Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 17/05/2021 08:58 IST

Top Ten News @ 9 AM

1. DRDO: 2డీజీ ఔషధం విడుదల నేడే

కంటికి కనిపించని కొవిడ్‌ వైరస్‌ కట్టడికి ఏడాది కాలంగా శ్రమిస్తున్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) శుభవార్త తెలిపింది. కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే 2డీజీ ఔషధాన్ని సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఔషధాన్ని గతంలో క్యాన్సర్‌ కోసం తయారు చేశారు. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇదే సూత్రాన్ని కొవిడ్‌ వైరస్‌కూ అన్వయించుకొని పరిశోధన ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

2. తెలంగాణ భేష్‌

ఏడాది కాలంగా కొవిడ్‌ నియంత్రణలో, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్టు రెండు స్వతంత్ర సంస్థలు పేర్కొన్నాయి. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్‌, హరియాణ తొలి మూడు స్థానాల్లో నిలవగా.. మౌలిక వసతుల్లో తెలంగాణ, పంజాబ్‌, తమిళనాడు మొదటి మూడింటిలో నిలిచాయని వివరించాయి. హైదరాబాద్‌కు చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌కు చెందిన స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌, హైదరాబాద్‌కే చెందిన మరో సంస్థ ఇండిపెండెంట్‌ పబ్లిక్‌ పాలసీ రిసెర్చర్‌ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించినట్టు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీ వాయిదా

3. Raghurama పిటిష‌న్‌పై సుప్రీంలో విచార‌ణ‌

వైకాపా ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిష‌న్ ఈ ఉద‌యం విచార‌ణకు రానుంది. ఈ పిటిష‌న్‌ను అత్యున్న‌త న్యాయ‌స్థానం అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు స్వీక‌రించింది. జ‌స్టిస్ వినీత్ శ‌ర‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల వెకేష‌న్ బెంచ్ దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఉద‌యం 10.30 గంట‌ల‌కు బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఏపీ సీఐడీ అధికారులు ఎంపీ ర‌ఘురామ‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* ఎంపీ నేరాలపై ఆధారాలున్నాయి..

4. కొవిడ్‌ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు

కొవిడ్‌తో మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున మంజూరు చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ను ఎదుర్కోవటం కోసం కేటాయించిన నిధి నుంచి చెల్లించాలని పేర్కొంది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు విడుదల చేస్తారని వివరించింది. అంత్యక్రియలకు సాయం చేయాలని గతేడాది ఆగస్టు 3న జారీ చేసిన ఉత్తర్వులకు కొనసాగింపుగా తాజా ఉత్తర్వులు విడుదల చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.

5. తొలి డోసు తర్వాత కరోనా  సోకే అవకాశం తక్కువ

వ్యాక్సిన్‌ తొలి డోసు వేసుకున్నవారిలో ఐదు వారాల తర్వాత కరోనా సోకే ప్రమాదం 80 శాతం మేర తగ్గిందని ఇటలీ పరిశోధన సంస్థ చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ఇటలీలో గతేడాది డిసెంబర్‌ 27 నుంచి ఈ నెల 3 వరకు ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకా తొలి డోసు తీసుకున్న వారిని పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. దాదాపు కోటీ 40 లక్షల మందిని పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. ‘‘తొలి డోస్‌ వేసుకున్న 35 రోజులకు కరోనా సోకే శాతం 80కి, ఆసుపత్రులు పాలయ్యే శాతం 90కి, మరణాల శాతం 95కి తగ్గింది’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.

* కొవాగ్జిన్‌మరో ఘనత 

6. చౌకదుకాణాలను నెల పొడవునా తెరవాలి

ఈనాడు, దిల్లీ: పేదలకు రేషన్‌ అందించే చౌకధరల దుకాణాలు నెల పొడవునా తెరిచి ఉంచాలని కేంద్ర వినియోగ వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలకు నిర్దేశించింది. దుకాణాల ముందు ఒకేసారి ఎక్కువ మంది ఉండకుండా దశల వారీగా రోజంతా సరుకులు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. కొవిడ్‌ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి రేషన్‌ దుకాణాలకు మినహాయింపునివ్వాలని పేర్కొంది. దీనివల్ల ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన కింద మే, జూన్‌ నెలల్లో పేదలకు అందిస్తున్న ఉచిత తిండి గింజలను సులభంగా తీసుకోవడానికి వీలవుతుందని తెలిపింది.

7. Tauktae: పశ్చిమాన పెనుముప్పు

దేశ పశ్చిమ తీరం ప్రకృతి వైపరీత్యం సుడిలో చిక్కుకొంది. కేరళ, కర్ణాటక, గోవా తీర ప్రాంతాలను తుడిచిపెట్టి, ఆరుగురు ప్రాణాలను హరించిన ‘తౌక్టే’ తుపాను ఆదివారం మరింతగా బలపడింది. ‘అతి తీవ్ర తుపాను’గా మారి గుజరాత్‌ తీరంవైపు పయనిస్తున్నట్టు వాతావరణ విభాగం ప్రకటించింది. ‘‘ఇది ఉత్తర, వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్‌ తీరాన్ని తాకనుంది. మంగళవారం తెల్లవారుజామున పోరుబందర్‌- మహువా (భావ్‌నగర్‌ జిల్లా)ల మధ్య తీరాన్ని దాటనుంది’’ అని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. Corona: కాబోయే అమ్మను కాపాడుకుందాం

కుటుంబాలకు కుటుంబాలనే ఛిన్నాభిన్నం చేస్తున్న కరోనా మహమ్మారి కాబోయే అమ్మలపైనా కనికరం చూపడం లేదు. కొవిడ్‌ అనుమానంతో ప్రసూతి ఆసుపత్రులు సత్వర వైద్యం అందించక పోవడంతో గర్భిణుల ప్రాణాలకు ముప్పువస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయాసం, అలసట సమస్యలు గర్భిణుల్లో సాధారణమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా సోకినా ముందుజాగ్రత్తలు పాటించాలని, సత్వర చికిత్స అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. PV Sindhu: ముందే చెబితే అర్థం చేసుకుంటాం

కరోనా  విజృంభిస్తున్నా.. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించాలన్న ఏకైక లక్ష్యంతో సాధన చేస్తున్నట్లు ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు తెలిపింది. మలేసియా ఓపెన్‌ వాయిదా పడటం ఒలింపిక్‌ సన్నాహాలకు ఎదురుదెబ్బ అన్న ఆమె.. మెగా ఈవెంట్‌ కోసం సన్నాహాలు,  క్రీడల నిర్వహణపై నెలకొన్న అయోమయంపై ‘ఈనాడు’తో మాట్లాడింది. పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్‌ చేయండి 

10. నేర్చుకుంటే.. అవకాశాల జోరు!

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ప్రోగ్రామింగ్‌  లాంగ్వేజ్‌లూ, లైబ్రరీలూ వస్తూనే ఉంటాయి. అలాగే  ఈ మధ్య కాలంలో వెబ్‌ డెవలప్‌మెంట్‌లో ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌కు  సంబంధించి రియాక్ట్‌ జేఎస్‌ అనే లైబ్రరీ డిమాండ్‌  వేగంగా  పెరుగుతోంది. అలాగే ఈ రియాక్ట్‌ జేఎస్‌ డెవలపర్లకు  గిరాకీతో పాటు  అవకాశాలూ పెరుగుతున్నాయి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని