శత్రు భయమే కొంపముంచింది..!
close

తాజా వార్తలు

Updated : 11/01/2020 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శత్రు భయమే కొంపముంచింది..!

పొరపాటుగా సొంత విమానాలనే కూల్చుకున్న ఉదంతాలు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుద్ధ సమయంలో శత్రు భయంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు లెక్క తప్పిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. గురి తప్పి సొంత విమానాన్నే కూల్చుకున్న ఉదంతాలూ ఇటీవలే చోటుచేసుకున్నాయి. సరైన సాంకేతికత లేని కాలంలో జరిగితే మరికొన్ని ఆ సాంకేతికతను సమకూర్చుకోలేని దుస్థితి వల్ల తలెత్తాయి. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని కూల్చినట్లు ఇరాన్‌ అంగీకరించింది. అమెరికాతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, వరుస క్షిపణి దాడుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న ఇరాన్‌ పౌర విమానాన్ని గుర్తించడంలో విఫలమైంది. ఫలితంగా సొంత దేశానికి చెందిన 82 మంది సామాన్య పౌరుల్ని కోల్పోయింది. దీన్ని మానవ తప్పిదం వల్ల జరిగిన దుర్ఘటనగా పేర్కొన్న ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదే తరహాలో గతంలో సొంత దేశ విమానాల్ని కూల్చిన సందర్భాలు...

2003 ఇరాక్‌ యుద్ధ సమయంలో...

2003లో ఇరాక్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా పొరపాటున బ్రిటన్‌కు చెందిన రాయల్‌ బ్రిటిష్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాన్ని పేట్రియాట్‌ క్షిపణితో కూల్చింది. తొలుత దీన్ని మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. కానీ, తదనంతర దర్యాప్తులో అమెరికా ప్రయోగించిన క్షిపణి వల్లే విమానం కూలి ఉంటుందని ధ్రువీకరించుకున్నారు. ఇలా శత్రుదేశ విమానాలుగా భావించి సొంత వాటిని కూల్చే ప్రమాదాల్ని ‘ఫ్రెండ్లీ ఫైర్‌ ఘటనలు’గా పిలుస్తుంటారు.  

తమ బ్లాక్ హాక్‌ హెలికాప్టర్‌ని కూల్చిన అమెరికా...

పర్షియన్‌ గల్ఫ్‌ యుద్ధం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. దీంతో యుద్ధం వల్ల కకావికలమైన ప్రజలకు దన్నుగా అనేక దేశాలు సహాయక చర్యల్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో విమానాలు ఎగరడానికి నిషేధించిన గగనతలంలోకి అమెరికాకు చెందిన ఆర్మీ బ్లాక్ హాక్‌ హెలికాప్టర్‌ ప్రవేశించింది. దాన్ని సరిగ్గా గుర్తించలేకపోయిన యూఎస్‌ ఎఫ్‌-15.. బ్లాక్‌ హాక్‌ని నేలకూల్చింది. 1994లో జరిగిన ఈ ప్రమాదంలో అదే దేశానికి చెందిన 15 మంది పౌరులతో పాటు మరో 11 మంది మృతిచెందారు.

తమని కాపాడడానికి వస్తున్నా గుర్తించలేకపోయారు...

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీలోని గెలా సముద్ర తీర పట్టణంలో అమెరికా సైనికుల్ని మోహరించారు. వీరు శత్రుమూకలతో పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరికి మద్దతుగా వచ్చిన తమ సొంత విమానాలపైనే కాల్పులు జరిపారు. దీంతో 300 మంది సైనికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 

విమాన ప్రమాద చరిత్రలోనే ఇదో వింత ఘటన...

తాను నడుపుతున్న విమానంపై తానే కాల్పులు జరిపాడో పైలట్‌. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజంగా జరిగింది. గ్రమ్‌మ్యాన్‌ విమానానికి కొత్తగా అమర్చిన 20 ఎం.ఎం కేనన్‌ని పరీక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో తొలుత కేనన్‌ నుంచి బుల్లెట్లు వదిలాడు. ఇక విమాన వేగాన్ని బాగా పెంచుతూ కిందకి దిగాడు. దీంతో తొలుత విడుదల చేసిన బుల్లెట్లు పొరపాటున అదే విమానానికి తగిలి ప్రమాదం జరిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని