దావూద్‌ చిరునామా ఒకటి మాయం..!
close

తాజా వార్తలు

Updated : 23/08/2020 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దావూద్‌ చిరునామా ఒకటి మాయం..!

 ప్రకటనలతో ప్రయోజనం ఉంటుందా..?

మాటమార్చిన పాక్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌

 ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 88 మంది వ్యక్తులు, సంస్థలతో కూడిన జాబితాను తయారు చేసి వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఓ పాక్‌ పత్రిక పేర్కొంది. దీనిలో భారత్‌  మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉన్న నేరగాడు దావూద్‌ ఇబ్రహీం పేరు కూడా ఉంది. ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ తదుపరి సమావేశం దగ్గర పడుతుండటంతో ఉగ్రవాదులపై చర్యలు తీసుకోన్నట్లు చూపించడానికి పాక్‌ తొందరపడుతోంది. ఈ ఏడాది జూన్‌ 24న  ఆర్థిక చర్యల కార్యదళం తొలి సమావేశం జరిగింది. పాక్‌ను గ్రేలిస్ట్‌లో కొనసాగించాలని దీనిలో నిర్ణయించారు. దీంతో పాక్‌ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి కొనసాగుతోంది. అదే సమయంలో విదేశాంగ మంత్రి ఖురేషీ సౌదీ అరేబియాపై నోరు పారేసుకోవడంతో అప్పులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రేలిస్టు నుంచి బయటకు రావడం పాక్‌కు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో దావూద్‌ను కూడా ఆ జాబితాలో చేర్చి కరాచీలో చిరునామాలను ప్రకటించింది. 

ఒక చిరునామాను మాయం చేసి.. 

పాకిస్థాన్‌ ..దావూద్‌కు సంబంధించిన చిరునామాల్లో ఒక దానిని మాత్రం ప్రకటించలేదనే అనుమానాలు ఉన్నాయి.  పాకిస్థాన్‌ చూపిన చిరునామాల్లో ‘వైట్‌ హౌస్‌, కరాచీ’, ‘హౌస్‌ నెంబర్‌ 37, 30వ స్ట్రీట్‌-డిఫెన్స్‌, హౌసింగ్‌ అథారిటీ కరాచీ’, ‘పలాటియాల్‌ బంగ్లా, నూరాబాద్‌, కరాచీ’ ఉన్నాయి. కానీ, 2010లో అల్‌ఖైదా శాంక్షన్స్‌ కమిటీ (1267 కమిటీ) చూపిన చిరునామాల్లో పై మూడింటితోపాటు మార్గల్లా రోడ్డులోని హౌస్‌ నెంబర్‌ 29, ఎఫ్‌ 6/2 స్ట్రీట్‌ నెంబర్‌.22, కరాచీ’ కూడా ఉంది. పాక్‌ తాజాగా వెల్లడించిన జాబితాలో అది లేదు. 

అబ్బే ఇక్కడలేడు..

కరాచీలోని ఈ హైప్రొఫైల్‌ చిరునామాలను బట్టే దావూద్‌ అక్కడ సైనిక సంరక్షణలో ఉన్నట్లు వెల్లడవుతోంది. చివరికి కరాచీలో చెత్తను తరలించే పనిలో కూడా సైన్యం జోక్యం ఉంటుంది. భారత్‌ నుంచి వలసవెళ్లిన మొహజిర్లు అత్యధిక మంది కరాచీలోనే ఉంటారు. కరాచీలో నివసించే మొహాజిర్లను అణచి వేసేందుకు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచుతుంది. ఈ నేపథ్యంలో దావూద్‌ అక్కడ ఏళ్ల తరబడి నివసించినా కనుక్కోలేదనుకోవడం అపోహే. ఇప్పుడు పాక్‌ కొత్తపాటను అందుకొంది. దావూద్‌ ఆస్తులు ఉన్నాయన్నాము. కానీ.. అతను ఇక్కడ ఉన్నాడని తాము అనలేదని చెబుతోంది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ శాఖ ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘శాంక్షనరీ రెగ్యూలేటరీ ఆర్డర్‌లోని వారంతా ఇక్కడ ఉన్నారని అర్థం కాదు’ అని పేర్కొంది. 

మసూద్‌ అజర్‌ అనుభవం ఏం చెబుతోంది..

భారత్‌ కొన్నేళ్ల కృషి తర్వాత 2019లో మేలో మసూద్‌ అజర్‌ పేరును ఐరాస 1267 కమిటీ జాబితాలోకి తీసుకొచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్లో మసూద్‌ తినడానికి కూడా డబ్బుల్లేవని .. బ్యాంక్‌ ఖాతాల్లో సొమ్ము వాడుకోవడానికి అనుమతులు ఇవ్వాలని పాక్‌.. ఐరాస భద్రతా మండలిని కోరింది. దీనికి ఆ సంస్థ అంగీకరించింది. ఇక అతని పేరు ఉగ్రజాబితాలో చేర్చి ప్రయోజనం ఏమిటో తెలియదు. లష్కరే తోయిబా పై ఆంక్షలు విధించగానే జమాత్‌ ఉద్‌ దవా పేరుతో కార్యకలాపాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక దావూద్‌ విషయానికి వస్తే తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. కరోసా సోకి మరణించినట్లు కూడా జూన్‌లో వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో ఒక్క దావూద్‌ ఇబ్రహీం పైన మాత్రమే ఆంక్షలు విధిస్తే సరిపోదూ.. అతని బృందం మొత్తాన్ని కట్టడి చేసి.. అతని సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలి.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని