అమెరికా ఉద్యమం వెనక అతడు‌..! 
close

తాజా వార్తలు

Published : 01/06/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా ఉద్యమం వెనక అతడు‌..! 

 మరోసారి రగులుకున్న ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

17 జులై 2014: న్యూయార్క్‌ నగరంలో స్టేటన్‌ ఐలాండ్‌ బేస్ట్రీట్‌ వద్ద మధ్యాహ్నం వేళ ఎరిక్‌ గార్నర్‌ అనే నల్లజాతీయుడిని నలుగురు పోలీసులు నేలపై పడేసి చేతులు వెనక్కి విరిచి కట్టేసేందుకు  ప్రయత్నించారు. 

కారణం: ఆ ప్రాంతంలో లూసీ(సిగరెట్లను విడిగా)ని విక్రయిస్తున్నాడన్నది అతడిపై ఆరోపణ. పన్ను ఎగవేసేందుకు సిగరెట్లను అలా విక్రయించడం నేరం. పోలీసులకు సహకరించకపోవడం. 

ఎరిక్‌ వాదన: తనను పోలీసులు అనవసరంగా వేధిస్తున్నారు. 

ఆ రోజు ఎరిక్‌ను సిగరెట్లు విక్రయిస్తున్నాడనే అనుమానంతో అరెస్టు చేసేందుకు పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. ఒక ఆఫీసర్‌ జూడోలోని చాక్‌హోల్డ్‌ పొజిషన్‌లో ఎరిక్‌ గొంతు పట్టుకున్నాడు. దీంతో అతను విలవిల్లాడుతూ ‘ఐ కాంట్‌ బ్రీత్‌’(నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను) అని 11 సార్లు ఆఫీసర్‌ను వేడుకొన్నాడు. కానీ, వారు పట్టువీడకపోవడంతో దాదాపు స్పృహతప్పిపోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అక్కడ కూడా ఆక్సిజన్‌ అందించే ప్రయత్నం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. చివరికి చికిత్స పొందుతూ ఎరిక్‌ మృతి చెందాడు. ఎరిక్ స్పృహ తప్పే సమయంలో తీసిన వీడియో క్లిప్‌ బయటకురావడంతో అమెరికా అట్టుడికి పోయింది. ఎరిక్‌ చివరి మాటలైన ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ పేరుతో శ్వేతజాతీయుల అహంకార వైఖరిపై ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత అక్కడి పోలీస్‌ విభాగంలో ‘చాక్‌హోల్డ్‌’ను ఉపయోగించడంపై నిషేధం విధించారు. ఘటనకు కారణమైన అధికారులను తొలగించారు. 5.9మిలియన్‌ డాలర్లను ఎరిక్‌ భార్యకు పరిహారంగా చెల్లించారు. 

అసలు ఎవరీ ఎరిక్‌..?

ఎరిక్‌ ‘న్యూయార్క్‌ సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పార్క్స్‌ అండ్‌ రిక్రియేషన్‌’లో హార్టీకల్చరిస్టుగా పనిచేసేవాడు. అతనికి ఊబకాయం కారణంగా ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అతనికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్‌టైమ్స్‌ కథనం ప్రకారం ఎరిక్‌ను పలు కారణాలతో 30సార్లు పోలీసులు అరెస్టు చేశారు. ఒక దశలో రోడ్డుపై తన దుస్తులు తొలగించి పోలీసులు తనిఖీలు నిర్వహించారని న్యాయమూర్తికి ఎరిక్‌ వెల్లడించాడు. 

ఎవరీ ఫ్లాయిడ్‌..?

46ఏళ్ల జార్జి ఫ్లాయిడ్‌ పెద్దగా చదువుకోలేదు. పాఠశాల విద్యాభ్యాసం తర్వాత పలు ఉద్యోగాలు చేశాడు. చివరిగా మినియాపొలిస్‌లో ఒక రెస్టారెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. కరోనా వైరస్‌ వ్యాపించడంతో రెస్టారెంట్‌ మూతపడింది. ఫ్లాయిడ్‌ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే ఉద్యోగం కోల్పోయాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 

ఎరిక్‌ కేసుతో పోలిక..

