శ్వాస తీసుకోవాలని గుర్తుపెట్టుకున్నా..
close

తాజా వార్తలు

Published : 09/04/2020 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్వాస తీసుకోవాలని గుర్తుపెట్టుకున్నా..

కరోనాతో దాదాపు చచ్చి బతికిన భారత సంతతి మహిళ అనుభవం

లండన్‌: ఆమె పేరు రియా లఖాని. బ్రిటన్‌లో నివసిస్తున్న భారత సంతతి మహిళ. వృత్తిరీత్యా సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌. ఏడేళ్ల క్రితం ఆమెకు అచలేసియా అనే జబ్బు వచ్చింది. అన్న వాహిక సమస్యతో ఏది మింగాలన్నా కష్టమయ్యేది. ఎప్పుడూ వెళ్లినట్టే ఈ సారీ ఆస్పత్రికి వెళ్లింది. కానీ పరిస్థితి అంతలోనే తారుమారైంది. దాదాపు చచ్చి బతికిందనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకు కొవిడ్‌-19 సోకింది.

ఆస్పత్రిలో చేరాక రియా పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దానికి తోడు జ్వరమొచ్చింది. శస్త్రచికిత్స దుష్ప్రభావంతో ఆమెకిలా జరుగుతోందని తొలుత భావించారు. ఎందుకైనా మంచిదని నోటిలో తెమడ నమూనాలను పరీక్ష కోసం పంపించారు. కొవిడ్‌-19 అని తేలడంతో అందరికీ షాక్‌. వెంటనే ఆస్పత్రిలో ఆమె గదిని ఐసోలేషన్‌గా మార్చేశారు. పరిస్థితి దిగజారడంతో ప్రాణవాయువు సహాయం అందించారు. ఆ తర్వాత చేయి దాటుతున్నట్టుగా భావించి లండన్‌లో కొవిడ్‌-19 ప్రధాన చికిత్స కేంద్రాల్లో ఒకదానికి ఆమెను తరలించారు. ఆపై ఎలా కోలుకుందో తన సోషల్‌ మీడియాలో రియా స్వయంగా వెల్లడించారు.

‘దాదాపు చచ్చిపోయాననే అనుకున్నా. శ్వాస తీసుకోవడం సహజ పక్రియ. కానీ నేనిప్పుడు గాలి ఎలా పీల్చుకొని వదిలేయాలో గుర్తుంచుకోవాల్సి వచ్చింది. స్వీయ నిర్బంధంలో నా భర్త, తల్లిదండ్రులు, తోబుట్టువులను చూసేందుకు వీల్లేదు. రాత్రిపూట ఊపిరి తీసుకోవడం మరింత కష్టమయ్యేది. పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. గాలి పీల్చుకోవడం ఓ కొండెక్కినంత కష్టంగా ఉండేది. ఒకానొక దశలో నా పని అయిపోయిందనుకున్నా. నా కుటుంబ సభ్యులకు వైరాగ్యంతో సందేశాలు పంపించడం మొదలుపెట్టా. ఇప్పుడు బతికున్నాను కానీ దాదాపు చచ్చిపోయాను. జీవితం ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో తెలీదు.

నా అదృష్టం, వైద్యుల సేవలతో నెమ్మదిగా నా ఆరోగ్యం మెరుగైంది. ఆస్పత్రిలో మొదట కనీసం పక్కకు తిరగలేకపోయా. నా నొప్పి భరించేందుకు ఆక్సిజన్‌తో పాటు మార్ఫిన్‌ను ఇచ్చారు. నాకు చికిత్స చేసిన వైద్యులు, సిబ్బంది నిజంగా హీరోలు. వేడిగా టీ, బ్రెడ్డు ఇచ్చేవారు. పక్కకు తిరగడం, ఊపిరి పీల్చుకోవడం, నవ్వడం.. ఇలా చిన్నచిన్న విజయాలతో చివరికి పెద్ద గెలుపు దక్కింది. ఇప్పటికీ కాస్త దగ్గు, ఊపరితిత్తులు మెలిపినట్టు అనిపిస్తోంది. ఇంట్లో నా భర్త, నేను వ్యక్తిగత దూరం పాటిస్తున్నాం. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్తున్నప్పుడు నా మనసులో ఏర్పడిన భావోద్వేగాలను వర్ణించలేను. ఇకపై నేను దేన్నీ తేలిగ్గా తీసుకోను’ అని రియా అంటోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని