close
విన్నపాలు వినిపించారు.. 

ప్రధానితో పలువురు ముఖ్యమంత్రుల భేటీ 
తమ రాష్ట్రాల సమస్యలపై ఏకరువు 
కేంద్ర సాయాన్ని అభ్యర్థిస్తూ విజ్ఞప్తులు

దిల్లీ: నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా దిల్లీ చేరుకున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెడుతూ... కేంద్ర సాయాన్ని అభ్యర్థించారు. రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

వరద సాయానికి విజయన్‌ వినతి 
వరదలతో అతలాకుతలమైన కేరళకు తదుపరి సాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కోరారు. తిరువనంతపురం విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించవద్దని అభ్యర్థించారు.
రాష్ట్ర హోదా ఇవ్వండి: నారాయణసామి 
పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని సీఎం వి.నారాయణసామి కోరారు. తమకు అందించే కేంద్ర సాయాన్ని 10% పెంచాలన్నారు. శాసనసభ భవనం, కన్వెన్షన్‌ సెంటర్‌ల నిర్మాణానికి రూ.1000 కోట్ల ఏకమొత్త సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అసోంను ఆదుకోవాలని.. 
వరదలు, ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్న అసోంను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని సీఎం సర్బానంద్‌ సోనోవాల్‌ అభ్యర్థించారు. పునరావాస చర్యలకు నిధులను భారీగా పెంచాలని కోరారు.
ప్రాజెక్టులకు చేయూతనివ్వండి: పళనిస్వామి 
తమిళనాడులో చేపడుతున్న పలు ప్రాజెక్టుల విషయమై ముఖ్యమంత్రి కె.పళనిస్వామి చర్చించారు. పలు అభివృద్ధి పథకాలకు సాయం అందించాలని లేఖ అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, గజేంద్రసింగ్‌ షెకావత్‌లతోనూ సీఎం సమావేశమయ్యారు. మేకెదాటు జలాశయం విషయాన్ని షెకావత్‌తో చర్చించారు.
గిరిజనులకు సాయం చేయాలి: భూపేశ్‌ 
ఛత్తీస్‌గఢ్‌లో 70 లక్షల గిరిజన, 58 లక్షల పేద కుటుంబాలకు చెందిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని సీఎం భూపేశ్‌ బఘేల్‌ అభ్యర్థించారు. ధాన్యం రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరారు. ఇంటింటికీ మంచినీటిని అందించే ప్రాజెక్టుకు నూరుశాతం గ్రాంటును మంజూరు చేయాలన్నారు. ఎస్టీ, సంప్రదాయ అటవీ నివాస రైతులకూ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన సాయం అందించాలన్నారు.
కరవు నుంచి కాపాడాలి: కుమారస్వామి 
తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న కర్ణాటకకు భూరి సాయం అందించాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. రైతులను ఆదుకునేందుకు తాము ప్రతిపాదించిన రూ.2,064 కోట్లు, ఉపాధి హామీ కింద ఇవ్వాల్సిన రూ.1,500 కోట్ల బకాయిలనూ త్వరగా అందించాలని కోరారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. కృష్ణా, మహాదాయి నదుల నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన జలాల విషయమై ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఉద్యమంగా వాననీటి సంరక్షణ: సర్పంచులకు ప్రధాని లేఖ

దిల్లీ: వాన నీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలచాలని ప్రధాని మోదీ దేశంలోని అన్ని గ్రామాల సర్పంచులకు లేఖలు రాశారు. ‘‘వర్షాకాలం ఆరంభమవుతోంది. సరిపడా వాన నీటితో దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు. ప్రకృతి ఇచ్చే ఈ కానుకను మనం గౌరవించాలి. వర్షాలు మొదలుకాగానే సాధ్యమైనంత ఎక్కువగా వాన నీటిని పరిరక్షించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని కోరారు. చెక్‌ డ్యామ్‌ల ఏర్పాటుతోపాటు నదులు, కాలువల వెంబడి కరకట్టలు నిర్మించేందుకు, డ్యామ్‌ల నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి చెరువులను ప్రక్షాళన చేయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఆ నీటిని అనేక అవసరాలకు ఉపయోగించుకోవడానికి వీలవుతుందని తెలిపారు. సర్పంచులంతా ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి, తాను రాసిన లేఖను చదివి వినిపించాలని కోరారు. ‘‘నీటి ఉద్యమాన్ని కూడా స్వచ్ఛతా కార్యక్రమం తరహాలో విజయవంతమైన ఒక ప్రజా ఉద్యమంగా మలచేందుకు సహకరించాలి’’ అని కోరారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, నవభారత సృష్టికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.