close

తాజా వార్తలు

Published : 17/02/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంచు ముప్పులో గుండె చప్పుడు

వేసవి సెలవులంటే ఎగిరిగంతేయని పిల్లలుంటారా? పరికుల్‌ కూడా అంతే. కాకపోతే ఆమెకు ఆ సమయం ఆటవిడుపు కాదు. సేవ చేసే సమయం.. అది కూడా ఎత్తైన హిమాలయాల్లో... రక్తం గడ్డకట్టే చలిలో! చిన్నవయసులోనే ఎంతో మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడి ప్రధాని ప్రశంసలను దక్కించుకున్న పరికుల్‌... వసుంధరతో తన అనుభవాలను పంచుకుంది.

సముద్రమట్టానికి 14వేల అడుగుల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్‌ ఆలయం అది. మైనస్‌ తొమ్మిది డిగ్రీల గడ్డకట్టే చలిలో దర్శనం కోసం భక్తులంతా వేచి ఉన్నారు. అకస్మాత్తుగా ఓ మహిళ చలికి స్పృహతప్పి పడిపోయింది. చుట్టూ ఉన్నవాళ్లకి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో... ఎక్కడి నుంచి వచ్చిందో 14 ఏళ్ల ఆ అమ్మాయి, తక్షణ వైద్యం అందించి ఆమె ప్రాణాలు కాపాడింది. ఆశ్చర్యపోవడం చుట్టూఉన్నవాళ్ల వంతైంది. ఆ అమ్మాయి దిల్లీకి చెందిన పరికుల్‌ భరద్వాజ్‌. ప్రస్తుతం దిల్లీ సెయింట్‌ మేరీ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచే సేవలో నిమగ్నమైన ఆమె.. తన ప్రయాణాన్ని వివరిస్తుందిలా...

నాలుగేళ్ల వయసు నుంచే...

నాన్న ప్రదీప్‌, అమ్మ అనిత భరద్వాజ్‌ వైద్యులు. సేవాభావం నిండుగా ఉన్నవాళ్లు. విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో బాధితులకు వైద్యసేవలను అందించడంలో ముందుండేవారు. వారి ప్రభావం నాపై పడింది. ఊహ తెలిసినప్పటి నుంచి ‘సాయం’ చేయడం అనే పదం నన్నెంతగానో ఆకర్షించేది. వైద్యసేవలు అందని ప్రాంతాలకు అమ్మానాన్న వెళ్లి చికిత్స అందించేవారు. అక్కడేం జరిగింది, అక్కడివారంతా ఎలా ఉన్నారనే విషయాలను వాళ్లనే అడిగి తెలుసుకునేదాన్ని. నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వాళ్లు చెప్పలేకపోయేవారు. చివరికి నా ఆసక్తిని గుర్తించి, నాకు నాలుగేళ్లప్పుడు వాళ్లతోపాటు కేదార్‌నాథ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వందలాదిమంది భక్తులు వరుసలో నిలబడి.. విపరీతమైన చలిలో వణుకుతూ ఉంటే వాళ్లందరికీ వేడి నీటిని అందించానట. నేనూ.. ఈ సేవల్లో పాలుపంచుకుంటా అని అమ్మతో చెప్ఫా నా చదువుపై ఈ ప్రభావం పడకుండా, వేసవి సెలవుల్లో మాత్రమే వెళ్లాలన్నారు.

ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని...

‘మౌంటెయిన్‌ మెడిసిన్‌’ ... ఇది చాలా క్లిష్టమైన అంశం. వేలాది అడుగుల ఎత్తులో చేసే ఈ సేవ చాలా కష్టతరమైంది. దీనికి పూర్తిస్థాయిలో శిక్షణ అవసరం.ఐటీబీపీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల నేతృత్వంలో దీనికోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా నదులు దాటడం, అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రాణాపాయంలో ఉన్నవారికి ప్రాథమిక చికిత్స అందించడం, ట్రెక్కింగ్‌, మందులపై అవగాహన వంటివన్నీ నేర్పుతారు. ఇందులో చేరడానికి నా తొమ్మిదోఏటే దరఖాస్తు చేసుకుని ఎంపికయ్యా. అతి చిన్నవయసులో ఈతరహా సేవలందించే అమ్మాయిగా ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో నా పేరు నమోదైంది. నా బృందంతో కలిసి ప్రస్తుతం కేధార్‌నాథ్‌, అమర్‌నాథ్‌, మణిమేషి వెళుతున్నా. ఏటా మూడు నెలల వరకు కేదార్‌నాథ్‌లో సేవలందిస్తున్నా. ట్రెక్కింగ్‌కు వచ్చేవారు వాతావరణమార్పుల వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాంటి వారిలో చాలామందికి ఆక్సిజన్‌ సరిపోక, ప్రాణాపాయస్థితికి చేరుకుంటారు. అలాంటప్పుడు ప్రాథమిక చికిత్సనందించి సమీపంలోని వైద్యశిబిరానికి తరలిస్తా. ఇవన్నీ మనసుకు తృప్తి కలిగించే సంఘటనలే.

గడియారం ఇచ్చారు...

మోదీజీ సంతకం చేసిన చేతిగడియారం, ఆయన రాసిన పుస్తకం నాకు కానుకగా ఇచ్చారు. ఇంత చిన్నవయసులో నువ్వు అందుకుంటున్న గౌరవం నీ సేవలకు ప్రారంభం మాత్రమే. మరిన్ని సాధించాలి. నిన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న ఎందరికో భవిష్యత్తులో మార్గదర్శకురాలివి కావాలన్నారు.

- పరికుల్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.