మే 25న ఫోర్జరీ పత్రాలు వినియోగిస్తున్నాడనే అనుమానంతో మినియాపొలిస్‌లో అధికారులు జార్జి ఫ్లాయిడ్‌ను కారులో నుంచి బయటకు లాగి రోడ్డుపై పడుకోబెట్టి  మెడపై మోకాలితో తొక్కిపట్టారు. దీంతో రోడ్డుపైనే ఫ్లాయిడ్‌ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనలో పోలీస్‌ అధికారులు అబద్ధాలు చెబుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అతను తిరగబడటంతోనే తాము మెడపై కాలు పెట్టాల్సి వచ్చిందని వారు చెబుతుండగా.. వీడియో ఫుటేజీలో మాత్రం ఫ్లాయిడ్‌ పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు కనిపిస్తోంది.  చనిపోయే ముందు ఫ్లాయిడ్‌ నోటి నుంచి వచ్చిన చివరి పదాలు కూడా ‘ఐ కాంట్‌ బ్రీత్‌’!

రగులుతున్న అమెరికా..

ఈ ఘటన జరిగిన రోజు రాత్రే ఆందోళనలు ఊపందుకున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు మినియాపొలిస్‌ వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు.  ఆ తర్వాత మిగిలిన నగరాలకు ఇవి విస్తరించాయి. శ్వేత సౌధం ఎదుట ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీనికి తోడు అందోళనకారులను దుండగులుగా అభివర్ణిస్తూ ట్రంప్‌ చేసిన ట్వీట్‌తో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. దోపిడీలు మొదలైతే కాల్పులు మొదలవుతాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. మరోపక్క ఈ ఆందోళనలు న్యూయార్క్‌ నగరానికి కూడా పాకాయి. అసలే కరోనావైరస్‌ విజృంభించిన ఈ పట్టణంలో వేలమంది ఆందోళనలు నిర్వహించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 

ఫ్లాయిడ్‌ వీడియో బయటకు రాగానే అమెరికన్లకు ఒక్కసారిగా ఎరిక్‌ గార్నర్‌ ఘటన మదిలో మెదిలింది. దీనికి తోడు అధికారులకు సహకరించిన నిరాయుధుడిని చంపినట్లు తేలడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకొంది. మరోమారు శ్వేతజాతి అహంకారపూరిత వైఖరిపై ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ ఉద్యమం ఊపిరిపోసుకొంది. ఈ ఉద్యమానికి అమెరికాలోని చాలా మంది శ్వేతజాతీయుల మద్దతు ఉండటం విశేషం. ఈ ఘటనకు కారణమైన నలుగురు అధికారులను తొలగించారు. కానీ, ఉద్యమం ఏమాత్రం ఆగలేదు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లోని 25 పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. 

కర్ఫ్యూ ఇక్కడే.. 

బీవర్లీ హిల్స్‌, లాస్‌ ఏంజెల్స్‌, డెన్వెర్‌, మియామి, అట్లాంట, షికాగో, లూసివిల్లే, మినియాపొలిస్‌, సెయింట్‌ పౌల్‌, రెచెస్టర్‌, సిన్సినాటి, క్లీవెలాండ్‌, కొలంబస్‌, డేటన్‌, టోలెడో, యూజీన్‌, పోర్ట్‌ల్యాండ్‌, పిలడెల్ఫియా, పిట్స్‌బర్గ్‌, చార్లెస్టన్‌, కొలంబియా, నష్విల్లె, ఉటా,సాల్ట్‌ లేక్‌ సిటీ, సియాటెల్‌, మిల్వాంకి నగరాలు కర్ఫ్యూ నీడలో ఉన్నాయి. 

రంగంలోకి నేషనల్‌ గార్డ్స్‌..

ఇప్పటికే అమెరికా నేషనల్‌ గార్డ్స్‌ రంగంలోకి దిగారు. వీరికి సహాయంగా మరో 10,800 మందిని కూడా మినియాపొలిస్‌, సెయింట్‌ పౌల్‌కు తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోపక్క పెంటగాన్‌ కూడా అప్రమత్తమై భద్రతా బలగాలు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. 

 

ఇదీ చదవండి

అమెరికా నగరాల్లో మిన్నంటిన నిరసనలు!

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని