close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. మూడు రాజధానులు..ప్రజల ఆకాంక్ష: ఆళ్ల

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్లనాని దీనిపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని సీఎం జగన్‌ చెప్పారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి కారణం ఆయనేనని ఆళ్ల విమర్శించారు. తన స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటు ఏపీ ప్రజల ఆకాంక్ష అని, దానిని నెరవేర్చకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆళ్లనాని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మండలి రద్దుపై తెదేపా భేటీ

తెదేపా శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. శాసనమండలి రద్దు అంశంపై కేబినెట్‌ నిర్ణయం, శాసనసభలో జరిగే పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. మరోవైపు గవర్నర్‌, శాసనసభ స్పీకర్‌కు తెదేపా శాసనసభాపక్షం లేఖ రాసింది. సభ నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. తెలంగాణలో ఉత్కంఠగా ఛైర్మన్ల ఎన్నిక

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఛైర్మన్ల ఎన్నిక కొనసాగుతోంది. పలుచోట్ల ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓట్లు కీలకం కావడంతో ఛైర్మన్ల ఎన్నిక ఉత్కంఠగా సాగుతోంది. పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి కాంగ్రెస్‌ నుంచి చేజారింది. కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన కౌన్సిలర్లు తెరాసలో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మండలి రద్దు అవసరం ఏముంది:యనమల

శాసనమండలి రద్దు చేయడం ప్రజావేదిక కూల్చినంత తేలిక కాదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 2021కల్లా శాసనమండలిలో వైకాపాకు మెజార్టీ వస్తుందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాంటప్పడు రద్దు అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒకవేళ రద్దుకు ప్రతిపాదించినా.. దానిని అమలు చేసేందుకు రెండు మూడేళ్లు పడుతుందని, అప్పటి వరకు శాసనమండలి కొనసాగుతూనే ఉంటుందని యనమల చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రెండు కీలక కేసుల్లో తీర్పు వాయిదా

సమత హత్యాచారం కేసులో తుది తీర్పు వాయిదా పడింది. ఈ నెల 30న తుది తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు సిబ్బంది వెల్లడించారు. అనారోగ్యం కారణంగా న్యాయమూర్తి సెలవుపై వెళ్లారని అందుకే తీర్పు వాయిదా పడినట్లు తెలిపారు. హజీపూర్‌ హత్యల కేసుల్లోనూ తుదితీర్పు ఫిబ్రవరి 6కి వాయిదాపడింది. ఈ మేరకు న్యాయమూర్తి ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పోలీసులకు భయపడం: రాజధాని రైతులు

రాజధాని రైతుల ఆందోళనలు 41వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరులో రైతుల ధర్నాలు నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని కిష్ణాయపాలెంలో రైతులు, మహిళలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. పోలీసులు చర్యలకు బయడేది లేదని, ప్రాణ సమానమైన భూములను త్యాగం చేసిన మాకు ఇదో లెక్క కాదంటూ మహిళలు నినాదాలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆరేళ్లలో ఆదాయపు పన్ను ఇలా..

అధికారం చేపట్టిన ఆరేళ్లలో నరేంద్ర మోదీ సర్కారు బడ్జెట్‌లో చాలా కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఎంతోమందిపై నేరుగా ప్రభావం చూపే ఆదాయపు పన్ను విభాగంలో సవరణలు చేసింది. మరోపక్క బడ్జెట్‌ తేదీని కూడా ఫిబ్రవరి 1కి మార్చింది. బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న ‘బడ్జెట్‌ సూట్‌కేసు’ను మార్చి ఎర్రటి గుడ్డ సంచితో బడ్జెట్‌ పత్రాలను తీసుకొచ్చే సంప్రదాయం మొదలుపెట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

8. ‘సీఏఏ మా అంతర్గతం’

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఐరోపా సమాఖ్య(ఈయూ)లో చర్చ చేపట్టనుండడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యుల చేత ఆమోదం పొందిన ఓ చట్టాన్ని ప్రశ్నించడం సరైన చర్య కాదని స్పష్టం చేసింది. ఈ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. రెండు సభల్లో సవివర చర్చ అనంతరం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులు చట్టానికి ఆమోదం తెలిపారని గుర్తుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అటు రక్షకుడు.. ఇటు కర్షకుడు..!

ఏదైనా స్పెషల్‌ డేస్‌ వచ్చాయంటే అవి సినీ ప్రియులకు పండగ రోజులనే చెప్పాలి. ఎందుకంటే పర్వదినాలను పురస్కరించుకుని కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లను ఆయా చిత్రబృందాలు విడుదల చేసి అభిమానులను ఆకట్టుకుంటుంటాయి.  రిపబ్లిక్‌ డే సందర్భంగా ఆదివారం కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్లతోపాటు సమంత నటించిన ‘జాను’ సినిమా నుంచి రెండో పాటను కూడా విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కరోనా కాటుకు 80 మంది బలి

చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. ప్రపంచదేశాలకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య తాజాగా 80కి చేరింది. మరో 2,744 మందిలో వైరస్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.