close
నూతన చట్టంతోనే పుర పోరు

18, 19 తేదీల్లో ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు
బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ
ఆగస్టు రెండో వారంలోపు ఎన్నికలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పురపాలక ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై కొత్త పురపాలక బిల్లును ఆమోదించనుంది. గతంలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చి ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తర్వాతే పుర పోరు జరిపేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. బిల్లు ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. ఆ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులతో తుది బిల్లును రూపొందించనుంది. శాసనసభ, శాసనమండలిలో దీన్ని ఆమోదించాక కొత్త చట్టాన్ని అమలులోకి తేనుంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత మూడు రోజులుగా పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. పుర చట్టం అమలులోకి వచ్చాక పురపాలక ఎన్నికలను నిర్వహిస్తామని కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో వెల్లడించారు. తొలుత ఎన్నికల నిర్వహణకు 119 రోజులు గడువు కావాలని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. తర్వాత జులై నెలాఖరులోపు పురపాలక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రకారం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లకు ప్రాతిపదిక అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ముందుకు తీసుకువచ్చింది. ఏడో తేదీకి వార్డుల పునర్విభజన పూర్తి చేయగా ఈనెల 14వ తేదీ నాటికి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అప్పటికి ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 14 లేదా 15న రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలకశాఖ అందజేస్తుందని.. 15 లేదా 16న ఎన్నికల ప్రకటన వెలువడుతుందని భావించారు. తాజాగా కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఆగస్టు రెండో వారంలోపు ఎన్నికలు నిర్వహించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

50 శాతం రిజర్వేషన్లు
పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు ముందు ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్‌ లేదా చట్టం తీసుకురావాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా అమలు చేయాల్సి ఉంది. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లను అమలు చేసింది. తాజాగా రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ తీసుకురావాలి. లేదంటే ప్రత్యేక చట్టం చేయాల్సి ఉంది. కొత్త పురపాలక చట్టంలో రిజర్వేషన్లను 50 శాతంగా నిర్ణయిస్తూ ప్రత్యేక విభాగం ఉంది. ఈ చట్టం ఆమోదం పొందితే రిజర్వేషన్ల అంశం కూడా కొలిక్కి రానుంది.

మూడు నెలలుగా కసరత్తు: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత మూడు నెలలుగా పుర చట్టం రూపకల్పనపై కసరత్తు చేశారు. నిపుణులు, విశ్రాంత అధికారులు, ఉన్నతాధికారుల సలహాలు తీసుకున్నారు. విదేశాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేసి ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. అవినీతిరహితంగా, గుణాత్మక పాలన, ప్రజలకు పారదర్శక సేవలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు బాధ్యతల వంటి అంశాలను చేర్చి దీనికి తుది రూపు తెచ్చారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.