close
మూడేళ్ల తర్వాతే అవిశ్వాసం

పౌరసేవలు, ఈ-గవర్నెన్స్‌, ఆన్‌లైన్‌ సేవలు చట్టబద్ధం
పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు
మున్సిపాలిటీలపై కలెక్టర్లకు విశేషాధికారాలు
మున్సిపాలిటీలో పనులు ప్రభుత్వం చేయవచ్చు
హైదరాబాద్‌ చుట్టూ ఏడు కార్పొరేషన్లు
రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు.. 13 కార్పొరేషన్లు
మరింత జవాబుదారీతనం.. మరింత బాధ్యత
శాసనసభలో పురపాలక కొత్త బిల్లు

తెలంగాణలో జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పురపాలక చట్టం తీసుకురానుంది. రాష్ట్ర పురపాలక చట్టం-2019 బిల్లును గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. పౌరసేవలు.. పచ్చదనం పెంపు.. పర్యావరణ పరిరక్షణ.. ఘన వ్యర్థాల నిర్వహణ, ఈ-గవర్నెన్స్‌, ఆన్‌లైన్‌ సేవలు ఇక చట్టబద్ధమే. ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, వార్డు కమిటీలకు చట్టంలో బాధ్యతలను ప్రత్యేకంగా నిర్దేశించారు. పురపాలక సంఘాలపై కలెక్టర్ల ప్రత్యేక అజమాయిషీ ఇస్తూ కొత్త చట్టంలో పలు అంశాలను చేర్చారు.

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పురపాలక బిల్లులో పలు అంశాలు చట్టం పరిధిలోకి వచ్చాయి. పట్టణవాసుల సేవే ధ్యేయంగా రూపుదిద్దుకున్న ఈ చట్టంలో ప్రత్యేకంగా ఉన్న పట్టణ ప్రణాళికను, సిటిజన్‌ చార్టర్‌లో ఉన్న పౌరసేవలను పూర్తిగా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. సేవలు అందించడంలో జాప్యానికి కారణమైన వారి నుంచి జరిమానా వసూలును నిర్దేశించారు. ప్రతి పురపాలక సంఘం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పౌరసేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆస్తిపన్ను స్వీయ మదింపు విధానాన్ని పురపాలక చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. గతంలో నాలుగేళ్లలోపు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉండేది కాదు. కొత్త చట్టంలో మూడేళ్లకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. కొత్త పురపాలక సంఘాల ఏర్పాటు, కొత్త ప్రాంతాల చేర్పు.. తొలగింపు.. పురపాలక సంఘం పేరు మార్పు తదితరాలన్నింటినీ శాసనసభ ఆమోదించాల్సిందే. పురపాలక బిల్లులో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు
పురపాలక సంస్థల్లో రిజర్వేషన్లను 50 శాతంగా నిర్ణయిస్తూ ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తింపచేస్తారు. 50 శాతంలో ఎస్సీ, ఎస్టీలకు పోగా మిగిలిన శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే విధానం అమలైంది. మొత్తంలో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు అమలవుతాయి. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పదేళ్లకోసారి రిజర్వేషన్లు మారతాయి. జీహెచ్‌ఎంసీతో కలిపి పురపాలక ఛైర్‌పర్సన్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేస్తారు.

ఛైర్‌పర్సన్‌ల విధులు
ప్రతి నెలా సమావేశం నిర్వహించాలి. కనీసం 50 శాతం మంది సభ్యులు కోరితే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ బాధ్యత చేపట్టాలి. ఇంటింటి చెత్త సేకరణ.. శాస్త్రీయ విధానంతో ఘన వ్యర్థాలను నిర్వహించే విధానాలు అమలు చేయాలి. పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు జల వనరులను సంరక్షించాలి. ప్రభుత్వ భూములను, ఖాళీ స్థలాలను కాపాడాలి. ఏటా లెక్కల ఆడిట్‌ పూర్తి చేయాలి. వృథా నీటిని అరికట్టాలి. వాననీటి సంరక్షణ నిర్మాణాలను ప్రోత్సహించాలి.

పచ్చదనం కార్యాచరణ ప్రణాళిక
ప్రతి పురపాలికలో గ్రీన్‌ సెల్‌ ఏర్పాటు చేసి బడ్జెట్‌లో 10 శాతం నిధులను కేటాయించాలి. నర్సరీలు పెంచడం, మొక్కలు నాటడం చేపట్టాలి.కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ, జిల్లా అటవీ సంరక్షణ అధికారి లేదా అతని హోదాతో సమానమైన అటవీశాఖ అథారిటీతో కలసి సంబంధిత పురపాలక కమిషనర్లు వార్డుల వారీగా ఐదేళ్లకు పచ్చదనం కార్యాచరణ ప్రణాళిక (గీన్‌ యాక్షన్‌ ప్లాన్‌)ను రూపొందించాలి. పురపాలక శాఖ గ్రీన్‌ బడ్జెట్‌ నుంచి నిధులను వినియోగించుకోవాలి. మేయర్‌ లేదా ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌లు నర్సరీల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మొక్కల పెంపకం కోసం వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించాలి. వార్డు సభ్యులు బాధ్యత తీసుకుని.. 85 శాతం మొక్కలు బతికేలా చూడాలి.

ఇలా తొలగించవచ్చు
ఛైర్‌పర్సన్‌ లేదా వైస్‌ ఛైర్‌పర్సన్‌ను ప్రభుత్వం లేదా కలెక్టర్‌ సస్పెండ్‌ చేయడానికి కొత్త చట్టం అవకాశం కల్పిస్తోంది. చట్టం అతిక్రమణ, విధుల నిర్వహణలో విఫలం, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన, ప్ర£వర్తన సరిగా లేనపుడు, నిధులు దుర్వినియోగం, నిర్దేశించిన విధులను నిర్వహించే సామర్థ్యం లేనపుడు ఛైర్‌పర్సన్‌ లేదా వైస్‌ ఛైర్‌పర్సన్‌ను తొలగించేలా ఇందులో చేర్చారు. ప్రత్యేక అధికారుల నియామకంతో పాటు, పురపాలక సంఘాన్ని పర్యవేక్షించేందుకు అధికారులను నియమించేందుకు కొత్త చట్టం అవకాశం కల్పించనుంది.

కలెక్టర్లకు విశేషాధికారాలు
పురపాలక తీర్మానాలను అమలు చేయడంలో చట్టాన్ని అమలు చేసేందుకు కలెక్టర్‌కు ప్రత్యేక అధికారాలు చట్టంలో కల్పించారు. జిల్లా కలెక్టర్‌ వారానికి  పురపాలక సంఘాన్ని తనిఖీ చేసి పనితీరును సమీక్షించాలి. కలెక్టర్లు వారి పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. అత్యవసర పనులను చేయాలని కలెక్టర్‌ ఆదేశించవచ్చు. నిధులను మాత్రం పురపాలక సంఘం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లించకుంటే మున్సిపల్‌ నిధుల నుంచి చెల్లించాలని కలెక్టర్‌ పురపాలక కమిషనర్‌ను ఆదేశించవచ్చు. కౌన్సిల్‌ తీర్మానాలను సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్‌కు కొనసాగించారు. పురపాలక సంఘం చేసిన తీర్మానం లేదా జారీ చేసిన లైసెన్స్‌, ఉత్తర్వులు, అనుమతులను రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉంది.

కొత్తగా ఏడు కార్పొరేషన్లు
రాష్ట్రంలో కొత్తగా ఏడు నగర పాలక సంస్థలు ఏర్పాటు కానున్నాయి. బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట, బోడుప్పల్‌, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట నగరపాలక సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో మీర్‌పేట, జిల్లేలగూడ రెండు పురపాలక సంఘాలు కలిసి మీర్‌పేట కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, రామగుండం నగర పాలక సంస్థలు ఉన్నాయి. తాజాగా కొత్త నగర పాలక సంస్థల ఏర్పాటు నిర్ణయంతో రాష్ట్రంలో పురపాలక సంఘాలు 128, నగర పాలక సంస్థలు 13 కానున్నాయి.

ప్రభుత్వమే నేరుగా పనులు

పురపాలక సంఘంలో ప్రభుత్వమే నేరుగా పనులు చేపట్టే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుంది. తాగునీరు, డ్రైనేజి వంటి పనులను ప్రభుత్వం నిర్దేశించిన వ్యక్తులతో పనులు చేయించి పురపాలకశాఖ నుంచి నిధులు చెల్లించాలని ఆదేశించవచ్చు. ప్రభుత్వం పురపాలక సంఘానికి ప్రత్యేక ప్రణాళిక కమిటీలను నియమించవచ్చు. ఈ కమిటీలు ఆ పురపాలక సంఘంలో చేపట్టే అభివృద్ధి పనులను నిర్దేశిస్తుంది. ఆ పనులను పురపాలిక చేపట్టాల్సి ఉంటుంది. ప్రణాళికల తయారీ, అభివృద్ధి నిర్వహణకు ప్రణాళిక కమిటీల వ్యయాన్ని పురపాలక సంఘం చెల్లించాలి.
* జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల ఉద్యోగులు, హెచ్‌ఎండీఏ సహా ఇతర పట్టణాభివృద్ధి సంస్థలకు ఉద్యోగుల బదిలీ.
* ఆస్తి పన్ను బోర్డు ఏర్పాటు.
* పురపాలక సంఘాల రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు
* ప్రతి పురపాలక సంఘానికీ ప్రత్యేక పారిశుద్ధ్య ప్రణాళిక
* బయోమెడికల్‌, ప్రమాదకర వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక చర్యలు
* పురపాలక దుకాణ సముదాయాల్లో లీజులు రద్దు చేస్తే కోర్టులు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేకుండా చట్టంలో అంశాలు
* ప్రతి పురపాలక సంఘంలో ఒక వైకుంఠధామం
* పర్యావరణానికి హాని కలిగించే వారికి జరిమానా
* నగరాలు, పట్టణాల్లో భూమిని గరిష్ఠ వినియోగం లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటు

చట్టం పరిధిలోకి వచ్చే 25 పౌర సేవల్లో కొన్ని
* నీటి కనెక్షన్‌ - ట్రేడ్‌ లైసెన్స్‌
* ట్రేడ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ - మ్యుటేషన్‌
* ఆస్తి పన్ను మదింపు
* భవన నిర్మాణ అనుమతి
* ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌
* భవన నిర్మాణ అనుమతి సర్టిఫైడ్‌ కాపీ
* భూ వినియోగ సర్టిఫికెట్‌
* జనన ధ్రువీకరణ పత్రం
* మరణ ధ్రువపత్రం  - చెత్త తొలగింపు
* మురుగునీటి కాలువల శుద్ధి

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.