close

తాజా వార్తలు

Published : 01/10/2020 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇదేం సంస్కారం!

హాథ్రస్‌ అత్యాచార బాధితురాలి భౌతిక కాయానికి అర్ధరాత్రి అంత్యక్రియలు
యూపీ పోలీసుల తీరుపై విపక్షాల ఆగ్రహం
నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ ఆదేశం
సిట్‌ను నియమించిన ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం

ఆమె జీవితానికి కొందరు కామాంధులు బలవంతపు మరణ శాసనం లిఖిస్తే... ఆ నిర్భాగ్యురాలి భౌతిక కాయానికి పోలీసులు  అవమానకరమైన రీతిలో అంత్యక్రియలు జరిపించారు.
హాథ్రస్‌/లఖ్‌నవూ: సామూహిక అత్యాచారానికి గురై ఆసుపత్రిలో పక్షం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌కు చెందిన దళిత యువతి(19) భౌతిక కాయానికి ఆ రాష్ట్ర పోలీసులు హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమైంది. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌ నుంచి మంగళవారం రాత్రి బాధితురాలి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం బుల్‌గర్హీకి తరలించారు. ఆ వెంటనే రాత్రి 2.30-3.00 గంటల సమయంలో అంత్యక్రియలు జరిపించారు. అర్ధరాత్రివేళ అంతిమ సంస్కారాలకు తిరస్కరించడంతో కుటుంబ సభ్యుల్ని ఇంట్లో బంధించారని తండ్రి ఆరోపిస్తుండగా...ఆమె తల్లిదండ్రుల ఇష్టప్రకారమే అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.ఉత్తర్‌ప్రదేశ్‌  సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అత్యాచార బాధితురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూపీ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులిచ్చింది.

పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా బుల్‌గర్హి గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబరు 14న నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన ఆమెను దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌కు తరలించి చికిత్సనందిస్తుండగా మంగళవారం తుదిశ్వాస విడిచారు. సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి నుంచి యువతి మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు మంగళవారం రాత్రి భారీ బందోబస్తు మధ్య బుల్‌గర్హికి తరలించారు. యువతి కుటుంబ సభ్యులతో కలిసి హాథ్రస్‌ వస్తున్న భీమ్‌ ఆర్మీ పార్టీ అధినేత చంద్రశేఖర్‌ ఆజాద్‌ను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకొని షహరాన్‌పుర్‌లో గృహ నిర్బంధంలో ఉంచారు. దిల్లీ నుంచి 180 కిలోమీటర్ల దూరం ఉన్న బుల్‌గర్హికి యువతి తండ్రి కన్నా పోలీసులే ముందు చేరుకున్నారని ఆమె బంధువు ఒకరు తెలిపారు. అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపి, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండానే అటునుంచి అటే శ్మశానవాటికకు తీసుకెళ్లాలని స్థానిక చంద్‌పా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు ఒత్తిడి తెచ్చారని యువతి బంధువు ఆరోపించారు. రాత్రి సమయంలో జరిపే ఆచారం లేదని చెప్పినా వినలేదన్నారు. శ్మశాన వాటికలో రాత్రి 2.30-3.00 గంటల సమయంలో 30-40 మంది సమక్షంలో అంత్యక్రియలు జరిగాయని తెలిపారు. సీనియర్‌ పోలీసు అధికారులు, జిల్లా పాలనాధికారులు వచ్చినట్లు పేర్కొన్నారు. సాయుధులైన పోలీసులు మండుతున్న చితి సమీపంలో నిలిచి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వీడియోలో కనిపించాయి.

చితి వద్దకూ రానివ్వలేదు
యువతి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లే క్రమంలో ఆమె కుటుంబ సభ్యులను ఎవరినీ సమీపానికి కూడా పోలీసులు రానివ్వలేదని సమాచారం. తండ్రిని, సోదరులను ఇంట్లోనే బంధించారు. ‘‘మా కుటుంబ సభ్యులందరినీ ఇంట్లోకి నెట్టి పోలీసులు తాళం వేశారు. కుమార్తె అంత్యక్రియలను మా చేతులతో నిర్వహించలేకపోయాం’’ అని యువతి తండ్రి ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. అంత్యక్రియలకు తీసుకెళ్లే ముందు కుమార్తె మృతదేహానికి పసుపు కూడా రాయనివ్వలేదని ఆమె తల్లి విలపించారు. బలవంతంగా అంత్యక్రియలు జరిపించారని వస్తున్న విమర్శలను హాథ్రస్‌ ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ తోసిపుచ్చారు. అత్యాచార కేసులో నిందితులైన నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించినట్లు హాథ్రస్‌ జిల్లా జాయింట్‌ మెజిస్ట్రేట్‌ ప్రేమ్‌ ప్రకాశ్‌ మీనా తెలిపారు.

ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌
అత్యాచార ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు ఫోన్‌ చేశారు. నిందితులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించినట్లు సీఎం కార్యాలయం పేర్కొంది. అత్యాచార ఘటనపై ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.


ఇది ప్రభుత్వ హత్యే: సోనియాగాంధీ

హాథ్రస్‌ యువతి విషాదాంతం సమాజానికి చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. బాధితురాలికి సరైన సమయంలో చికిత్స అందించలేదన్నారు. హాథ్రస్‌ నిర్భయ మరణించలేదు. ప్రభుత్వమే హత్య చేసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆమె అంత్యక్రియలను అవమానకరంగా నిర్వహించడం దారుణమని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ విమర్శించారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. హాథ్రస్‌ దారుణ ఘటన దేశాన్ని నిర్ఘాంతపరిచిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. లఖ్‌నవూ, హాథ్రస్‌లలో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు, దిల్లీలోని ఇండియా గేట్‌,  యూపీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌, వామపక్ష, భీమ్‌ ఆర్మీ పార్టీల నాయకులు ధర్నాకు దిగగా పోలీసులు అరెస్టు చేశారు.


బలరామ్‌పుర్‌లో మరో దురాగతం

హాథ్రస్‌ యువతి విషాదాంతం దేశాన్ని కుదిపేస్తున్న సమయంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరామ్‌పుర్‌లో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కళాశాలలో ప్రవేశం కోసమని వెళ్లిన 22 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపరిచిన ఆమెను ఆ తర్వాత రిక్షాలో ఎక్కించి ఇంటికి పంపించారు. రక్తపు మరకలతో ఇంటికొచ్చిన కుమార్తెను తల్లి ఆసుపత్రిలో చేర్పించగా అక్కడే తుదిశ్వాస విడిచారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.