close
సైబర్‌ నేరాలపై పారాహుషార్‌ 

అవగాహన లేకుంటే అనర్థమే 
సైబర్‌ నిపుణులు రక్షిత్‌ టండన్‌..

ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్‌ వచ్చి, అంతర్జాల వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అందరూ సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవలసిన అవసరముందని ప్రముఖ సైబర్‌ నిపుణులు, ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ కన్సల్టెంట్‌ రక్షిత్‌ టండన్‌  అన్నారు. ఆగ్రాకు చెందిన రక్షిత్‌ టండన్‌ ఇరవై ఏళ్ల క్రితమే అంతర్జాల ఆధారిత నేరాలను గుర్తించి, వాటిని అరికట్టేందుకు సొంతంగా పరిశోధన పద్ధతులను కనుగొన్నారు. వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు, వృత్తివిద్య కళాశాలలు, పోలీస్‌ శిక్షణ కేంద్రాలు, సీబీఐ, రాష్ట్ర పోలీస్‌ శాఖలు ఏర్పాటు చేస్తున్న సదస్సుల్లో పాల్గొని సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ‘అంతర్జాల భద్రత’ అంశంపై హైదరాబాద్‌ పోలీసులు మంగళవారం నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలివి.

యువతులు, మహిళలు తమ వ్యక్తిగత చిత్రాలను సన్నిహితులకు పంపుతున్నామనుకుని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీనివల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో ఊహించడం లేదు.ఈ చిత్రాలను అంతర్జాలం ద్వారా తీసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు డేటింగ్‌ యాప్‌లలో ఉంచి సొమ్ము చేసుకుంటున్నారు. అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో ఉంచుతూ రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు

సైబర్‌ నేరగాళ్లు తప్పుడు ఖాతాలు, దొంగ సిమ్‌కార్డులతో మోసాలు, నేరాలు చేస్తూ తాము పోలీసులకు పట్టుబడబోం అనుకుంటున్నారు.. ఇది వారి భ్రమ...  ఒక్కసారి అంతర్జాలంలోకి ప్రవేశించాక వారి అడుగులు (డిజిటల్‌ ఫుట్‌ ప్రింట్లు) ఎక్కడికీ వెళ్లవు. వాటి ఆధారంగా దేశంలో ఎక్కడున్నా సరే గుర్తించవచ్చు. అలాంటివారిని సాధ్యమైనంత వేగంగా పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు.. 

వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉండాలంటే ప్రైవసీ సెట్టింగ్స్‌కు వెళ్లి అక్కడ  ఐచ్ఛికాలను ఎంచుకోండి. ఫేస్‌బుక్‌ ఖాతాలను దుర్వినియోగం చేసేందుకు స్కామర్లు మీ స్నేహితులు పంపించినట్లు లింకులు పంపుతుంటారు.నిర్ధారించుకున్నాకే వాటిని తెరవండి.

* మీ వ్యక్తిగత వివరాలు మీ స్నేహితులు, కుటుంబసభ్యుల వివరాలు ఫోన్‌ నంబర్లు ‘హైడ్‌’ అన్న ఐచ్ఛికం ద్వారా ఇతరులకు కనిపించకుండా చేయవచ్చు. చిన్నపిల్లలు మొబైల్‌ ద్వారా ఫేస్‌బుక్‌ చూస్తుంటే హ్యాకింగ్‌కు గురికాకుండా ఫేస్‌బుక్‌ డాట్‌కాం/మొబైల్‌ ప్రొటెక్షన్‌లో మీ వివరాలు నమోదు చేయండి

విద్యార్థినులు, యువతులు, మహిళలు ప్రొఫైల్‌ పిక్చర్‌గా తమ ఫొటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి. గంటల వ్యవధిలో అవి వాట్సాప్‌, గూగుల్‌ క్లౌడ్‌ద్వారా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. ‘లాస్ట్‌ సీన్‌’, ‘ప్రొఫైల్‌ ఫొటో’, ‘మై కాంటాక్ట్స్‌’కు ప్రైవసీ సెట్టింగ్స్‌ను పెట్టుకోండి.

బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వై-ఫై సౌకర్యం ఉన్నప్పుడు వాట్సాప్‌ను ఉపయోగించవద్దు. వై-ఫై పాస్‌వర్డ్‌ ద్వారా మీ వాట్సాప్‌ నంబర్‌ తెలిసిపోతుంది. మాల్‌వేర్‌, వైరస్‌లు దాడి చేయవచ్చు. వాట్సాప్‌ ఉన్న మీ ఫోన్‌ను అపరిచితులకు ఇవ్వకండి. వారు ల్యాప్‌టాప్‌ ద్వారా మీ వాట్సాప్‌ ఖాతాను తెరిచి దుర్వినియోగం చేయనున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తిగత ఫోటోలు, మీ చిరునామా వివరాలు, మీరు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాన్ని షేర్‌ చేయకండి. మీ శత్రువులు, అపరిచితులు నేరుగా మీ వద్దకు వచ్చి దాడి చేసే అవకాశాలున్నాయి. 
అనుమానాస్పద ప్రకటనలు.. ‘ఉచితంగా మొబైల్‌ను  రీ-ఛార్జి చేసుకోండి... మీ ఖాతా నెమ్మదిగా ఉందా... మీ పాస్‌వర్డ్‌తో మళ్లీ ప్రారంభించండి’ లాంటి వాటిని నమ్మవద్దు. ఇవన్నీ మోసపూరిత ప్రకటనలే. 
మీ ఆన్‌లైన్‌ బ్యాంక్‌, ఫేస్‌బుక్‌, మెయిల్‌ ఖాతాలన్నింటికీ ఒకే పాస్‌వర్డ్‌ ఎప్పటికీ ఉపయోగించవద్దు. మీకు తెలియని ఫోన్‌ నంబర్ల ద్వారా ఫోన్లు వచ్చినా, సంక్షిప్త సందేశాలు వచ్చినా స్పందించకండి.
- ఈనాడు, హైదరాబాద్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.