
తాజా వార్తలు
ప్రజల పక్షాన మాట్లాడితే దాడులా: చంద్రబాబు
అమరావతి: ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే దాడులు జరుగుతున్నాయని.. ఇలాంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన మాట్లాడిన సీనియర్ నేత దేవినేని ఉమాను అరెస్టు చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమాతో పాటు ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దేవినేని ఉమాపై భౌతిక దాడికి దిగుతానన్న కొడాలి నానిపై చర్యలు ఉండవా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మంత్రి బరితెగించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా ఎస్పీని ఓ ఎమ్మెల్యే బహిరంగంగా బెదిరించారన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని క్రూర స్వభావం కలిగిన జగన్ హయాంలో రాష్ట్రం గుండాలకు అడ్డాగా మారిపోయిందని ధ్వజమెత్తారు.
నిన్న మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమా .. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపడతానని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. ఆమేరకు ఈరోజు ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు తెదేపా శ్రేణులతో కలిసి ఉమా చేరుకున్నారు. ఉమా దీక్షకు సిద్ధమవుతుండగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపా శ్రేణులతో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్టీఆర్ విగ్రహం వద్ద దేవినేని ఉమా బైఠాయించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు ఉమాను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి..
మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
సీఎం జగన్పై మాట్లాడితే దెబ్బలే