close

తాజా వార్తలు

Published : 18/01/2021 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. దేశంలో రికవరీలు 50 రెట్లు

దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల కంటే రికవరీలు 50 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. కరోనాను ఎదుర్కోవడంలో ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు. సోమవారం క్రియాశీల కేసులు 2లక్షల ఎనిమిదివేలు ఉండగా, రికవరీలు కోటీ రెండు లక్షల 11వేలు ఉన్నట్లు వారు వెల్లడించారు. దీంతో భారత్‌లో కొవిడ్‌-19 రికవరీ రేటు 96.59శాతానికి చేరింది. గడచిన 24 గంటల్లో 13,788 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 14,457 రికవరీలున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల్లో స్థిరమైన క్షీణత నమోదవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. సుమారు ఎనిమిది నెలల తర్వాత 150కన్నా తక్కువ (145) మరణాలు నమోదైనట్లు వారు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో కొత్తగా 81 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 27,861 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ విశాఖపట్నం జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,141కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 263 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,713 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,04,214 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రోటోకాల్‌ పాటించడం లేదు: ఎమ్మెల్యే రోజా

3. ‘దీదీ’ని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తా: సువేందు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.‌ నందిగ్రామ్‌ స్థానం నుంచి తాను పోటీ చేయనున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది సేపటికే.. భాజపా నేత సువేందు అధికారి తనదైన శైలిలో స్పందించారు. నందిగ్రామ్‌లో ఆమెను 50వేల ఓట్ల తేడాతో  ఓడిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ స్థానంలో బెనర్జీని ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అధికారి ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం కోల్‌కతాలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వ్యాక్సిన్‌ తీసుకున్న వైద్యులు ఏం చెబుతున్నారు?

కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం మూడో రోజూ కొనసాగుతోంది. ఈ నెల 16న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టగా.. కరోనా యోధులకు తొలి ప్రాధాన్యంగా టీకా అందిస్తున్న విషయం తెలిసిందే. దేశీయంగా అభివృద్ధి అయిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలను వైద్య, పారిశుద్ధ్య, పోలీస్‌ శాఖలకు చెందిన సిబ్బందికి తొలుత అందిస్తున్నారు. ఇందులో భాగంగా టీకా తీసుకున్న అనంతరం దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, బెంగళూరు, ముంబయికి చెందిన పలువురు వైద్యులు తమ అనుభవాలను పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.గణతంత్ర వేడుకల్లో సందడి చేయనున్న రఫేల్‌

భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్‌ యుద్ధ విమానం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి సందడి చేయనుంది. జనవరి 26న దిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఒక రఫేల్‌ యుద్ధ విమానం పాల్గొని ‘వర్టికల్‌ ఛార్లీ’ విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) సోమవారం వెల్లడించింది. వర్టికల్‌ ఛార్లీ ఫార్మేషన్‌లో యుద్ధవిమానం తక్కువ ఎత్తు నుంచి నిలువుగా ప్రయాణించి పైకి వెళ్తుంది. ఈ సారి గణతంత్ర వేడుకల్లో వాయుసేకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన నాలుగు విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నట్లు వింగ్‌ కమాండర్‌ ఇంద్రనీల్‌ నంది తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బైడెన్‌ రాకముందే ట్రంప్‌నకు వీడ్కోలు

6. కన్నతండ్రే పశువయ్యాడు! 

కన్నతండ్రే కూతురి పట్ల కిరాతకుడిగా మారాడు! రక్తం పంచుకొని పుట్టిన కూతురని కూడా చూడకుండా పశువాంఛతో విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 17 ఏళ్ల బాలికపై కన్నతండ్రే ఏడేళ్లుగా అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన హరియాణాలోని హిస్సార్‌లో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్న తన తండ్రి గత ఏడేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని తెలిపింది. పలుమార్లు గర్భం రావడంతో అబార్షన్‌ చేయించాడని వాపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌కు టెస్లా.. వయా నెదర్లాండ్స్‌ ..!

ఎలన్ మస్క్‌లోని వ్యాపారి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాడు. ప్రతి రూపాయి లెక్క అన్నట్లు వ్యవహరిస్తాడు. అందుకే భారత్‌లో తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ఎటునుంచి వస్తే లాభమో లెక్కలేసుకొని.. నెదర్లాండ్స్‌ను ఎంచుకొన్నాడు. ఇటీవల భారత్‌లో మస్క్‌ రిజిస్టర్‌ చేసిన టెస్లామోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ఇండియాకు నెదర్లాండ్స్‌లోని టెస్లా మోటార్స్‌ నెదర్లాండ్స్‌ మాతృసంస్థగా వ్యవహరించనుంది. ఈ నిర్ణయంతో మస్క్‌కు భారత్‌లో మూలధనంపై వచ్చే లాభాలు, డివిడెండ్‌ చెల్లింపుల్లో భారీగా పన్ను రాయితీలు లభించనున్నాయి. టెస్లానిర్ణయం విభిన్నమైందనే చెప్పాలి. గతంలో భారత్‌కు వచ్చిన విదేశీ కంపెనీలు తమ యాజమాన్యాలు ఉన్న చోటు నుంచే భారత్‌లోకి ప్రవేశించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రభాస్‌ స్పెషల్‌ గిఫ్ట్స్‌ చూశారా..!

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తరచూ తన మంచి మనసును చాటుకుంటారు. తన కోసం ఎన్నో విధాలుగా శ్రమిస్తున్న తన టీమ్‌కు పలు సందర్భాల్లో ప్రత్యేకంగా బహుమతులు అందించి వారి ప్రేమాభిమానులను పొందుతుంటారు ఈ హీరో. ఈ క్రమంలోనే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ప్రభాస్‌ ‘రాధేశ్యా్‌మ్‌’ టీమ్‌కు స్పెషల్‌ గిఫ్ట్స్‌ అందించారు. కె.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ టైటాన్‌ చేతి గడియారాలను బహుమతిగా అందించారు. ఊహించనివిధంగా తమ హీరో నుంచి విలువైన బహుమతి లభించడంతో చిత్రబృందంలోని సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా తమ బహుమతుల గురించి పలువురితో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* ‘ఆది పురుష్‌’అప్‌డేట్‌ రానుందా?

9. సిరాజ్‌.. ఇక కుర్రాడు కాదు

టీమ్‌ఇండియా యువపేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అతడికి అభినందనలు తెలియజేస్తున్నారు. మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అయితే ‘అతడిక ఎంత మాత్రం కుర్రాడు కాదు..’ అని ట్వీట్‌ చేసేశాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి నడుచుకుంటూ వస్తున్న సిరాజ్‌ను బుమ్రా హత్తుకొని అభినందించడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ టెస్టులో అత్యుత్తమ సంఘటనగా దీనిని వర్ణిస్తున్నారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో సిరాజ్‌ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్టే తీసినా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆఖరి రోజు ఓపిక పడితే..!

10. పాక్‌లో మోదీకి జేజేలు.. ఎందుకంటే..

పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో నేడు జరిగిన ఓ ర్యాలీలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుకూల నినాదాలతో కూడిన ప్లకార్డులు దర్శనమిచ్చాయి. దివంగత సింధీ  నేత జీ.ఎం. సయ్యద్‌ 117వ జయంతిని పురస్కరించుకుని.. తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి  కోరుతూ ఆయన స్వస్థలమైన జామ్‌షోరో జిల్లాలోని సాన్‌ పట్టణంలో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు ‘సింధుదేశ్‌’ కావాలనే నినాదాలు మిన్నంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని