధించడం నా కెరీర్లో ప్రత్యేకం. ఎంతోమంది సీనియర్లు నాకు సాయం చేశారు. నన్ను తమ్ముడిలా భావించి మార్గనిర్దేశం అందించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఆదర్శంగా భావించే వెంకటపతి రాజు, నాకు సలహాలు ఇచ్చిన హర్భజన్‌సింగ్‌, టీమ్‌ఇండియా టోపీ ధరించే అవకాశమిచ్చిన ఎంఎస్‌ ధోనీకి ధన్యవాదాలు. నాతోపాటు ఆడిన రోహిత్‌ శర్మ, మనోజ్‌ తివారీ, నా హైదరాబాద్‌ సహచరులు అమోల్‌ షిండె, అర్జున్‌, అల్ఫ్రెడ్‌ అబ్‌సోలమ్‌, నిరంజన్‌, నా తల్లిదండ్రులు బిదులత, మహేశ్వర్‌, సతీమణి కరాబె కైలాష్‌, తమ్ముడు ప్రతీక్‌, కోచ్‌లు, ప్రత్యేకించి నాకు టెస్టు టోపీ అందించిన సచిన్‌ తెందూల్కర్‌కు కృతజ్ఞతలు’ అని ఓజా తన లేఖలో రాశాడు.

 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్