TS News: సారీ..మీకిదే నా చివరి ఫోన్‌

తాజా వార్తలు

Updated : 22/05/2021 07:36 IST

TS News: సారీ..మీకిదే నా చివరి ఫోన్‌

స్నేహితునితో చివరి మాట
ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు తోబుట్టువుల ఆత్మహత్య

చార్మినార్‌, న్యూస్‌టుడే: ‘సారీ.. పొరపాటు నిర్ణయం తీసుకున్నాం.. మీకిదే నా చివరి ఫోను అంటూ..’ స్నేహితుడికి ఫోన్‌లో చెప్పి తన తోబుట్టువులతో కలిసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు సోదరులు, ఓ సోదరి ఉరేసుకోవడంతో బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, హుస్సేనిఆలం పోలీసుల కథనం ప్రకారం.. పురానాపూల్‌ చంద్రికాపురానికి చెందిన కొమరాల లింగేశ్వర్‌రావు దంపతులు పద్నాలుగేళ్ల క్రితం మృతిచెందారు. వారికి ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు కె.మధుసూదన్‌రావు(38) ఎల్‌ఐసీ ఏజెంట్‌. మరో కుమారుడు సందీప్‌కుమార్‌ (35) ప్రైవేటు ఉద్యోగి. కుమార్తె ప్రేమలత(36) ఇంట్లోనే ఉంటారు. వీరికి వివాహం కాలేదు. తల్లిదండ్రులు చనిపోయిన్పటికీ బస్తీలో అందరితో కలుపుగోలుగా ఉంటూ మేనమామ, బంధువుల సహకారంతో చదువులు పూర్తి చేసుకున్నారు. ఏడాదిన్నర క్రితం అప్పు చేసి తమ పాత ఇంటిని కూల్చి రెండంతస్తుల భవనం నిర్మించారు.అప్పులు తీరిన అనంతరం వివాహాలు చేసుకోవాలనుకున్నారు. మరోపక్క వడ్డీలు పెరిగిపోయి తీర్చే మార్గం కన్పించలేదు. అప్పిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఏడు నెలలుగా ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు తమ నూతన ఇంటికొచ్చి శుక్రవారం ఉదయం ఉరేసుకొన్నారు. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు సందీప్‌కుమార్‌ బేగంబజార్‌లోని తన మిత్రుడు గోవింద్‌సింగ్‌(35)కు ఫోన్‌ చేశారు. మాటల మధ్యలో పొరపాటు నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పారు. గోవింద్‌సింగ్‌ ఆ మాటలను అంతగా విశ్వసించలేదు. మధ్యాహ్నం గోవింద్‌సింగ్‌ తిరిగి సందీప్‌కుమార్‌కు ఫోను చేశాడు. ఎన్నిసార్లు చేసినా.. సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌కుమార్‌, ఎస్సై నర్సింహారావు బృందం వెళ్లి పరిశీలించగా ఇరువురు సోదరులు, సోదరి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి కన్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని