close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/05/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అదను దొరికింది..పదును పెంచుకోండి!

రెజ్యూమెకి మెరుగులు

మన గురించి మనం మంచిగా మార్కెట్‌ చేసుకోడానికి అవకాశం ఇస్తుంది రెజ్యూమె. అది ఎంత ఆకర్షణీయంగా ఉంటే అంత వేగంగా తర్వాతి దశకు చేరుకుంటుంది. లేదంటే వెంటనే బుట్టదాఖలవుతుంది. అలా అని దాన్ని ఆకట్టుకునే వాక్యాలతో తీర్చిదిద్దితే సరిపోదు. ఆసక్తికరమైన, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని అందులో పొందుపరచాలి. లాక్‌డౌన్‌లో కావాల్సినంత సమయం దొరుకుతోంది. ఆశిస్తున్న జాబ్‌కు అనుకూలమైన కొత్త కొత్త స్కిల్స్‌ను నేర్చుకొని రెజ్యూమెను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో కొంతమంది విద్యార్థులు, ఉద్యోగులు ఆన్‌లైన్‌ తరగతులతో, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో రోజులు గడుపుతున్నారు. కానీ చాలామంది కబుర్లు, కాలక్షేపాలతో.. మధ్య మధ్యలో ‘బోర్‌’ అంటూ నిట్టూర్పులతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ఇంతకుముందు ఏది నేర్చుకోవాలన్నా సమయం సరిపోవడం లేదనే బాధను వ్యక్తం చేసేవారు. ఇప్పుడు కావాల్సినంత టైమ్‌ దొరుకుతోంది. కాబట్టి దాన్ని కెరియర్‌ నిర్మాణానికి వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఆన్‌లైన్‌లో ఎన్నో మార్గాలున్నాయి. సమాచారమూ ఉంది. అనువైన వాటిని ఎంచుకొని అదనపు నైపుణ్యాలను పెంచుకోవాలి. సాధారణ జీవితం ప్రారంభమయ్యేనాటికి విద్యార్థులు, ఉద్యోగార్థులు కొత్త స్కిల్స్‌తో సిద్ధంగా ఉండటంపై దృష్టిపెట్టాలి.

ఆన్‌లైన్‌ తరగతులు

విద్యార్హతలు, ఉద్యోగాలతో సంబంధం లేకుండా సంస్థలు అభ్యర్థుల నుంచి అదనపు నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. రిక్రూటర్లూ రెజ్యూమెలో నైపుణ్యాల ఆధారంగానే సంబంధిత ఉద్యోగానికి సరిపోతారో లేదో అంచనావేస్తున్నారు. కాబట్టి, మిగతావారి కంటే వెనకబడి పోకూడదనుకుంటే.. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎన్నో అవకాశాలు అందుకు సాయపడుతున్నాయి. లిండా, యుడెమి, స్కిల్‌షేర్‌, కోర్స్‌ఎరా మొదలైనవి అందులో కొన్ని. టీసీఎస్‌, నాస్కామ్‌ వంటి సంస్థలూ విద్యార్థులతోపాటు ఉద్యోగ నిపుణులకూ ఉచితంగా కోర్సులను అందుబాటులో ఉంచాయి.

సోషల్‌ మీడియా వేదికలు

ఉద్యోగ ప్రయత్నం అనగానే సంబంధిత వెబ్‌సైట్లలో రెజ్యూమె అప్‌లోడ్‌ చేయమని చాలామంది సలహాలు ఇస్తుంటారు. జాబ్‌ అన్వేషణ మొదలు పెట్టిన తర్వాతే రెజ్యూమెలను సిద్ధం చేసుకోవాలని ఏమీ లేదు. అవగాహన పెంచుకోడానికీ ప్రయత్నించవచ్ఛు లింక్‌డిన్‌, షైన్‌, మాన్‌స్టర్‌ మొదలైన ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు అందుకు సహకరిస్తున్నాయి. రెజ్యూమె తయారీలో మెలకువలను నేర్పుతున్నాయి. వీటిని పరిశీలించడం వల్ల అభ్యర్థి అర్హతలకు ఎలాంటి ఉద్యోగాలు మార్కెట్‌లో ఉన్నాయి, ఏయే నైపుణ్యాలను సంస్థలు ఆశిస్తున్నాయి తదితరాల గురించి తెలుసుకోవచ్ఛు కొన్ని వెబ్‌సైట్లు వివిధ రంగాల నిపుణులతో మాట్లాడే వీలునూ కల్పిస్తున్నాయి. దీని వల్ల ప్రముఖ సంస్థలు, వాటి అవసరాలను తెలుసుకోవచ్చు.

