Crime News: రమ్మీ కోసం.. డమ్మీ అవతారం
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 07:08 IST

Crime News: రమ్మీ కోసం.. డమ్మీ అవతారం

సిమ్‌ కార్డులను సృష్టిస్తున్న ముఠా అరెస్టు


వివరాలను తెలియజేస్తున్న డీసీపీ ఐశ్వర్య రస్తోగి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : ఇతరుల పేరిట సిమ్‌లు తీసుకుని, వాటిని రమ్మీ కోసం ఉపయోగిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ (శాంతిభద్రతలు) ఐశ్వర్య రస్తోగి, ఏసీపీ శిరీష, సి.ఐ. రాములు వివరించారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం వి.నర్సాపురం గ్రామానికి చెందిన కె.తాతారావు అలియాస్‌ నాని సెల్‌ పాయింట్‌ నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా మిత్ర యాప్‌ ద్వారా ఎయిర్‌టెల్‌ రిటైలర్‌ ఖాతా నిర్వహిస్తున్నాడు. అదే మండలం కొత్తపట్నంకు చెందిన కె.జగన్నాథం, వై.బండయ్యలతో కలిసి నిరక్షరాస్యులు, అల్పాదాయవర్గాలను ఎంపిక చేసుకొని వారికి రూ. 200, రూ.300 ఇచ్చి వారి ఆధార్‌కార్డులు తీసుకొని వారి పేరిట కొత్త సిమ్‌లను తీసుకొని వాటితో నిషేధిత రమ్మీ ఆడటమే కాకుండా.. ఆడేవారికి సిమ్‌లను అమ్ముతున్నాడు. ఆ సిమ్‌లతో ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ ఖాతాలు తెరిచి రమ్మీలో గెలిచిన నగదు ఆ ఖాతాల ద్వారా వచ్చేలా వీరు ఏర్పాటు చేసుకుంటున్నారు.

* రమ్మీ ఆడిన తర్వాత వచ్చిన నగదును తీసుకోవాలంటే తప్పనిసరిగా పాన్‌ కార్డు అవసరం, దీంతో వీరు ఎంపిక చేసిన వారికి పాన్‌కార్డులు లేకపోతే వారి వివరాలతో ఈ బృందమే పాన్‌ కార్డు కోసం ఆదాయ పన్నుల శాఖకు దరఖాస్తు చేయించేవారు. ● రమ్మీ మన రాష్ట్రంలో ఆడటానికి అనుమతులు లేకపోవడంతో వేరే రాష్ట్రం నుంచి ఆడుతున్నట్లు జీపీఎస్‌ యాప్‌లను వాడుకునేవారు. రమ్మీ నిర్వాహకులు ఒకట్రెండు ఆటలకు లొకేషన్‌ గుర్తుపట్టి సిమ్‌లను బ్లాక్‌ చేయటంతో వీరికి ఎక్కువ సిమ్‌లు అవసరమై ఇతరుల పేర్లతో తీసుకుంటున్నారు. వీరు ఆడటమే కాకుండా రమ్మీ ఆడే వారికి సిమ్‌లను రూ.3వేలకు విక్రయిస్తున్నారు.

* సాధారణంగా ఒక గేమ్‌లో నలుగురు ఆటగాళ్లు ఉంటారు. వారు భిన్న ప్రాంతాలకు చెందినవారై ఉండాలి. అయితే వీళ్లు జీపీఎస్‌ ఆధారంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఆడుతున్నామని చూపిస్తూ.. ఒకే ప్రాంతం నుంచి ఆడుతూ అవతల వ్యక్తిని మోసం చేసేవారు. ఇలా ఇతరులను మోసం చేస్తూ ఒక్కో వ్యక్తి రూ.40 నుంచి 45వేల వరకు ఆదాయం సంపాదించారు. ●

* ఇటీవల న్యూపోర్టు పరిధిలో కొంతమందికి నగదు ఇచ్చి వారి నుంచి ధ్రువపత్రాలు పొందటంతో అనుమానం వచ్చిన నగరవాసులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు తాతారావు అలియాస్‌ నానీ, కె.జగన్నాథం, పెదగంట్యాడకు చెందిన ఆటోడ్రైవర్‌ వి.జానకిరామ్‌రెడ్డి, బండయ్యలను అరెస్టు చేశారు. సుమారు 30 వరకు వివిధ కంపెనీలకు చెందిన సిమ్‌లు, దరఖాస్తులు, ఫోన్‌లు, బయోమెట్రిక్‌ యంత్రంను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని