
తాజా వార్తలు
ట్విటర్ ట్రెండింగ్‌లో..టీకా పంపిణీ
దిల్లీ: దేశంలో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమే ఎక్కువగా వైరల్ అయింది. ట్విటర్లో కొన్ని గంటల పాటు ‘లార్జెస్ట్వ్యాక్సిన్ డ్రైవ్’ ట్రెండింగ్‌లో కనిపించింది. 4.3 లక్షల ట్వీట్లకు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. టీకాలతో కరోనాపై నిర్ణయాత్మక విజయం సాధిస్తామంటూ భరోసా ఇచ్చిన ప్రధాని ప్రసంగంపైనా స్పందనలు హోరెత్తాయి. ఎక్కువశాతం నెటిజన్లు ప్రధానిని ప్రశంసల్లో ముంచెత్తారు. పెద్దఎత్తున ప్రారంభించిన వ్యాక్సినేషన్లో పారదర్శకత లోపిస్తోందంటూ కొందరు ప్రముఖులు విమర్శలు చేశారు.
లద్దాఖ్‌లో 20 మంది ఐటీబీపీ సిబ్బందికి టీకా
దిల్లీ/లేహ్: కరోనా టీకా పంపిణీలో తొలిరోజు శనివారం లద్దాఖ్‌లో కనీసం 20 మంది ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందికి టీకాలు వేశారు. వీరిలో ఇద్దరు మహిళా వైద్యాధికారులు సైతం ఉన్నారు. ప్రస్తుతం లద్దాఖ్ ప్రాంతంలోని చైనా సరిహద్దులో ఐటీబీపీ సిబ్బంది పెద్దసంఖ్యలో మొహరించి ఉన్నారు.
రాహుల్.. స్పందించలేదేం?: భాజపా
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభమైనా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి కనీస స్పందన కొరవడిందని భాజపా నేతలు విమర్శించారు. ‘‘టీకాల పంపిణీకి ప్రభుత్వం సందేహిస్తోందని ఇన్నిరోజులు రాహుల్‌గాంధీ విమర్శిస్తూ వచ్చారు. తీరా మోదీ ప్రభుత్వం ఈ దేశంలో తయారైన టీకాలను ఆమోదించి, ప్రజలకు పంపిణీ ప్రారంభిస్తే అభినందిస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కనీసం శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తల్ని ప్రశంసించలేదు.’’ అంటూ భాజపా ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ గతంలో రాహుల్ ఘాటుగా చేసిన ట్వీట్లను ఆయన తిరిగి పోస్టు చేశారు. భారత్‌లో టీకాల తయారీ సామర్థ్యంపై కొందరిలో ఉన్న అనుమానాలు, భయాలన్నీ ప్రస్తుతం పటాపంచలవుతున్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇంకా ఏమైనా స్వీయసందేహాలుంటే వారే స్వయంగా టీకాలు వేసుకోవచ్చన్నారు.
వ్యాక్సిన్ వాదం..ప్రపంచానికి ప్రమాదంఐరాస సెక్రటరీ జనరల్ హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి: టీకావాదంతో ప్రపంచానికి పెనుముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి (ఐరాస)సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించారు. ధనిక దేశాలు టీకాను అవసరానికి మించి కొనుగోలు చేస్తుంటే, బీద దేశాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కొవిడ్-19తో ప్రపంచవ్యాప్త మరణాల సంఖ్య 20 లక్షలు దాటిన నేపథ్యంలో గుటెరస్ మాట్లాడుతూ టీకా విషయంలో ధనిక దేశాలు బాధ్యతతో వ్యవహరించాలని పిలుపిచ్చారు. ‘‘విజ్ఞానం విజయం సాధిస్తుంటే.. సమైక్య భావం విఫలమవుతోంది. కొన్ని దేశాలు టీకా కోసం దొంగచాటు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తమ అవసరాలకు మించి కొనుగోలు చేస్తున్నాయి. తమ జనాభాను కాపాడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలకు ఉంది. కానీ తమకు మాత్రమే టీకా కావాలనే టీకా జాతీయవాదంతో స్వీయ ఓటమి పాలయ్యే ప్రమాదం ఉంది. ఈ మహమ్మారి నుంచి కోలుకోవడానికి అంతర్జాతీయ సమాజం సమన్వయంతో పనిచేయాలి. లేకపోతే కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది’’ అని గుటెరస్ హెచ్చరించారు. బీద దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ టీకా సమానంగా అందాలన్న సదుద్దేశంతో ఐరాస ప్రారంభించిన కొవ్యాక్స్ కార్యక్రమానికి ధనిక దేశాలు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒంటరిగా ఏ ఒక్క దేశం కొవిడ్-19ను ఓడించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందరూ కలిసి ఈ మహమ్మారిని పారదోలాలని..అది జరగాలంటే అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఇవీ చదవండి..
‘వాటిని తెరిచే ముందు మాకు టీకా ఇవ్వండి