రెజ్యూమె సంగతేంటి?

ఇంటర్న్‌షిప్‌, సెమినార్లు, ఉద్యోగ నియామకాలు.. ఇలా వేటికైనా అభ్యర్థి రెజ్యూమెను సమర్పించాల్సిందే. కానీ దీనిపై చాలామందికి ఒక రకమైన నిర్లక్ష్యం ఉంటుంది. రెజ్యూమె అనేది ఉద్యోగార్థులకు సంబంధించినదని విద్యార్థులు తేలిగ్గా తీసుకుంటారు. ఉద్యోగాల్లోనే ఉన్నాం కదా.. ఇప్పుడు దాంతో పనేముంది అంటూ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తారు. రెజ్యూమెను అప్‌గ్రేడ్‌ చేయరు. తీరా ఏదైనా మంచి అవకాశం వచ్చి దరఖాస్తు చేయబోయే సమయంలో కంగారుపడతారు. హడావిడిగా ఏదో ఒకటి రాసేసి లేదా కాపీ చేసి పని పూర్తిచేస్తారు. ఇలా చేయడం వల్ల సరైన ఫలితాలు అందకుండాపోయే అవకాశం ఉంది. అందుకే రెజ్యూమెను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోడానికి లాక్‌డౌన్‌లో దొరికిన సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఫార్మాట్‌లో కొన్ని అంశాలు తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి.

రెజ్యూమెలో విద్య, ఉద్యోగార్హతలు, అభ్యర్థి విజయాల వివరాలు ఉంటాయి. అవి వీలైనంత తాజాగా ఉండాలి. గతంలో ఎప్పుడో సాధించిన వాటి గురించి ప్రస్తావించకపోవడం మంచిది. దరఖాస్తు చేస్తున్న ఉద్యోగం లేదా కోర్సుకు అదనపు విలువను అందించే అంశాలను పొందుపరచడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

చాలామంది రెజ్యూమెలను కాపీ చేస్తుంటారు. దీని వల్ల ఒకేరకమైన సమాచారం అందరి దగ్గర ఉంటుంది. ఒక్కోసారి వీటి ఆధారంగా అభ్యర్థి సామర్థ్యాన్ని కంపెనీలు తక్కువగా అంచనా వేసే అవకాశం ఉంది. అందుకే ప్రత్యేకతను చాటుకోడానికి సొంతంగా ప్రయత్నించాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న టూల్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

సృజనాత్మకతను ప్రదర్శించాలి. లేఅవుట్‌లోనూ, పదాల వినియోగంలోనూ కొత్తగా ఉండాలి. పాత, పడికట్టు పదాలకు బదులు సులువుగా, సరళంగా, సహజంగా ఉండే వాటిని వినియోగించాలి.

రెజ్యూమె సర్టిఫికెట్‌ కాదు. ఒకసారి సిద్ధం చేసి జీవితాంతం వాడుకోడానికి. దానిలోనూ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుండాలి. తాజా అంశాలను జోడిస్తుండాలి.

కొందరు పేజీలకు పేజీలు నింపేస్తుంటారు. ఇది మంచిది కాదు. రెజ్యూమె సూటిగా, స్పష్టంగా ఉండాలి.

దరఖాస్తు చేసుకునే ఉద్యోగాన్ని అనుసరించి తగిన కీలక పదాలు (కీ వర్డ్స్‌) ఉండేవిధంగా చూసుకోవాలి.

ఆధునిక ధోరణులకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. వాటిని రెజ్యూమెలో పొందుపరచాలి. చెప్పుకోడానికి బాగున్నాయని తెలియని వాటిని చేర్చకూడదు. దాని వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిజాయితీగా వ్యవహరించాలి.●

వెబినార్‌లు

ఏదైనా విషయాన్ని చదివి తెలుసుకోవడానికీ, ప్రాక్టీకల్‌గా చేసి అవగాహన పెంచుకోడానికీ తేడా ఉంటుంది. రెండూ ముఖ్యమే. ఎదుటివాళ్ల అనుభవం నుంచి తెలుసుకోవడం ఇంకోమార్గం. దీనికి మరింత ప్రాధాన్యం ఉంది. ఆ అవకాశం వెబినార్ల వల్ల దక్కుతుంది. వీటిలో నిపుణులు తమ అనుభవాలకు కొంత చమత్కారం జోడించి చెబుతుంటారు. అందుకే అవి బాగా గుర్తుండిపోతాయి. వెబినార్‌లను ప్రధానంగా ప్రశ్న-జవాబు సెషన్లుగా నిర్వహిస్తారు. దీంతో ఇంటరాక్టివ్‌ లర్నింగ్‌ సాధ్యమవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోడానికి వీలవుతుంది. అంతేకాకుండా అభ్యర్థులు తాము పాల్గొన్న వెబినార్‌ల వివరాలనూ రెజ్యూమెలో చేర్చుకోవచ్చు.

ఆన్‌లైన్‌ ఈవెంట్లు

ప్రస్తుతం అందరూ ఇంటికే పరిమితమవుతుండటంతో చాలా సమావేశాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఐటీ సహా ఎన్నో ఈవెంట్లకు ఇప్పుడు ఆన్‌లైన్‌ వేదికగా మారింది. వీటి గురించి తెలుసుకోడానికి, భాగస్వాములు కావడానికి ఇప్పుడు అందరికీ అవకాశం వచ్చింది. సాధారణ రోజుల్లో వీటిల్లో పాల్గొనే వీలు అందరికీ దొరకదు. ఒక్కోసారి ప్రవేశ రుసుమూ ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వర్చువల్‌ ఈవెంట్ల ద్వారా తాజా సమాచారాన్ని, వివిధ రంగాల ప్రస్తుత స్థితిగతులను సంబంధిత నిపుణుల నుంచే తెలుసుకోవచ్ఛు వీటికి హాజరైనప్పుడు కొన్ని అంశాలను తప్పక గుర్తుంచుకోవాలి.●

సాధారణంగా బయట జరిగినప్పుడు వివిధ వ్యక్తులతో ఎలా మాట్లాడతారో వర్చువల్‌ ఈవెంట్‌ సమయంలోనూ అలాగే మాట కలపాలి. నెట్‌ వర్కింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడానికే కాదు. ఎన్నో విషయాలను నేర్చుకోవడానికీ ఇవి సాయపడతాయి.

కార్యక్రమానికి సంబంధించిన అంశాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవాలి. హాష్‌ట్యాగ్‌లనూ జతచేయాలి. దీనివల్ల చిన్న వాక్యాల్లో ఆకట్టుకునేలా రాయడం అలవాటవుతుంది. ఇతరులకూ వీటిపైన అవగాహన కల్పించడం సాధ్యమవుతుంది.

ఈవెంట్ల గురించి కాస్త ముందస్తుగా తెలుసుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అన్నింటిలోనూ పాల్గొనడానికి వీలు కాకపోవచ్ఛు కానీ అనువైనవీ, అనుకూలమైనవీ ఎంచుకుని ప్రాధాన్యమివ్వాలి.●


 

కొలువులు,ఇంటర్న్‌షిప్‌లు!

సంస్థలు, ప్రజల సాధారణ కార్యకలాపాలు లాక్‌డౌన్‌ వల్ల స్తంభించినప్పటికీ ఆన్‌లైన్‌ ద్వారా రకరకాల శిక్షణలు, ఇంటర్న్‌షిప్‌లు జరుగుతున్నాయి. వివిధ జాబ్‌ పోర్టళ్లు, ఇంటర్న్‌షిప్‌ వెబ్‌సైట్లలో నమోదు చేసుకోవడం ద్వారా ఆ అవకాశాలను అందుకోవచ్ఛు విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్ఛు సంస్థకు వెళ్లి ఇంటర్న్‌షిప్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే చేయవచ్ఛు సర్టిఫికెట్లనూ అందుకోవచ్ఛు ప్రత్యక్షంగా చేసిన ఇంటర్న్‌షిప్‌లతో సమానంగా వీటికీ ప్రాధాన్యం ఇస్తారు. నేరుగా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసేటప్పుడు ఏవిధంగా వ్యవహరిస్తారో ఆన్‌లైన్‌లోనూ అలాగే ఉండాలి. అందరితో ఆలోచనలు పంచుకోవాలి. సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు కలిసి పనిచేయడంపై దృష్టిపెట్టాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.